Jagtial News: వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. చిన్నపాటి గొడవ భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టింది. ఫలితంగా పెళ్లయిన ఆరు రోజులకే వధువు ఆత్మహత్యకు పాల్పడింది. సంచలనం రేపిన ఈ ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది.
పెళ్లయిన ఆరు రోజులకే
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ శివారులోని ఒడ్డెర కాలనీకి చెందిన 22 ఏళ్ల గంగోత్రి, అదే కాలనీకి చెందిన సంతోష్‌ని ప్రేమించింది. ఇద్దరు మనసులు కలిశాయి. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కాకపోతే పెద్దలు ఏమంటారని భయపడ్డారు. చివరకు మనస్సులోని మాటను ఇద్దరు వారి వారి తల్లిదండ్రులకు చెప్పారు.
మొదట్లో కాస్త భయపడినా, తర్వాత ఊ కొట్టారు. పెద్దల సమక్షంలో గత నెల 26న పెళ్లి చేసుకున్నారు. దసరా పండగ నేపథ్యంలో గురువారం గంగోత్రి తన భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. దసరా రోజు రాత్రి ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అత్తింటి వద్ద ఏం జరిగిందో తెలీదుగానీ వెంటనే సంతోష్ తన భార్యతో కలిసి ఇంటికి వెళ్లిపోయాడు.
భర్తతో గొడవ కారణమా?
ఆ గొడవ గంగోత్రిని ఇబ్బందులకు గురి చేసింది. చివరకు మనస్తాపానికి గురైంది. అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత అత్తింట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్తతో జరిగిన గొడవతో మనస్తాపానికి గురయ్యిందని భావించారు తల్లిదండ్రులు. అత్తింట్లో తన కూతురికి ఏదైనా అవమానం జరిగిందో తెలీదుగానీ, మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ALSO READ: జిమ్ ట్రైనర్ సైడ్ బిజినెస్.. రైల్వే ట్రాక్ పక్కన ఇళ్లే టార్గెట్
ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. కాకపోయే పెళ్లయిన ఆరు రోజులకు కూతురు చనిపోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోరుకున్న ప్రియుడ్ని పెళ్లి చేసుకుని, తమను విడిచిపెట్టి పోయావా అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు.
ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో తప్పెవరిది? భర్తని ఇంటికి తీసుకెళ్లిన గంగోత్రిదా? లేక ఆమె భర్త సంతోష్ వ్యవహారమే కారణమా? అనేదానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇంకెన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయో చూడాలి. ఈ మధ్యకాలంలో ఆ తరహా ఘటనలు చాలానే జరుగుతున్నాయి. కాళ్ల పారాణి ఆరకముందే సూసైడ్‌లు చేసుకుంటున్నారు.