Chittoor: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయాయి. అధికారంలోకి వచ్చి నెలలు గడిచినా, స్థానిక నాయకత్వం కొరవడడం, ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం పార్టీ క్యాడర్‌ను కలవరానికి గురిచేస్తోంది. తంబళ్లపల్లి, తిరుపతి, సత్యవేడు, పుంగనూరు… ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఇన్‌ఛార్జ్‌ల పనితీరుపై క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉందట. అధికారం ఉన్నా తమను తాము రక్షించుకోలేని స్థితిలో ఉన్నామంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అధినేత చంద్రబాబు ఏ మేరకు కఠిన నిర్ణయాలు తీసుకుంటారనే దానిపైనే ఉమ్మడి చిత్తూరు భవిష్యత్తు ఆధారపడి ఉంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో తీవ్రమైన నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఇన్‌ఛార్జ్‌ల నియామకం, వారి పనితీరుపై పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నదట. నాలుగు కీలక నియోజకవర్గాల్లో పరిస్థితి ‘చుక్కాని లేని నావ’ వలె మారిందట. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం, ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకున్న నేతలకు కీలక పదవులు ఇవ్వడం, వారు లోకల్ నాయకులను విస్మరించి, తమ సొంత కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వడమేనని క్యాడర్ ఆరోపిస్తోంది.
తంబళ్లపల్లి నియోజకవర్గంలో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి టికెట్ పొందిన జయచంద్రారెడ్డి ఇటీవలే నకిలీ మద్యం వ్యవహారంలో చిక్కుకోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆయన పార్టీలో చేరిన సమయంలోనే స్థానిక క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకించినా, కడప జిల్లాకు చెందిన కొందరు నేతల సహకారంతో టికెట్ సంపాదించారట. గత 16 నెలలుగా ఆయన పార్టీ శ్రేణులను అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ నియామకం కంటే, సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని స్థానిక క్యాడర్ పట్టుబడుతోందట. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి తిరిగి వస్తారని ప్రచారం జరుగుతున్నా, గతంలో ఆయన చంద్రబాబుపై చేసిన విమర్శల కారణంగా టీడీపీ కార్యకర్తలు అంతగా ఇంట్రెస్ట్ చూపట్లేదట. మరోవైపు, శంకర్ యాదవ్, తెలుగు యువత నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు ఇన్‌ఛార్జ్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తుండగా, క్యాడర్ మాత్రం ద్విసభ్య కమిటీ ఏర్పాటు చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని కోరుకుంటోందట.
తిరుపతి నియోజకవర్గంలో కూడా ఇదే విధమైన నాయకత్వ శూన్యత నెలకొని ఉందట. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇన్‌ఛార్జీగా ఉన్నప్పటికీ, ఆమెకు సహకరించే నాయకత్వం లేకపోవడంతో ఆమె ప్రయత్నాలు ఫలించడం లేదు. చాలామంది నాయకులు ఇన్‌ఛార్జ్ పదవి కోసం ప్రయత్నించి, ఆశలు వదులుకుని సైలెంట్ అయ్యారు. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉండటం, అధిక సంఖ్యలో వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లు జనసేన వైపు మొగ్గు చూపడం పార్టీని బలహీనపరుస్తోంది. దీనికి తోడు, నగర పాలక సంస్థలో అవినీతి, దందాలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు, ఫలితంగా టీడీపీ క్యాడర్ తీవ్రమైన మానసిక క్షోభకు లోనవుతోందట. ఈ పరిస్థితుల దృష్ట్యా, క్యాడర్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోందట. జె.బి. శ్రీనివాస్, మబ్బు నారాయణ రెడ్డి, దంపూరి భాస్కర్ యాదవ్ లతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తే మూడు బలమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లభించి, పార్టీ బలోపేతం అవుతుందని వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ ఇన్‌ఛార్జ్‌ల నియామకంలో కూడా బలహీనులను పెట్టారనే విమర్శలున్నాయి.
సత్యవేడులో పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. ఎన్నికల ముందు వైసీపీ నుంచి వచ్చి, అందరి వ్యతిరేకత మధ్య విజయం సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం తర్వాత జరిగిన పరిణామాలతో ఇరుక్కుపోయారు. ముఖ్యంగా గ్రావెల్ మాఫియా చేసిన కుట్ర, ఓ మహిళా టీడీపీ నాయకురాలితో ఆయన వీడియో బయటకి రావడం వంటి వాటితో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత శ్రీపతి బాబును కన్వీనర్‌గా నియమించినప్పటికీ, అధిష్టానం ఆయన్ను తొలగించి కాంట్రాక్టర్ శంకర్ రెడ్డిని ప్రోగ్రామ్ కన్వీనర్‌గా నియమించింది.. ఆయనే ఇన్‌ఛార్జీగా చెప్పుకుంటున్నారు. శంకర్ రెడ్డి పార్టీలో చేరిన వెంటనే తన సామాజిక వర్గాన్ని మొత్తం పార్టీలోకి చేర్చి, వారికి అన్ని వ్యవహారాలు అప్పగించడంతో స్థానిక టీడీపీ క్యాడర్ తీవ్ర స్థాయిలో అగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా, ఓ దేవాలయం ధర్మకర్తల నియామకంలో వివాదస్పద మాజీ టీటీడీ బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డి అనుచరుడికి అవకాశం కల్పించడం, అనేక కేసులు ఉన్న వ్యక్తిని చైర్మన్‌గా నియమించడం మరింత వివాదాన్ని రేపింది. ఇక్కడ కూడా తంబళ్లపల్లి మాదిరిగానే భవిష్యత్తులో పార్టీకి నష్టం చేకూర్చవచ్చని క్యాడర్ ఆందోళన చెందుతోంది.
ప్రతిష్టాత్మకమైన పుంగనూరు నియోజకవర్గంలోనూ ఇదే సమస్య తలెత్తింది. ఇన్‌ఛార్జ్ అయిన చల్లా బాబు రెడ్డి చుట్టూ ఉన్న కోటరీతో స్థానిక కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పార్టీ కోసం నష్టపోయిన, జైళ్లకు వెళ్లిన కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోకుండా, ఆయన కోటరీ తమను ఇబ్బంది పెడుతోందని, ముఖ్యంగా వైసీపీలో తమపై దాడులు చేసిన వారికి అండగా నిలుస్తోందని ఆరోపణలు వచ్చాయి. గతంలో రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్త హత్యను కూడా దీనికి నిదర్శనంగా చూపుతున్నారు. అధికారం చేతికి వచ్చినా, కార్యకర్తలు తమ అధికార దర్పం చూపించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని తెలుస్తోంది. పార్లమెంటరీ అధ్యక్షుల నియామకం కూడా కోల్డ్ స్టోరేజ్‌లో ఉండిపోయింది.
మొత్తం మీద, ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మంత్రి ప్రాతినిధ్యం లేకపోవడం, సీనియర్ నాయకులు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడం వంటి పరిస్థితుల్లో, కొత్త ఇన్‌ఛార్జ్‌లు, అధ్యక్షుల నియామకం తర్వాత అయినా తమను పట్టించుకునే వారు ఉంటారని కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అధినేత చంద్రబాబు ఈ అంతర్గత సమస్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపైనే జిల్లా భవిష్యత్తు ఆధారపడి ఉంది.
Story by Venkatesh, Big Tv