Kantara chapter 1:2022లో రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కాంతార (Kantara ). ప్రాంతీయంగా విడుదలైన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించడంతో ఇతర భాషల్లో కూడా విడుదల చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థగా పేరు సొంతం చేసుకున్న హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ చిత్రం ఆయనకు మంచి లాభాలను కూడా అందించింది. అయితే ఆ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో దానికి ప్రీక్వెల్ గా అక్టోబర్ 2వ తేదీన కాంతార చాప్టర్ 1 (Kantara chapter 1) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి కూడా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించారు.
ముఖ్యంగా ఇందులో మహారాజుల మధ్య యుద్ధాలు.. యువరాణితో ప్రేమ కథను చాలా అద్భుతంగా చూపించారు. మైథాలజికల్ మూవీగా వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయినా మొదటి రోజు ఊహించని కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.89 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు కన్నడ చిత్రానికి మొదటి రోజు ఈ స్థాయి కలెక్షన్స్ రావడం కూడా ఇదే ఫస్ట్ టైం కూడా.. అటు 24 గంటల్లో “బుక్ మై షో” లో కూడా 1.28మిలియన్ కి పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇదిలా ఉండగా మొదటి రోజు భారీ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా రెండు రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్లకు క్లబ్ లో చేరి రికార్డ్ సృష్టించింది.
2 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిక..
విషయంలోకి వెళ్తే రిషబ్ శెట్టి, రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) లీడ్ రోల్ పోషిస్తూ వచ్చిన కాంతార చాప్టర్: 1 ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. రెండవ రోజు 45 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. అన్ని షోలు కలిపి యావరేజ్ గా 82.31% ఆకుపెన్సీతో థియేటర్లు రన్ అయినట్లు సమాచారం. ఈనెల 2వ తేదీన విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లోనే సుమారుగా 106.85 నెట్ కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. వీకెండ్స్ ముగిసేసరికి 200 ఓట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.
also read:Mirai On OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన మిరాయ్.. అధికారిక ప్రకటన!
కాంతార చాప్టర్ : 1 స్టోరీ..
సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఎనిమిదవ శతాబ్దంలో కదంబల రాజ్యపాలనలో జరిగిన కథను చూపించారు. రాజ్యంలో ఒకవైపు ఉన్న అటవీ ప్రాంతంలోని దైవిక భూమి కాంతార. ఈ ప్రాంతంపై దుష్టశక్తుల కన్ను పడకుండా, తమ రాజ్యంలోకి బయట వాళ్ళు ఎవరు అడుగుపెట్టకుండా కాంతారాను గిరిజన తెగ జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. ఇక్కడ మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలను పండిస్తూ జీవనం సాగించే ఆ తెగకు అక్కడున్న బావిలో ఒక బిడ్డ దొరుకుతాడు. అతడిని దైవంగా భావించి అతడికి బెర్మే (రిషబ్ శెట్టి) అని పేరు పెట్టి పెద్ద చేస్తారు. ఒకసారి తమ రాజ్యంలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నించిన భాంగ్రా యువరాజు కులశేఖరు, అతని సైనికులకు తగిన బుద్ధి చెబుతాడు బెర్మే . ఈ ఘటన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఎలా విదేశీ వర్ధకం చేస్తున్నారు? గిరిజనులను వెట్టి చాకిరి పేరుతో ఎలా హింస పెడుతున్నారో? తెలుసుకుంటాడు. ఇక తమ తెగ బాగు కోసం భాంగ్రా రాజును ఎదిరించి సొంతంగా వ్యాపారం చేయడానికి సిద్ధమవుతాడు. ఆ తరువాత ఏమయింది? బెర్మే తీసుకున్న నిర్ణయం గిరిజన తెగకు ముప్పుగా ఎందుకు మారింది? భాంగ్రా రాజు రాజశేఖర్ అయిన కుమార్తె కనకవతి కి ఈ కథలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి ? ఈశ్వరుడి పూదోటలో ఉన్న దైవ రహస్యం ఏమిటి? అన్న విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.