Centuries In CT 2025: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 రసవత్తరంగా కొనసాగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు పూర్తయ్యాయి. భారత్ సెమీఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. భారత్ తో పాటు న్యూజిలాండ్ కూడా సెమీఫైనల్ కి చేరుకుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతి మ్యాచ్ ఫైనల్ ని తలపిస్తుంది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సెమీఫైనల్స్ రేసులో నిలవడం చాలా కష్టతరం. వరల్డ్ బెస్ట్ 8 టీమ్స్ గ్రూప్ – ఎ, గ్రూప్ – బి గా ఆడుతున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని జట్లు ఒక్కొక్క మ్యాచ్ ఆడేశాయి.
ప్రస్తుతం ఆడే మ్యాచ్ లు అన్నీ సెమిస్ వైపు అడుగులు వేయడానికే. గ్రూప్ – ఏ లో న్యూజిలాండ్, బంగ్లాదేశ్, టీమ్ ఇండియా, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. ఇందులో భారత్ రెండు మ్యాచ్లలో విజయం సాధించి సెమిస్ లో అడుగుపెట్టగా.. పాకిస్తాన్ రెండు మ్యాచ్లలో ఓటమిపాలై ఇంటి దారి పట్టింది. గ్రూప్ – బి లో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ జట్లు ఆడుతున్నాయి. ఇందులో ప్రతి జట్టు ఒక మ్యాచ్ ఆడింది. గ్రూప్ – బి లో సౌత్ ఆఫ్రికా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా, మూడవ స్థానంలో ఇంగ్లాండ్, నాలుగవ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ నిలిచాయి.
అయితే ఈ టోర్నీలో సెంచరీల వరద పారుతూ ఉండడం విశేషం. ఆటగాళ్లు సిక్సులు, బౌండరీలతో శతకాలు నమోదు చేస్తున్నారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్లలో నమోదైన సెంచరీల వివరాలు చూస్తే.. ఓపెనింగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ – పాకిస్తాన్ జట్ల మధ్య పోటీ జరగగా.. ఈ మ్యాచ్ లో రెండు సెంచరీలు నమోదు అయ్యాయి. విల్ యంగ్ 113 బంతులను 107 పరుగులతో సెంచరీ చేయగా, టామ్ లాథమ్ 14 బంతులలో 118 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక భారత్ – బంగ్లాదేశ్ మధ్య రెండవ మ్యాచ్ జరగగా.. ఇందులో రెండు సెంచరీలు నమోదయ్యాయి.
బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహీద్ హృదోయ్ 118 బంతులలో శతకం సాధించాడు. ఇక ఇదే మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ గిల్ 101 శతకం సాధించాడు. ఆ తరువాత ఆఫ్ఘనిస్తాన్ – సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ రికెల్టన్ 103 సెంచరీ తో చెలరేగాడు. ఇక నాలుగవ మ్యాచ్ ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ మధ్య జరగగా.. ఈ మ్యాచ్ లో ఛాంపియన్స్ ట్రోఫీలోనే అత్యధిక రికార్డు స్కోర్ నమోదయింది. ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకేట్ {165} పరుగులతో ఛాంపియన్ స్ట్రోఫీలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించాడు.
అలాగే ఇదే మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ జోష్ ఇంగ్లీస్ 120 పరుగులు చేసి తన జట్టును గెలిపించుకున్నాడు. ఆ తర్వాత భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ {100} శతకం సాధించాడు. ఇక సోమవారం బంగ్లాదేశ్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర 105 బంతులలో 112 పరుగులు చేశాడు. ఇలా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్లలో 9 సెంచరీలు నమోదు కావడం విశేషం. ఈ మెగా టోర్నిలో ఇంకెన్ని సెంచరీలు నమోదు అవుతాయో వేచి చూడాలి.