Kavitha: స్వాతంత్ర్య పోరాట సమయంలో జైలుకెళ్లిన వారిని దేశభక్తులుగా కీర్తించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో జైలుకెళ్లిన వారికి ఉద్యమకారులుగా కితాబు ఇచ్చారు. త్వరలోనే ఎమ్మెల్సీ కవిత సైతం జైలుకు వెళతారంటూ ప్రచారం జరుగుతోంది. మరి, ఆమెను తెలంగాణ సమాజం ఏ కోణంలో చూస్తుంది? లిక్కర్ స్కాంలో జైలు కెళితే.. సత్కరిస్తారా? చీదరిస్తారా? అరెస్ట్.. కవిత పొలిటికల్ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
రాజకీయ నాయకులు జైలుకెళ్లడం చాలామంది విషయంలో జరిగింది. విపక్షంలో ఉన్నవారిపై కేసులు, అరెస్టులు, జైలుకెళ్లడాలు కామనే. లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి జయలలిత వరకూ.. అనేక ఉదంతాలు ఉన్నాయి. ఏపీ సీఎం జగన్ సైతం జైలు జీవితం గడిపిన వారే. అయితే, జైలుకు వెళ్లడం అనేది ఆ రాజకీయ నాయకులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది సమయం, సందర్భాన్ని బట్టి ఉంటుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. కొన్ని నెలలుగా వారంతా జైల్లో మగ్గుతున్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్లు పెట్టుకున్నా.. కోర్టు కనికరించడం లేదు. అంత పక్కాగా సీబీఐ, ఈడీ విచారణ చేస్తోంది. స్కాంలో పాత్రదారులే ఇన్నాళ్లుగా జైల్లో ఉంటుంటే.. మరి, సూత్రధారులుగా పేర్లు వినిపిస్తున్న సిసోడియా, కవిత లాంటి వాళ్ల పరిస్థితి ఏంటి? అనే చర్చ నడుస్తోంది.
మనీశ్ సిసోడియా అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆప్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. అవన్నీ ఒక్కరోజు హడావుడికే పరిమితం అవుతున్నాయి. మళ్లీ మర్నాడు అంతా రొటీన్. దేశ రాజధానిలో ఆప్ లాంటి బలమైన పార్టీ ఆందోళనలు చేస్తేనే.. కేంద్రంకానీ, దర్యాప్తు సంస్థలు కానీ ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాయి. తమ పని తాము చేసుకుపోతున్నాయి. అలాంటిది, కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ ఆగమాగం అవుతుందా?
“తెలంగాణ తల వంచదు”.. ఈడీ నోటీసులు రాగానే కవిత ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇది. తనను అరెస్ట్ చేస్తే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని అంటున్నారు. అరెస్టును.. తెలంగాణ సమాజానికి ముడిపెడుతున్నారు. కేంద్రం తెలంగాణపై పగపట్టిందనేలా మెసేజ్ ఇస్తున్నారు. అందుకే, కవిత అరెస్టుకు.. తెలంగాణ సమాజానికి ఏం సంబంధం అంటూ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.
ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే.. సేమ్ టు సేమ్ ఆమ్ ఆద్మీ పార్టీలానే బీఆర్ఎస్ శ్రేణులు ఒకరోజో రెండు రోజులో ఆందోళనలు, ధర్నాలు చేస్తాయి. ఆ తర్వాత? మళ్లీ ఎవరిగోల వారిదే. ఓ వారం పది రోజులకు కవిత అరెస్ట్ విషయాన్ని అంతా మర్చిపోతారు. మళ్లీ ఫ్రెష్ న్యూస్‌లో పడిపోతారు. నష్టమంతా కవితకే.
ప్రతీరోజూ ఏదో ఒక యాక్టివిటీతో న్యూస్‌లో ఉంటేతప్ప.. రాజకీయ నాయకులను ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ఏమాత్రం గ్యాప్ వచ్చినా పబ్లిక్ మర్చిపోతారు. అందుకే, ఆ డ్యామేజ్ జరగొద్దనే పొలిటికల్ లీడర్లు రెగ్యులర్‌గా ఏదో ఒక అలజడి రేపుతుంటారు. అలాంటిది కీలకమైన ఎన్నికల ఏడాదిలో.. మంచి వక్త అయిన కేసీఆర్ కూతురు కవిత.. జైల్లో ఉండాల్సి వస్తే.. అది ఆమెకు, పార్టీకి పెద్ద నష్టమే అంటున్నారు. కవిత కెరీరే ప్రమాదంలో పడొచ్చు. కాకపోతే కేసీఆర్ కూతురు కాబట్టి.. ఎప్పుడు తిరిగొచ్చినా.. ఆమె కోసం ఓ సింహాసనం రెడీగా ఉంటుంది కావొచ్చు.
కవిత చెబుతున్నట్టుగానే.. అరెస్ట్ చేస్తే ఆమె ప్రజాక్షేత్రంలో మరింత యాక్టివ్ అవుతారా? గతంలో వైఎస్ జగన్‌లా కవిత కూడా జైలు జీవితాన్ని మరింత రాటుదేలేందుకు ఉపయోగించుకుంటారా? తిరిగొచ్చి అంతే బౌన్స్ అవుతారా? ఏమో..