Hyderabad Metro Scam: హైదరాబాద్ లో మెట్రో పార్కింగ్ స్కామ్, పిల్లర్ల చుట్టూ తవ్విన ప్రమాదకర గుంతులపై బిగ్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేస్తోంది. మెట్రో పిల్లర్ల కింద ఏం జరుగుతోంది? పార్కింగ్ పేరుతో ఎలాంటి కుంభకోణాలు చేస్తున్నారు? మెట్రో స్థలాల లీజు విషయంలో చోటుచేసుకుంటున్న అక్రమాలను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. దీంతో మెట్రో అధికారులు, కాంట్రాక్టర్లలో వణుకు మెుదలైంది. చేసిన దుర్మార్గాలను కప్పిపుచ్చుకోవడానికి అర్ధరాత్రి గోతులు పూడ్చే ప్రయత్నం చేశారు. ఇన్నాళ్లు కళ్లుమూసుకున్న అధికార యంత్రాగం బిగ్ టీవీ కథనాలతో ఒక్కసారిగా మేల్కొంది.
సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ సమీపంలో మెట్రో పిల్లర్ల వద్ద తవ్విన గుంతలపై బిగ్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. గురువారం తొలిసారి బిగ్ టీవీ ప్రతినిధులు స్పాట్ కు వెళ్లిన సమయంలో పిల్లర్లకు ఆనుకోని 10 అడుగుల లోతు వరకు గుంతలకు కనిపించాయి. దీని వల్ల మెట్రో ప్రయాణికులకు ఏ స్థాయిలో ముప్పు పొంచి ఉందో కళ్లకు కట్టేలా వరుస కథనాలను బిగ్ టీవీ ప్రసారం చేస్తూ వచ్చింది. దీంతో కలవరానికి గురైన అధికారులు, కాంట్రాక్టర్లు.. అక్కడ ఏమి జరగలేదని తెలియజేసేలా గుట్టుచప్పుడు కాకుండా మెట్రో పిల్లర్ల వద్ద గుంతలను పూడ్చేశారు. రాత్రికి రాత్రి పెద్ద ఎత్తున ఇసుకను గుంతల్లో నింపేశారు.
మెట్రో గుంతలను పగలు పూడిస్తే.. ప్రజలకు తెలుస్తుందన్న భయంతో గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి వాటిని కప్పిపెట్టే ప్రయత్నం చేశారు. దొంగల మాదిరిగా అర్ధరాత్రి లారీల్లో ఇసుక, జేసీబీని తీసుకొచ్చి.. గేట్లు మూసేశారు. అనంతరం పిల్లర్ల పక్కన 7-8 అడుగుల మేర ఉన్న గుంతల్లో ఇసుకను కుప్పగా పోసి.. నేలను చదును చేసే ప్రయత్నం చేశారు. పిల్లర్ల చుట్టూ ఏం జరుగుతుందో ప్రజలకు బిగ్ టీవీ చెప్పకపోయుంటే ఇదంతా బయటకు వచ్చేదా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ అక్రమ తవ్వకాల వల్ల భవిష్యత్తులో మెట్రో పిల్లర్ కుంగిన పక్షంలో మాత్రమే ఇది బయటకు వచ్చి ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: బాంబు పేల్చిన పెట్రోల్ బంక్ డీలర్లు.. యూపీఐ చెల్లింపులు నిలిపివేత.. ఆ తేదీ నుంచి క్యాష్ తప్పనిసరి!
గురు, శుక్ర వారాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా బిగ్ టీవీ ఈ గుంతలను కళ్లకు కట్టింది. దీంతో ప్రజల్లోకి ఈ విషయం ఎలా వెళ్తుందన్న ఆందోళనతో శనివారం రోజు బిగ్ టీవీ ప్రతినిధులను రాకుండా పూర్తిగా గేట్లను కాంట్రాక్టర్లు క్లోజ్ చేశారు. లోపలి విజువల్స్ కనపడకుండా చుట్టూ గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేశారు. అయితే బయటి నుంచే లోపలి గుంతలను చూపించే ప్రయత్నం బిగ్ టీవీ రిపోర్టర్ సాగర్ చేశారు. రాత్రికి రాత్రి లారీల కొద్ది ఇసుకను తీసుకొచ్చి గుంతలను ఏ విధంగా పూడ్చారో ప్రజల కళ్లకు కట్టారు. అయితే ఈ పిల్లర్ల నెం.1192, 1193 మధ్య ఉన్న 1000 గజాల స్థలంలో కాఫీ షాప్ తరహాలో రెస్టారెంట్ నిర్మించేందుకు గుంతలు తవ్వినట్లు స్థానికులు చెబుతున్నారు.
Also Read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవు.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!