మనం ప్రతి రోజూ బియ్యం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉపయోగిస్తాం. లేచినప్పటి నుంచి పడుకునే వరకు రకరకాల పద్దతులలో తీసుకుంటాం. అయితే, వీటిని పండించిన రైతుల వివరాలు ఏవీ తెలియదు. కానీ, ఓ దేశంలో చక్కటి పద్దతి పాటిస్తున్నారు. రైతులకు అద్భుతమైన గౌరవాన్ని అందిస్తున్నారు. పండ్లు, కూరగాయలపై వాటిని పండించిన రైతుల ఫోటోలు, పేర్లతో పాటు వారి వివరాలను ముద్రిస్తారు. ఈ విధానంతో రైతుల పట్ల నమ్మకం, పారదర్శకత, గౌరవాన్ని అందిస్తుంది.
భారతీయులు తమకు కావాల్సిన కూరగాయలు, పండ్లు, ఇతర వస్తువులను ఆయా దుకాణాల నుంచి కొనుగోలు చేస్తారు. కానీ, వాటిని ఎవరు పండించారనే సమాచారం ఉండదు. పైగా వారికి సరైన గిట్టుబాటు ధర కూడా ఉండదు. చాలాసార్లు అగ్గువకే అమ్ముతారు. కొన్నిసార్లు కనీస ధర లభించక రోడ్ల మీద పడేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే, జపాన్ రైతుల విషయంలో వినూత్న పద్దతి పాటిస్తుంది. వారు పండించే పండ్లు, కూరగాయలకు మంచి గౌరవాన్ని అందిస్తుంది. అక్కడ పండ్లు, కూరగాయలను ప్యాకెట్లలో అమ్ముతారు. ఆ ప్యాకెట్ల మీద వాటిని పండించిన రైతుల ఫోటోలు, పేర్లు సహా వారి వివరాలను ప్రింట్ చేస్తారు.
రైతులకు తగిన గౌరవాన్ని అందించే సంప్రదాయం జపాన్ లో ఉంది. అందుకే, వారు పండించిన పంటల మీద వారి గురించి వివరాలను పొందుపరుస్తారు.ముఖ్యంగా సూపర్ మార్కెట్లు, స్థానిక సహకార సంస్థలు, జపాన్ వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో నడిచే రైతు మార్కెట్లలో ఈ పద్దతి కామన్. రైతుల ఫోటోలను వారి ఉత్పత్తులపై ప్రింట్ చేయడం వెనుక మంచి ఉద్దేశం ఉందంటారు జపాన్ అధికారులు. వినియోగదారులలో నమ్మకం, రైతులకు గౌరవం, సరఫరాలో పారదర్శకత అందించడం కోసమే ఇలా చేస్తున్నట్లు చెప్పారు.
Read Also: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?
అటు జపనీయులు తాము తీసుకునే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునేందుకు ఎక్కువ ప్రధాన్యత ఇస్తారు. రైతుల ఫోటోలు, పేర్లు, వారి గురించి రాసిన వివరాల ఆధారంగా ఆ ప్రొడక్ట్ నాణ్యత, భద్రత మీద నమ్మకాన్ని కలిగి ఉంటారు. జపాన్ లో వ్యవసాయాన్ని ఎంతో గౌరవంగా చూస్తారు. రైతులను ఎంతో అభిమానిస్తారు. ఆయా ఉత్పత్తుల మీద రైతుల ఫోటోలు, పేర్లు ఉంచడం వల్ల సాగుదారులు, వినియోగదారుల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. అదే సమయంలో జవాబుదారీతనాన్ని గుర్తు చేస్తుంది. స్ట్రాబెర్రీలు, పుచ్చకాయలు, ఆపిల్స్ లాంటి ఉత్పత్తులకు కచ్చితంగా రైతులకు సంబంధించిన వివరాలను యాడ్ చేస్తారు. పారదర్శకత, నమ్మకం, వ్యవసాయం పట్ల గౌరవానికి నిదర్శనంగా ఈ వివరాలను ముద్రిస్తారు. జపనీస్ వ్యవసాయం ప్రపంచంలో అత్యంత నమ్మకమైన వ్యవసాయంగా గుర్తింపు తెచ్చుకుంది.
Read Also: ప్రపంచంలోనే పొడవైన పేరున్న వ్యక్తి ఇతడే.. ఏకంగా గిన్నిస్ రికార్డు కొట్టేశాడు!