jagtial News: టెక్నాలజీ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో మూఢనమ్మకాలను చాలామంది నమ్ముతున్నారు. ముఖ్యంగా క్షుద్ర పూజలు పేరు చెబితే చాలు.. చాలామంది వణికిపోతారు. ఎందుకంటే మంచి కంటే చెడు కోసమే ఆయా పూజలు చేస్తుంటారు. ఇతరులను బాధించడానికి చేస్తున్న సందర్భాలు కోకొల్లలు. సమాజానికి హాని కలిగించే చర్యలు ఆయా పూజలుంటాయి.
పాఠశాలలో క్షుద్రపూజలు
వీటిని చేసేవారు పసుపు, కుంకుమలు, బొమ్మలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఏదో విధంగా దిష్టి బొమ్మను సృష్టించి దాని చుట్టూ పూజలు చేయడం అప్పుడప్పుడు చూస్తుంటారు. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ధరూర్ క్యాంప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు చేయడం తీవ్ర కలకలం రేపింది.
జగిత్యాల ధరూర్ క్యాంప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపింది. దసరా మరుసటి రోజు పాఠశాల రీ ఓపెనింగ్ రోజు అవి దర్శనమిచ్చాయి. స్టాప్‌రూమ్ ముందు పూజలు చేయడంతో సిబ్బంది భయపడుతున్నారు. స్కూల్ వరండాలో ముగ్గులు వేసి ఉన్నాయి. నిమ్మకాయలు, పసుపు, కుంకుమతోపాటు దీపం వెలిగించి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి.
ఉపాధ్యాయుల మీద కోపమా?
ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయుల్లో భయాందోళన మొదలయ్యాయి. ఇంతకీ ఎవరి కోసం ఈ పూజలు చేశారు? దీని వెనుక ఎవరైనా స్థానికులు ఉన్నారా? లేక బయటివారు ఈ పూజలు చేశారా? ఈ తరహా పూజలు అమావాస్య లేకుంటే పౌర్ణమి రోజు చేస్తారని అంటున్నారు. దసరా నవరాత్రులు మొదలు ఇప్పటివరకు ఆ రెండు తిథులు లేవని అంటున్నారు.
ఈ పాఠశాల డీఎస్పీ కార్యాలయంకి కూతవేటు దూరంలో ఉంది. ఈ విషయం తెలియగానే పాఠశాలకు పోలీసులు చేరుకున్నారు. దీని గురించి ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతంలో ఏమైనా సీసీకెమెరాలు ఉన్నాయా అనేదానిని పరిశీలించారు. పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని అంటున్నారు. దీనిపై జిల్లా అధికారుల స్పందించాలని పేరెంట్స్ కోరుతున్నారు.
ALSO READ: భారీ బందోబస్తు మధ్య కొండాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు
గతంలో ఓసారి ఈ పాఠశాలలో పావురాన్ని చంపి స్కూల్ గంటకు వేలాడ దీశారు గుర్తు తెలియని వ్యక్తులు. టెక్ యుగంలో పాఠశాలలో ఇలాంటి ఘటనలకు వేదిక కావడం ఆందోళన కలిగిస్తోంది. పాఠశాలల్లో ఇలాంటివి విద్యార్థుల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కేవలం బయటకు తెలిసి మాత్రమే. తెలియకుండా ఆ ప్రాంతంలో ఇలాంటి పూజలు చాలానే జరుగుతున్నాయి స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు వీటిని అదుపు చేయాలని కోరుతున్నారు.