Big Stories

Tandur : కాంగ్రెస్ కంచుకోట.. తాండూరులో ఆ రెండు వర్గాలకే పట్టం..

Tandur: వికారాబాద్ జిల్లాలోని తాండూరు..ఈ ప్రాంతం నాపరాయికి ప్రసిద్ధి. ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ నుంచి విదేశాలకు నాపరాయి ఎగుమతి అవుతోంది. హైదరాబాద్ కు సమీపంలోనే ఉన్నా ఇక్కడ అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నెరవేర్చలేదని ప్రజలు మండిపడుతున్నారు. కంది బోర్డు ఏర్పాటు చేస్తామని, బైపాస్ రోడ్డు నిర్మిస్తామని ప్రజలకు మాటిచ్చారు. కానీ ఈ హామీలేవి నెరవేరలేదని జనం అంటున్నారు.

- Advertisement -

తాండూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రభుత్వం 138 కోట్లు రూపాయలను కేటాయించింది. ఒక్కో పంచాయతీకి 50 లక్షల రూపాయల చొప్పున ఇస్తామని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఈ నిధులు అందలేదని సర్పంచ్ లు చెబుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రుణమాఫీ, దళితబంధు పథకాల అమలుతీరుపైనా ప్రజలు సంతృప్తిగా లేరు. గ్రామాల అనుసంధాన రహదారులు అధ్వాన్నంగా మారాయి. ఇలా అనేక సమస్యలతో తాండూరు నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

- Advertisement -

మరోవైపు రాజకీయంగా తాండూరుకు గొప్ప చరిత్ర ఉంది. ఈ సెగ్మెంట్ కాంగ్రెస్ కు కంచుకోట. మొత్తం 13 ఎన్నికల్లో.. 9సార్లు హస్తం పార్టీదే హవా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఈ నియోజకవర్గం నుంచే 1962,67 ఎన్నికల్లో గెలవడం విశేషం. ఆ తర్వాత తాండూరులో మల్కుద్ ఫ్యామిలీ హవా కొనసాగింది. 1972,78 ,83 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ముల్కుద్ మాణిక్ రావు గెలిచి హ్యాట్రిక్ సాధించారు.ఆ తర్వాత మాణిక్ రావు సోదరుడు చంద్రశేఖర్ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొత్త చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీకి తాండూరులో విజయం అంతవీజీగా దక్కలేదు. 1983, 85, 89 ఎన్నికల్లో టీడీపీ హ్యాట్రిక్ పరాజయాలు చవిచూసింది. 1994 ఎన్నికల్లో మాత్రం టీడీపీ నుంచి పట్నం మహేందర్ రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయబావుటా ఎగురవేశారు. ఆ తర్వాత 1999,2009 ఎన్నికల్లోనూ సైకిల్ దూసుకుపోయింది. 2004లో మాత్రం మల్కుద్ కుటుంబాన్ని మళ్లీ జనం ఆదరించారు. ఆ ఎన్నికల్లో ముల్కుద్ నారాయణరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

టీడీపీ తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం మహేందర్ రెడ్డి .. తెలంగాణ ఏర్పాటు తర్వాత కారెక్కి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయభేరి మోగించారు. మొత్తం నాలుగుసార్లు పట్నం మహేందర్ రెడ్డిని తాండూరు ప్రజలను అక్కున చేర్చుకున్నారు. కానీ 2018 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ వైపు ఓటర్లు మళ్లీ మొగ్గుచూపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పైలెట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన గులాబీ గూటికి చేరారు. ఓవరాల్ గా తాండూరులో 9 సార్లు కాంగ్రెస్, మూడుసార్లు టీడీపీ, ఒకసారి బీఆర్ఎస్ గెలిచాయి.

ఎంతో గొప్పచరిత్ర ఉన్న తాండూరు నియోజకవర్గం కొంతకాలంగా నెగిటివ్ అంశాలతో వార్తల్లో నిలుస్తోంది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సంచలన వ్యవహారాలతో హాట్ టాపిక్ అయ్యారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు, ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారాల్లో రోహిత్ రెడ్డిని ఈడీ విచారించడం తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపింది.

తాండూరు నియోజకవర్గంలో తాండూరు, యలాల్,పెద్దేముల్, బషీరాబాద్, దరూర్ మండలాలున్నాయి. ఈ సెగ్మంట్ లో ముదిరాజ్ ల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. ముదిరాజ్ వర్గానికి చెందిన ముల్కుద్ ఫ్యామిలీ నుంచి ముగ్గురు సోదురులు ఎమ్మెల్యేగా ఎన్నికకావడం విశేషం. ఆరు పర్యాయాలు ఆ కుటుంబానికే ఎమ్మెల్యే పదవి దక్కింది. మరో 7సార్లు రెడ్లకు ఓటర్లు పట్టం కట్టారు.ఈ సెగ్మెంట్ లో యాదవులు, ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీల ఓట్లు కీలకంగా ఉన్నాయి. రెడ్డి, ముదిరాజ్ సామాజికవర్గాలకు తప్ప.. మిగతా కూలాలకు తాండూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు ప్రాతినిధ్యం దక్కలేదు. ఈ సెగ్మెంట్ లో ముస్లింలు 22 శాతం, ముదిరాజ్ లు 20 శాతం, ఎస్సీలు 20 శాతం, యాదవులు 18 శాతం, ఎస్టీలు 10 శాతం, రెడ్లు 5 శాతం మంది ఉన్నారు.

ఈ నియోజకవర్గంలో 2018 నాటికి 2, 14, 312 మంది ఓటర్లు ఉన్నారు. 2018 ఎన్నికల్లో 77.48 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం 2 లక్షల 28 వేల 544 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ. పురుష ఓటర్లు 1,11,242 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,17,243 మంది, ట్రాన్స్ జెండర్స్ 10 మంది, సర్వీస్ ఓటర్లు 49 మంది ఉన్నారు. గత ఎన్నికల కంటే 14,232 ఓట్లు అధికంగా ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News