Game Changer.. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar)దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్(Game Change). ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా, మరొకరు పొలిటిషన్ గా పనిచేస్తున్నారు. అలాగే అంజలి(Anjali), కియారా అద్వానీ (Kiara advani) ఇద్దరూ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
గేమ్ ఛేంజర్ కాపీ అంటూ కామెంట్స్..
ఇక అంతా బాగానే ఉన్నా.. తాజాగా ఈ సినిమా కొత్త వివాదంలో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఆ స్టార్ హీరో సినిమాను కాపీ కొట్టారు అంటూ ఒక వార్త తెర పైకి రావడం గమనార్హం. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ సినీ విమర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ‘బ్లూ సట్టై’ సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ సినిమా కాపీ అంటూ ఊహించని కామెంట్లు చేశారు. ఆయన మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ సినిమా విజయ్ కాంత్ (Vijay Kanth) నటించిన ‘తెన్నవన్’ సినిమా కాపీ అంటూ తెలిపారు. నిజాయితీపరుడైన ఒక ఐఏఎస్ అధికారి (రామ్ చరణ్)కి అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడు (ఎస్ జె సూర్య) కి మధ్య జరిగే సంఘర్షణ ఈ గేమ్ ఛేంజర్ కథ అంటూ తెలిపారు. ఇక అలాగే నిజాయితీపరుడైన ఎన్నికల కమిషనర్ తెన్నవన్ ఐఏఎస్, తమిళనాడు ముఖ్యమంత్రి నాజర్ మధ్య జరిగే సంఘర్షణ ఈ తెన్నవన్ సినిమా కథ.. రాజాదురై సినిమా కథను కాపీ కొట్టిన వాళ్లు ఇప్పుడు తెన్నవన్ సినిమాని కూడా కాపీ కొట్టారు అంటూ ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
విడుదలకు ముందు ఇలాంటివి సహజమే..
సాధారణంగా పెద్ద సినిమాలు విడుదల అయ్యేటప్పుడు ఇలాంటి వార్తలు రావడం సహజమే. అందుకే ఇప్పుడు ఈ సినిమా ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే.. ఎస్.జె.సూర్య, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా 300 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా పాటల కోసమే దాదాపు రూ.90 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక సంక్రాంతి బరిలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మరొకవైపు ఈ సినిమా ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అంజలి, కియారా అద్వానీ కూడా సక్సెస్ కోసం గట్టిగా పోరాడుతున్నారు.. మరి వీరిద్దరికీ కూడా ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇలాంటి రోజుకొక వివాదాలు తెరపైకి వస్తూ అభిమానులలో ఆందోళనలను కలిగిస్తున్నాయి.