ISRO Chairman: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నూతన చైర్మన్‌గా వి.నారాయణన్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ ఎస్. సోమనాథ్ పదవీ కాలం సోమవారంతో కంప్లీట్ అవ్వనుంది. అనంతరం జనవరి 14న నారాయణన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
రెండేళ్ల పాటు వి.నారాయణన్ చైర్మన్‌గా కొనసాగనున్నారు. నారాయణన్ ప్రస్తుతం ఇస్రోలో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇస్రో రాకెట్ వ్యవస్థ, స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్‌కు సంబంధించి నాలుగు దశాబ్దాలుగా పలు హోదాల్లో ఆయన పనిచేస్తున్నారు.
నారాయణన్ స్వస్థలం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి. ఖరగ్‌పూర్ ఐఐటీలో క్రయోజనిక్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌తో పాటు ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో ఆయన పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆయన ఎంటెక్‌లో మొదటి ర్యాంక్ సాధించారు. అందుకు గానూ ఆయన సిల్వర్ మెడల్ లభించింది. 2001లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1984లో నారాయణన్ ఇస్రోలో చేరారు. 2018లో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా నియమితులయైన ఆయనకు రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ చోదక వ్యవస్థల్లో మంచి అనుభవం ఉంది. ఆయన ద్రవ, సెమీ క్రయోజెనిక్, క్రయోజెనిక్ చోదక వ్యవస్థల అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. ఇస్రోకు చెందిన జీఎస్‌ఎల్‌వీ మార్క్-2, 3 వాహకనౌకల రూపకల్పనలో కీలక పాత్ర కూడా వహించారు. ఆదిత్య-ఎల్1, చంద్రయాన్-2, చంద్రయాన్-3లోని చోదక వ్యవస్థల అభివృద్ధిలో కూడా నారాయణన్ పాత్ర ఉంది.
చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవ డిగ్రీ పొందారు. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి విశిష్ట పూర్వ విద్యార్థి అవార్డు-2018, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) నేషనల్ డిజైన్ అండ్ రీసెర్చ్ ఫోరం నుంచి నేషనల్ డిజైన్ అవార్డు-2019, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (AESI) నుంచి నేషనల్ ఏరోనాటికల్ ప్రైజ్-2019 అందుకున్నారు. గవర్నింగ్ కౌన్సిల్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIST) బోర్డ్ మెంబర్ గా, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల అకడమిక్ కౌన్సిల్ మెంబర్ గా కూడా సేవలందిస్తున్నారు.
Also Read: IITGN Jobs: బీటెక్ పాసైన వారికి శుభవార్త.. ఈ ఉద్యోగం కొడితే నెలకు RS.2,00,000 పైనే..
నారాయణన్ ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ (IAA) సభ్యుడు, ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ (INAE) ఫెలో, ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ యొక్క స్పేస్ ప్రొపల్షన్ కమిటీ సభ్యుడు, ఇండియన్ సొసైటీ ఆఫ్ సిస్టమ్స్ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ISSE) జాతీయ అధ్యక్షుడిగా పని చేశాడు. ఇండియన్ క్రయోజనిక్ కౌన్సిల్ ఫెలోగా, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యుడిగా, ఐఎన్ ఏఈ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా, వివిధ జాతీయ, అంతర్జాతీయ ప్రొఫెషనల్ బాడీల్లో సభ్యుడిగా సేవలందించారు.