Surya Kumar Yadav Injured : టీ 20 ప్రపంచకప్ లో టీమిండియాకు దురదృష్టం వెంటాడేలా ఉంది. సూపర్ 8కి చేరిన ఆనందం ఆదిలోనే అంతమైపోయేలా ఉంది. మొన్ననే అమెరికాతో జరిగిన మ్యాచ్ లో ఒంటిచేత్తో గెలిపించిన సూర్యకుమార్ సూపర్ 8లో ఆడేది అనుమానమే అంటున్నారు.
ఎందుకంటే నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా తను గాయపడ్డాడు. త్రో డౌన్స్ స్పెషలిస్ట్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా సూర్యా కుడి చేతి వేలికి బలంగా గాయమైందని సమాచారం. దీంతో ప్రాక్టీస్ ఆపేసి, తను మధ్యలోంచే వెళ్లిపోయినట్టు తెలిసింది. మళ్లీ కాసేపటి తర్వాత వచ్చి తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టినట్టు సమాచారం.
మరి ఫ్రాక్చర్ జరిగిందా? లేదా? గాయం తీవ్రత ఎంత? అనేది అధికారికంగా ఇంకా బీసీసీఐ ధృవీకరించలేదు. సూర్య గాయం తీవ్రత ఇంకా తెలియాల్సి ఉంది. దీంతో సామాజిక మాధ్యమాల్లో రకరకాల వార్తలు చిలవలు, పలవలుగా మారి హల్చల్ చేస్తున్నాయి. మొత్తానికి గాయమైతే నిజమే.. కానీ దాని తీవ్రతపై స్పష్టత లేకపోవడంతో భారత్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
Also Read : సూపర్ 8.. టీమ్ ఇండియాకు కఠిన సవాళ్లెన్నో!
సూపర్ 8లో భాగంగా భారత్ తొలిమ్యాచ్ జూన్ 20న ఆఫ్గాన్ తో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడెలాగా? అని అందరూ ఆలోచిస్తున్నారు. సూర్యకుమార్ ఆడకపోతే, టీమ్ ఇండియాకి ఇబ్బందికరమే అంటున్నారు. ఎందుకంటే టీమిండియాలో ముగ్గురే స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉన్నారు. రిషబ్ పంత్ దగ్గర నుంచి అందరూ ఆల్ రౌండర్లే ఉన్నారు. ఇప్పుడు సూర్యా కూడా లేకపోతే, ఇద్దరే స్పెషలిస్ట్ బ్యాటర్లు అవుతారు.
వారే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ. ఇప్పుడు వారిద్దరూ కూడా ఓపెనర్లుగా ఇలా వెళ్లి.. అలా వచ్చేస్తున్నారు. ఇలాగైతే మొత్తం సినిమా కంప్లీట్ అయిపోతుంది. అయితే స్టాండ్ బై లో ఉన్న యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ లో ఒకరిని తీసుకునే అవకాశాలున్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ వారిద్దరూ లీగ్ మ్యాచ్ లు ఆడకపోవడంతో ఇప్పుడు డైరక్టుగా సూపర్ 8లో ఆడిస్తే, పరిస్థితి ఏమిటి ? వాళ్లు కుదురుకునే సరికి, ఆ మూడు మ్యాచ్ లు అయిపోతే ఎలా? అని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.