Crime in Flight: అమెరికా నుంచి జర్మనీ వెళ్తున్న విమానంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు టీనేజర్లను మెటల్ ఫోర్క్‌తో పొడిచి.. మరో ప్రయాణికురాలిని చెంపదెబ్బ కొట్టిన ఆరోపణలపై 28 ఏళ్ల భారత దేశానికి చెందిన యువకుడిని అమెరికా అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన అక్టోబర్ 25న చికాగో నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్తున్న లుఫ్తాన్సా విమానంలో జరిగింది.
ఇద్దరిపై మెటల్ ఫోర్క్‌తో దాడి..
విమానంలో అలజడి కారణంగా దానిని దారి మళ్లించి బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దించాల్సి వచ్చిందని మసాచుసెట్స్ జిల్లాలోని యుఎస్ అటార్నీ కార్యాలయం సోమవారం ఒక పత్రికా ప్రకటనలో వివరించింది. ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లిగా గుర్తించిన భారత దేశానికి చెందని వ్యక్తి 17 ఏళ్ల ఓ ప్రయాణీకుడిని భుజంపై, మరొక 17 ఏళ్ల ప్రయాణీకుడిని తల వెనుక భాగంలో మెటల్ ఫోర్క్‌తో పొడిచాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ దాడి వల్ల ఓ ప్రయాణికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ALSO READ: Cyclone Montha: తీరాన్ని తాకిన మొంథా తుఫాన్.. ఇంకో 3 గంటల్లో తీరం దాటనున్న సైక్లోన్
విమాన సిబ్బందిని కొట్టడానికి ప్రయత్నించి..?
విమాన సిబ్బంది అతడిని అదుపు చేయడానికి ప్రయత్నించినప్పుడు.. ఉసిరిపల్లి ప్రణీత్ కుమార్ తన చేతితో పిస్తోల్ ఆకారంలో సంజ్ఞ చేసి, దాన్ని నోట్లో పెట్టుకున్నాడని.. ఊహాత్మక ట్రిగ్గర్‌ను లాగినట్లు అటార్నీ కార్యాలయం పేర్కొంది. అనంతరం, తన పక్కనే ఉన్న ఒక మహిళా ప్రయాణీకురాలిపైకి తిరిగి ఆమెను చెంపదెబ్బ కొట్టాడని తెలిపింది. అలాగే ఒక విమాన సిబ్బందిని కూడా కొట్టడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి.
నిందితుడికి పదేళ్లు జైలు శిక్ష.. $2,50,000 జరిమానా
నిందితుడు ప్రణీత్ కుమార్ పై ‘విమానంలో ప్రయాణిస్తుండగా.. శారీరక హాని కలిగించే ఉద్దేశంతో ప్రమాదకరమైన ఆయుధంతో దాడి’ చేసినట్లు అభియోగాలు మోపారు. అక్టోబర్ 25న అరెస్టు అయిన నిందితుడు ప్రణీత్ త్వరలో బోస్టన్‌లోని ఫెడరల్ కోర్టులో హాజరు కావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. అధికారుల సమాచారం ప్రకారం.. నిందితుడు గతంలో స్టూడెంట్ వీసాపై అమెరికాలో కొన్ని నెలలు పాటు జీవనం కొనసాగించాడు. బైబిల్ స్టడీస్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లో చేరాడు. కానీ ప్రస్తుతం అతడికి అమెరికాలో చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ హోదా లేదు. ఈ కేసులో దోషిగా తేలితే. అతడికి గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష, మూడేళ్ల వరకు పేరోల్ పై విడుదల, $250,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
ALSO READ: Cyclone Montha: దూసుకొస్తున్న మొంథా.. ఈ ఏడు జిల్లాల్లో తుఫాన్ ఉగ్రరూపం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు