Bandi Sanjay: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని MCRHRD వేదికగా నిర్వహించిన ‘ రోజ్ గార్ మేళా’ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీ నాయకత్వంలోని విప్లవాత్మక నిర్ణయాలు, ఉద్యోగ కల్పనపై కీలక వ్యాఖ్యలు చేశారు.
లక్ష్యానికి మించి ఉద్యోగాల భర్తీ..
ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత ఇష్టమైన కార్యక్రమం ‘రోజు గార్ మేళా’ అని బండి సంజయ్ తెలిపారు. 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పటికే అంతకుమించి 12.24 లక్షలకు పైగా నియామకాలు పూర్తి చేసిందని వివరించారు. ఈ 20వ రోజు గార్ మేళా ద్వారా దేశవ్యాప్తంగా మరో 51 వేల మందికి నియామక పత్రాలు అందించగా, తెలంగాణలో తన చేతుల మీదుగా 221 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. పేపర్ లీకేజీలు, పైరవీలకు తావులేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే ఈ భర్తీ ప్రక్రియ సాగిందని స్పష్టం చేశారు.
తెలంగాణ వర్సెస్ కేంద్ర పాలన..
తెలంగాణలో గతంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ లీకేజీలు, ప్యాకేజీలు, కోర్టు కేసులతో భ్రష్ఠు పట్టి గందరగోళంగా మారిందని విమర్శించారు. దానికి భిన్నంగా ఎలాంటి అవినీతి మరకు లేకుండా మోదీ పాలన సాగుతోందన్నారు. ఖాళీలు భర్తీ కాకపోతే ఉన్న ఉద్యోగులపై భారం పడి, మారుమూల ప్రాంతాల్లో సేవలు అందడం కష్టమవుతుందని.. అందుకే కేంద్రం ఎప్పటికప్పుడు ఖాళీలను నింపుతోందని చెప్పారు.
నవ భారత్ దిశగా అడుగులు..
కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా 2.25 లక్షల స్టార్టప్‌లు, ‘మేక్ ఇన్ ఇండియా’, స్టార్టప్ ఇండియా ద్వారా కోట్లాది మందికి ఉపాధి లభించిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి 12 ఏళ్లలో రూ. 12 లక్షల కోట్లు ఖర్చు చేశామని, ఇటీవలే మరో 2 లక్షల పిఎంఏవై ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడం, నిధులు దారి మళ్లించడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్ధులు మోదీ స్ఫూర్తితో నిజాయితీ, నిబద్ధతలతో సమాజ సేవకు నిలబడాలని పిలుపునిచ్చారు.
Also Read: దోచుకోవడం.. దాచుకోవడమే కాంగ్రెస్, BRS నైజం! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు