IND vs AUS: ఫస్ట్ టెస్ట్ గెలిచింది టీమిండియా. రెండోది కూడా మనదే అనుకున్నాం. కానీ, టఫ్ ఫైట్ నడుస్తోంది. ఢిల్లీలో బౌలర్ల దబిడి దిబిడి కంటిన్యూ అవుతోంది.
తొలిరోజు ఆసీస్ ను 263 పరుగులకే కట్టడి చేశాం. ఈజీగా గెలిచేస్తాం అనిపించింది. కానీ, రెండో రోజు ఆస్ట్రేలియా బౌలర్లూ.. బంతిని తిప్పేశారు. మనోళ్లు బ్యాట్లు ఎత్తేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 262 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియాకు ఒక్క పరుగు ఆధిక్యం వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆసీస్.. 61 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఓవర్‌నైట్ 21/0 స్కోరుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన టీమ్‌ఇండియా ఆసీస్ స్పిన్నర్ల ధాటికి 262 పరుగులకు కుప్పకూలిపోయింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (74) ఆదుకోవడంతో సరిపోయింది. లేదంటే స్కోర్ మరింత దారుణంగా ఉండేది. విరాట్ కోహ్లీ (44), అశ్విన్ (37), రోహిత్ శర్మ 32, రవీంద్ర జడేజా (26) ఓ మాదిరి ఆడారు.
కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ స్టార్టింగ్ నుంచి దూకుడుగా ఆడాడు. కుహ్నెమాన్ వేసిన ఓ ఓవర్‌లో వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. 75వ ఓవర్‌లో సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న అశ్విన్ (37) మంచి సహకారం అందించాడు. అక్షర్, అశ్విన్ లు ఇద్దరూ ఎనిమిదో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అస్ట్రేలియా బౌలర్లు నాథన్ లైయన్ 5, కుహ్నెమన్ 2, మర్ఫీ 2 వికెట్లు తీశారు.