బొద్దింకలు కనపడితే కొంతమంది భయపడిపోతారు, మరికొందరు వాటిని చంపే వరకు వదిలిపెట్టరు.కానీ జర్మనీ శాస్త్రవేత్తలు మాత్రం మరోరకంగా ఆలోచించారు. వాటిని గూఢచర్యానికి ఉపయోగించుకోవాలని అనుకున్నారు. వెంటనే బొద్దింకల్ని పట్టుకుని ప్రయోగాలు మొదలు పెట్టారు. వాటికి రోబో సూట్ లాంటి బ్యాక్ ప్యాక్ (బ్యాగ్)లు తగిలించారు. వాటిలో సెన్సార్లు అమర్చారు, చిన్న చిన్న కెమెరాలు పెట్టారు. కఠినమైన ప్రాంతాల్లో వాటిని వదిలిపెట్టి పనితీరుని పరిశీలించారు. అద్భుతం, ఆ బొద్దింక రోబోలు బ్రహ్మాండంగా పనిచేశాయి. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా అవి దూసుకెళ్లాయి. అవసరమైన సమాచారాన్ని సేకరించాయి. ఇంకేముంది, ఈ ప్రయోగం సక్సెస్, రాబోయే రోజుల్లో రోబో సైన్యంతోపాటు, బొద్దింక సైన్యం కూడా యుద్ధభూమిలో గూఢచర్యానికి సిద్ధమవుతోందనమాట.
రోబోలు కూడా చేయలేని పని..
జర్మనీకి చెందిన స్వార్మ్ బయోటాక్టిక్స్ సంస్థ ఈ ప్రయోగాలు చేపట్టింది. బొద్దింకలు వంటి కొన్ని సూక్ష్మ కీటకాలు కఠిన వాతావరణ పరిస్థితుల్ని కూడా తట్టుకుంటాయి. మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు వెళ్తాయి. అదే సమయంలో చిన్న చిన్న రోబోలు కూడా వెళ్లలేని ప్రాంతాలకు ఇవి వెళ్లగలవు. అందుకే బొద్దింకలను తమ ప్రయోగాలకు వారు ఎంపిక చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న రోబోలను తయారు చేసినా, వాటిని స్కానింగ్ పరికరాలు పసిగడతాయి. అంతే కాదు, వాటి తయారీకి కూడా ఖర్చు ఎక్కువ. అందుకే సింపుల్ గా బొద్దింకలకు తక్కువ ఖర్చుతో కూడిన కొన్ని పరికరాలను అమర్చి వాటిని గూఢచారులుగా ఉపయోగించారు. వీటిని సైబోర్గ్ కాక్రోచెస్ అని పిలుస్తున్నారు.
మరిన్ని పరిశోధనలు
స్వార్మ్ బయోటాక్టిక్స్ కంపెనీ రోబోటిక్స్ ని అభివృద్ధి చేస్తోంది. డ్రోన్ లు కూడా చేరుకోలేని ప్రాంతాల్లో నిఘా కోసం కొత్త ప్రయోగాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. రోబోలు కూడా కొన్ని సందర్భాల్లో అలాంటి ప్రదేశాలను చేరుకోలేవు. వాటికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు బొద్దింకలు కనపడ్డాయి. ఇవి మాత్రం వాటికి అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేశాయి. ఈ ప్రయోగాలతో జర్మన్ కంపెనీ పేరు మారుమోగిపోయింది. ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా కంపెనీలనుంచి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మరిన్ని పరిశోధనలకు మద్దతిచ్చాయి.
ట్రెండ్ మారింది..
కాలం మారింది, రాబోయే రోజులన్నీ రోబోలవే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రోబోలతో అన్ని పనులు చక్కబెట్టుకునే సమయం వస్తోంది. అయితే ఇక్కడ కూడా హైబ్రిడ్ మోడల్స్ రంగప్రవేశం చేశాయి. సహజసిద్ధమైన బొద్దింకలను వాడుకుంటూ, వాటిని బయో-రోబోటిక్ స్వార్మ్‌లు గా మార్చడంతో కొత్త ట్రెండ్ మొదలైంది. వీటికి బొద్దింకలకు అమర్చిన అధునాతన సెన్సార్లు, స్వార్మ్ ఇంటెలిజెన్స్ వాటి సహజ చలనశీలతను పెంచుతాయి. ఇతర వ్యవస్థలు చేరుకోలేని రియల్-టైమ్ డేటా సేకరణను ఇవి ప్రారంభిస్తాయి.
అంతా అందులోనే..
బొద్దింకల వెనక భాగంలో అమర్చిన కాంపాక్ట్ పేలోడ్ ఈ గూఢచర్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. గైడెడ్ మూమెంట్, రియల్-టైమ్ డేటా కలెక్షన్, ఎన్‌క్రిప్టెడ్ షార్ట్-రేంజ్ కమ్యూనికేషన్‌ను ఎనేబుల్ చేస్తే ప్రతి కీటకం ఒక బయో-రోబోటిక్ స్కౌట్‌గా మారుతుంది. వాటి ద్వారా మనకు కావాల్సిన పనులు చేయించుకోవచ్చు. వీటిని వైరి వర్గాలు గుర్తించడం కూడా కష్టం. పూర్తిగా రోబోలు కావు కాబట్టి ఈ సగం సగం రోబోలను కీటకాలే అనుకుంటారు. ఆ కీటకాలు తమ సహజ లక్షణాలతో ప్రవర్తిస్తూ అవతలి వారి రహస్యాలను మనకు చేరవేస్తాయి.