Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విలేకరుల సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చట్టాలను తమ రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. ప్రజా తీర్పును పక్కనపెట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో BRS, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏమాత్రం తేడా లేదని స్పష్టం చేశారు.
పార్టీ ఫిరాయింపులపై ఘాటు విమర్శలు
గతంలో వైఎస్సార్, BRS హయాంలో జరిగినట్టే, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. దానం నాగేందర్ వ్యవహారంలో అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ స్పీకర్ ఇచ్చిన తీర్పును ప్రజలు గమనిస్తున్నారన్నారు. నామినేషన్ వేసిన నాటి నుంచే ఆయనను అనర్హుడిగా ప్రకటించిన కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ చట్టాలను రెండు పార్టీలు కాలరాస్తున్నాయని ఆరోపించారు.
భూ దందాలు, కమిషన్ల పాలన
తెలంగాణలో భూములు విక్రయించి, ధరలను కృత్రిమంగా పెంచడంలో BRS పంథాలోనే కాంగ్రెస్ నడుస్తోందని విమర్శించారు. అధికారం దిగిపోయేలోపు రాష్ట్రంలో ఒక్క ఎకరం భూమి కూడా మిగల్చకూడదనే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేటీఆర్ తరహాలోనే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అపార్ట్‌మెంట్ల అనుమతులకు ఫిక్స్డ్ కమిషన్లు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
విమానాశ్రయాల అభివృద్ధిపై స్పష్టత
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్న కాంగ్రెస్, బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో జాయింట్ యూజర్ విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేశామని, అలాగే వరంగల్ విమానాశ్రయ పనులను కూడా వేగంగా పూర్తి చేస్తున్నామని వివరించారు.
Also Read: దుండిగల్‌లో 425 కిలోల గంజాయి సీజ్.. ఆరుగురు స్మగ్లర్లు అరెస్ట్!