APSRTC Google Maps: ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణం ఇక మరింత సులభతరంగా మారనుంది. ఏపీఎస్ఆర్టీసీ గూగుల్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు ప్రయాణికులు గూగుల్ మ్యాప్స్ ద్వారా నేరుగా ఆర్టీసీ బస్సు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇప్పటి వరకూ రూట్, దూరం, ప్రయాణ సమయం చెక్ చేసుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పటి నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సు రూట్ లను వీక్షించడంతో పాటు ఆన్‌లైన్‌లో రిజర్వ్ చేసుకోవచ్చు.
ఉదాహరణకు విజయవాడ నుంచి విశాఖ రూట్ మ్యాప్ కోసం గూగుల్ మ్యాప్స్‌లో చెక్ చేయండి. అందులో నకడ, బైక్‌లు, కార్లు, బస్సు, రైళ్ల ప్రయాణ సమయం, దూరం, రూట్ వివరాలు చూపిస్తాయి. ఏపీఎస్ఆర్టీసీ బస్సు షెడ్యూల్ ను కూడా చూపిస్తాయి. ఆ మార్గంలో నడుస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల జాబితా, బయలుదేరే సమయాలు, ప్రయాణ సమయం, చేరుకునే వ్యవధి బస్సు సింబల్ పై క్లిక్ చేస్తే కనిపిస్తాయి. బస్సు ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా నేరుగా ఏపీఎస్అర్టీసీ వెబ్‌సైట్‌కు డైవర్ట్ అవుతారు. అక్కడ మీరు బస్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పేమెంట్ చేయవచ్చు. దీంతో మీరు బస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.
ఏపీఎస్ఆర్టీసీ, గూగుల్ మ్యాప్స్ ఫీచర్‌ను ముందుగా విజయవాడ-హైదరాబాద్ మార్గంలో పరీక్షించారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో ఏపీలో ప్రారంభించనున్నారు. ఈ సేవల కోసం ఏపీఎస్ఆర్టీసీ గూగుల్‌కు వివరణాత్మక డేటాను అందించింది. ఆర్టీసీ ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు ఏయే రూట్ల వివరాలు గూగుల్ కు అందించింది. దీంతో గూగుల్ బస్ స్టాపుల వివరాలను మ్యాప్స్ లో నమోదు చేసింది.
త్వరలో గూగుల్ మ్యాప్స్ ద్వారా నేరుగా ఏపీఎస్ఆర్టీసీ మార్గాల్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే ప్రయాణ వివరాలను, రూట్లను సులభంగా తెలుసుకోవచ్చు.