Deputy CM Bhatti Vikramarka Comments on BRS: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి – శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వ్యవహారంపై రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా స్పందించారు. సమాజంలో బాధ్యతగా ఉంటూ సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాల్సిన ఎమ్మెల్యేలు ఇలా బజారున పడి తన్నుకోవడం తనకు బాధ కలిగించిందన్నారు. శనివారం ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనా శాసనసభ్యులు వ్యవహరించాల్సిన తీరు ఇదా? అంటూ ఆయన నిలదీశారు. ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చిన రోడ్లపైకి వచ్చి కొట్టుకోవడమేంది? అంటూ ప్రశ్నించారు. ఆ విధంగా ప్రవర్తిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం ఊరుకోబోదన్నారు. ఏం చేయాలో అది చేస్తుంది.. అంతేకాని ఊరుకనే ప్రసక్తే ఉండబోదన్నారు. ఇప్పటికైనా ఆ ఎమ్మెల్యేల తీరు మారాలన్నారు.
Also Read: వీకెండ్ @ ఖైరతాబాద్.. రేపటితో దర్శనాలు బంద్.. బడా గణేష్ పెద్దోళ్ల కోసమేనా ?
అనంతరం బీఆర్ఎస్ పై భట్టి తీవ్ర స్థాయిలో పైరయ్యారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా బీఆర్ఎస్ నేతలు ఇంకా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంత జరగుతున్నా తాము ఎందుకు ఓపిక పడుతున్నామంటే.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని గౌరవించాలన్నే ఉద్దేశం మాత్రమేనని ఆయన అన్నారు. లేకపోతే ఎప్పుడో ఏం చేయాలో అదే చేసేవాళ్లమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా తమ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించదన్నారు. గతంలో కాంగ్రెస్ కు ఉన్న ప్రతిపక్ష హోదాను సైతం గుంజుకున్నారంటూ బీఆర్ఎస్ పై భట్టి మండిపడ్డారు. వాళ్ల మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే తమ ప్రభుత్వానికి.. వాళ్లకు తేడా ఏముండదన్నారు. అందుకే తాము వాళ్ల మాదిరిగా ప్రవర్తించడంలేదన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల గొంతు వినిపించాలని తాను బలంగా కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అసెంబ్లీలో అధికార పార్టీ ఎవరో.. ప్రతిపక్ష పార్టీ ఎవరో అనేది స్పీకర్ స్పష్టంగా వివరించారన్నారు. ప్రతిపక్ష నేతలంటే తమకు గౌరవం ఉందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం అనేది అధికారంలో ఉన్న తమ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని భట్టి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలు గౌరవంగా మెదులుకోవాలని సూచించారు. లేదంటే తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే అది ఎవరైనా సరే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకోసారి ఆ విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదన్నారు. జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన హెచ్చరించారు.
Also Read: త్వరలోనే హైడ్రాకు విశేషాధికారాలు.. ఆర్డినెన్స్, అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు: రంగనాథ్
ఇటు బీజేపీపై కూడా డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో బీజేపీ రాజకీయ డ్రామాలు ఆడుతుందంటూ మండిపడ్డారు. బీజేపీ కేవలం తన ఉనికి కోసమే అటువంటి డ్రామాలు చేస్తుంటదంటూ ఆయన పేర్కొన్నారు.