AI Minister Diella: టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ రోజుల్లో పెను సంచలనం సృష్టించేలా.. అల్బేనియా దేశ ప్రధాని ఎడి రేమా ఓ వింత ప్రకటన చేశారు. అల్బేనియాకు చెందిన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మంత్రి డియెల్లా గర్భం దాల్చిందని, త్వరలో ఆమె 83 మంది పిల్లలకు జన్మనివ్వనున్నట్లు తెలిపారు. జర్మనీలోని బెర్లిన్‌లో జరిగిన గ్లోబల్ డైలాగ్ సదస్సులో ఎడి రేమో ఈ విచిత్రమైన విషయాన్ని చెప్పారు. ‘ఈరోజు మేము డియెల్లాతో ఓ పెద్ద సాహసమే చేశాం. తొలిసారిగా డియెల్లా గర్భవతైంది, అది కూడా 83 మంది పిల్లలను కంటుంది’ అని తెలిపారు.
ఏఐ మంత్రి డియెల్లా అల్బేనియా ప్రభుత్వ పోర్టల్‌లో ప్రజలకు డిజిటల్ సేవలు అందించడంలో సహాయం చేస్తుంటుంది. అలాంటి AI మంత్రి గర్భం దాల్చడం.. పిల్లలను కనడం వెనకున్న ఆంతర్యం ఏంటంటే.. ఈ 83 మంది AI పిల్లలు పార్లమెంటులోని సోషలిస్ట్ పార్టీకి చెందిన 83 మంది ఎంపీలకు డిజిటల్
సహాయకులుగా పనిచేస్తారని ఆ దేశ ప్రధాని వివరణ ఇచ్చుకున్నారు.
ఈ ఏడాది సెప్టెంబరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధునిక మంత్రిని అల్బేనియా సంప్రదాయ మహిళ దుస్తుల్లో ఉన్న మహిళగా చూపించిన విషయం తెలిసిందే. అప్పటికే ఆమెకు డియెల్లాగా నామకరణం కూడా చేసి, ప్రపంచానికి పరిచయం చేశారు.
AI మంత్రి జన్మనివ్వనున్న ఈ 83 మంది పిల్లల సహాయకుల ముఖ్య లక్ష్యం ఏంటంటే.. పార్లమెంటరీ కార్యకలాపాలను పర్యవేక్షించడమేనట. అంతేకాదు.. చర్యలను రికార్డు చేసి అవసరమైన సమయాల్లో చట్టసభ సభ్యులు ఏ విధంగా స్పందించాలో కూడా వీరు సూచనలు చేస్తారని తెలిపారు. ప్రతి AI సహాయకుడు పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని చర్యల రికార్డు నిర్వహించి, ఏదైనా అంశాన్ని సభ్యులు కోల్పోతే.. వారికి తెలియజేసే బాధ్యత కూడా ఈ AI పిల్లలదేనట.
ప్రభుత్వ టెండర్లలలో 100 శాతం అవినీతిని నిర్మూలించడమే లక్ష్యంగా డియెల్లాను తీసుకొచ్చినట్లుగా అల్బేనియా ప్రధాని గతంలో తెలిపారు. పాలనలో టెక్నాలజీని
ఒక సాధనంగా మాత్రమే కాకుండా, క్రియాశీలక భాగస్వామిగా పరిచయం చేయడం ద్వారా అల్బేనియా ప్రభుత్వం ఒక పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టిందని అక్కడి
మీడియా ప్రశంసించింది.
ఈ వ్యవస్థ 2026 చివరి నాటికి పూర్తిగా అందుబాటులోకి రానుందట. పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌ను పరిశీలించేందుకు, అందులో నెలకొన్న అవినీతిని తరిమి కొట్టేందుకు డియెల్లాను రూపొందించారు. ఈ క్రమంలోనే ఆ శాఖలో ఉన్న అవినీతిని అంతం చేసేందుకు AI ఆధారిత డియెల్లాను క్యాబినెట్ మంత్రిగా నియమిస్తున్నట్లు ఈ ఏడాది సెప్టెంబరులో స్పష్టం చేశారు. ఇలా ఒక AI మంత్రిని నియమించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి కాగా.. డియెల్లా పౌరులకు, వ్యాపార సంస్థలకు ప్రభుత్వ పత్రాలను పొందడంలో కూడా సహాయం చేస్తుందట.