Toyota Hiace Caesar:టయోటా అనగానే మనకు గుర్తుకు వచ్చేది నమ్మకం, బలం, నాణ్యత. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నమ్మకమైన వాహనాలను తయారు చేసే కంపెనీగా టయోటా పేరు నిలిచిపోయింది. అయితే ఇప్పుడు అదే కంపెనీ ఆధారంగా రూపొందిన ఒక ప్రత్యేక లగ్జరీ వాహనం కార్ ప్రేమికులను, వ్యాపార వర్గాలను ఆకట్టుకుంటోంది. అదే టయోటా హియేస్ సీజర్ క్రౌన్ లగ్జరీ ఎడిషన్. ఇది టయోటా అధికారికంగా విడుదల చేసిన మోడల్ కాదు. సాధారణ హియేస్ వాన్‌ను ఆధారంగా తీసుకుని ప్రైవేట్ కన్వర్షన్ కంపెనీలు దీనిని లగ్జరీ ఎడిషన్‌గా మార్చాయి. అంటే ఇది కస్టమ్ మేడ్ వాహనం. దీన్ని విఐపిలు, బిజినెస్ మెన్లు, సినీ తారలు, రాజకీయ నాయకులు వంటి ప్రముఖులు ఉపయోగించే స్థాయి వాహనంగా తీర్చిదిద్దారు.
కారు కాదు రాజమహల్
ఇందులో కూర్చుంటే వాహనంలో కాదేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ సీజర్ క్రౌన్ వాన్‌లోకి అడుగు పెట్టగానే అంతా రాజమహల్‌లా కనిపిస్తుంది. లోపలి భాగంలో మెత్తని లెదర్ సీట్లు, సాఫ్ట్ లైటింగ్, ప్రైవేట్ కేబిన్ లా ఉండే సౌకర్యం కల్పించారు. ప్రతి సీటుకు ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్ సదుపాయం ఉంది. కూర్చున్న వ్యక్తికి కావలసిన రీతిలో సీటును సర్దుకోవచ్చు. అంతేకాదు, పాదాలకు రిలాక్సేషన్ కల్పించే ఫుట్ రెస్ట్ కూడా ఉంది. ప్రయాణం చేస్తూ సినిమా చూడాలంటే 32 అంగుళాల పెద్ద ఎల్ఈడి టీవీ, దానికి అనుసంధానంగా ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. వీడియోలు, మ్యూజిక్, మీటింగ్ ప్రెజెంటేషన్స్ అన్నీ సౌకర్యంగా చేయవచ్చు.
ప్రపంచం నుండి పూర్తిగా ప్రైవసీ
విండోస్ కోసం ఎలక్ట్రిక్ కర్టెన్స్ అమర్చారు. ఒక్క బటన్ నొక్కగానే బయట ప్రపంచం నుండి పూర్తిగా ప్రైవసీ లభిస్తుంది. కర్టెన్స్ మూసేసిన తర్వాత కేబిన్‌లోని సైలెన్స్ స్థాయి అంతగా ఉంటుంది, బయటి శబ్ధం ఒక్కటీ వినిపించదు. దీని వలన ప్రయాణంలో కూడా ఒక ఆఫీస్ వాతావరణం, లేదా హోటల్ గది లాంటి సౌఖ్యం లభిస్తుంది. అంతేకాదు, మధ్యలో ఫోల్డింగ్ టేబుల్స్ అమర్చారు. ల్యాప్‌టాప్ పనులు చేయాలా, కాఫీ తాగాలా, ఏదైనా రాయాలా అన్నీ సులభంగా చేసుకోవచ్చు.
Also Read: Oppo Reno8 5G Mobile: ఇంత పవర్‌ఫుల్ ఫోన్ ఇంత తక్కువ ధరకేనా.. ఒప్ప రెనో8 5జి రివ్యూ
సీజర్ క్రౌన్ ఎడిషన్‌కి ప్రత్యేకమైన బాడీ కిట్
బయటకు చూస్తే సాధారణ హియేస్ వాన్‌కి పోలికే ఉండదు. సీజర్ క్రౌన్ ఎడిషన్‌కి ప్రత్యేకమైన బాడీ కిట్ ఇచ్చారు. క్రోమ్ ఫినిషింగ్, పెద్ద అల్లాయ్ వీల్స్, మెరిసే డిజైన్ వాహనానికి ఒక రాజశాఖ స్థాయి లుక్ తెచ్చాయి. రోడ్డుపై ఈ వాహనం కనిపిస్తే లగ్జరీ ఎస్‌యూవి లా అనిపిస్తుంది. దీని డిజైన్ మాత్రమే కాక, డ్రైవ్ అనుభవం కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది.
హైవేల్లో హై స్పీడ్- లగ్జరీ అనుభూతి
ఇందులో 3.5 లీటర్ల వి6 ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ శబ్ధం లేకుండా సాఫ్ట్‌గా పనిచేస్తుంది. హైవేల్లో హై స్పీడ్‌లోనూ సైలెంట్‌గా సాగే ఈ వాహనం ప్రయాణికుడికి లగ్జరీ అనుభూతిని ఇస్తుంది. వాహనం నడిపే డ్రైవర్‌కి కూడా ఆత్మవిశ్వాసం కలిగించే శక్తివంతమైన ఇంజన్ ఇది.
టయోటా డీలర్‌షిప్‌లలో ఇది దొరకదు
ఇక అవైలబిలిటీ విషయానికి వస్తే ఇది టయోటా కంపెనీ అధికారికంగా విడుదల చేసిన మోడల్ కాదు. టయోటా డీలర్‌షిప్‌లలో ఇది దొరకదు. కానీ ప్రైవేట్ కన్వర్షన్ కంపెనీలు లేదా మోడిఫికేషన్ స్పెషలిస్టులు హియేస్ వాన్‌ని కొనుగోలు చేసి, దానిని పూర్తిగా లగ్జరీ వెర్షన్‌గా మార్చి ఇస్తారు. అంటే ఇది కస్టమ్ బిల్ట్ వెహికల్, ప్రతి కస్టమర్‌కి అనుగుణంగా ఇంటీరియర్, కలర్, ఫీచర్లు కూడా మార్చవచ్చు.
జపాన్ మార్కెట్లో చాలా ప్రసిద్ధి
ఇప్పుడు చాలా మందికి సందేహం ఇది టయోటా క్రౌన్ కార్‌తో సంబంధముందా? అని. వాస్తవానికి లేదు. టయోటా క్రౌన్ అనేది ఒక స్వతంత్ర లగ్జరీ సెడాన్ మోడల్, జపాన్ మార్కెట్లో చాలా ప్రసిద్ధి చెందినది. అయితే హియేస్ సీజర్ క్రౌన్ అనేది ఒక వాన్ కన్వర్షన్ మాత్రమే. ఇది రోడ్డు మీద నడిచే మూవింగ్ ప్యాలెస్ లాంటిది. రోడ్డుపై ఈ వాహనం కనపడితే తల తిప్పి చూడక మానరు. అన్నీ ఒక్క వాహనంలో కావాలంటే టయోటా హియేస్ సీజర్ క్రౌన్ లగ్జరీ ఎడిషన్‌కన్నా ఉత్తమ ఎంపిక లేదు.