
amit shah : తెలంగాణ ఎన్నికల రేస్ లో వెనుకబడిన బీజేపీ కొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. సూర్యపేటలో నిర్వహించిన జనగర్జన సభలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా కీలక ప్రకటన చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని స్పష్టం చేశారు. వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్ష్యమని విమర్శించారు.
సోనియా గాంధీ.. రాహుల్‌ను ప్రధానిని చేయాలని చూస్తున్నారని అమిత్ షా అన్నారు. కేసీఆర్ తన తనయుడు కేటీఆర్‌ను సీఎంను చేయాలని యోచిస్తున్నారని కానీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ మరోసారి గెలిస్తే దళితుడిని సీఎంగా కేసీఆర్ చేస్తారా? అని అమిత్ షా ప్రశ్నించారు.
తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదని అమిత్ షా విమర్శించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మాత్రమే అభివృద్ధి సాధ్యమని తేల్చిచెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడేందుకు మోదీ ముందుకు వచ్చారన్నారు. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం మాత్రమే పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తుందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్.. పేదల వ్యతిరేక పార్టీ అని అమిత్ షా విమర్శించారు. దళితులకు మూడెకరాలు ఇస్తానన్న హామీ ఏమైందో కేసీఆర్ చెప్పాలి? అని నిలదీశారు. రూ.50 వేల కోట్లతో దళితుల అభివృద్ధి నిధి ఏమైందో చెప్పాలి? అని కోరారు. రూ.10 వేల కోట్లతో బీసీల సంక్షేమ కార్యక్రమాలు అన్నారు.. ఏం చేశారో చెప్పాలి? అని డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమం కోసం ప్రధాని మోదీ రాజ్యాంగబద్ధంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేశారని అమిత్ షా వివరించారు.
ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారం ఖాయమని కొన్ని సర్వేలు ఇప్పటికే తేల్చేశాయి. అభ్యర్థుల ప్రకటన దగ్గర నుంచి ప్రచారం వెనుకబడిన బీజేపీ బీసీలను ఆకట్టుకునే వ్యూహాన్ని ముందుకు తెచ్చింది. ఈ నేపథ్యంలోనే గెలిస్తే బీసీని సీఎం చేస్తామని అమిత్ షా ప్రకటించారు. తెలంగాణ బీజేపీలో కీలక నేతలుగా ఉన్న బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇద్దరూ బీసీలే. మరి సీఎం అభ్యర్థి ఎవరు? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.