Tollywood: సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి ఎప్పటికప్పుడు పలు వార్తలు సంచలనం సృష్టిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు మరింత వెలుగు చూస్తున్నాయి. అవకాశాల పేరిట వారిని నమ్మించి, మోసం చేసి తల్లులను చేసిన ఘటనలు కూడా ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇలాంటి ఘటనలు ఎన్నో తమ వద్దకు వస్తాయని, కానీ నోటీసులు సిద్ధం చేసిన తర్వాత బాధిత మహిళలు భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటూ తాజాగా తెలంగాణ మహిళా కమిషన్ నేరెళ్ల శారద (Nerella sarada) ఇండస్ట్రీకి సంబంధించి పలు ఆశ్చర్యకర విషయాలు బయట పెట్టారు.
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారద.. ఈ బాధ్యత చేపట్టిన తర్వాత వసతి గృహాలపై కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి ఈమె తాజాగా బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. నేరెళ్ల శారద మాట్లాడుతూ.. “ఇటీవల టాలీవుడ్ కి చెందిన ఒక బడా నిర్మాత భార్యా, పిల్లలు ఉన్నప్పటికీ మరో అమ్మాయిని నమ్మించి, పెళ్లి చేసుకొని , నువ్వే నా భార్యవి అని చెప్పి, పిల్లల్ని కని ఇప్పుడు ఆమెను మోసం చేశారు. ఆ బడా ప్రొడ్యూసర్ పేరు బయటకు చెప్పకూడదు కానీ ఈ మధ్యనే ఆయన నిర్మించిన ఒక సినిమా మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. అయితే ఆ బాధితురాలు న్యాయం కోసం మా వద్దకు వచ్చింది. మేము ఆ ప్రొడ్యూసర్ కి నోటీసులు పంపించడానికి కూడా నోటీసులు సిద్ధం చేశాము. కానీ అనూహ్యంగా ఆ బాధితురాలు వెనకడుగు వేయడం దురదృష్టకరం”అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
ఇండస్ట్రీపై అసహనం వ్యక్తం చేసిన మహిళా కమిషన్..
అలాగే ఇండస్ట్రీలో జరిగే విషయాలపై కూడా ఆమె మాట్లాడుతూ..” కొరియోగ్రాఫర్లు , స్టార్ సింగర్లు, ప్రొడ్యూసర్లు, హీరోల చేతుల్లో మోసపోయి ఎంతో మంది మహిళా బాధితులు మా వద్దకు వస్తారు. కేసు నమోదు చేసుకొని నోటీసులు ఇచ్చే సమయానికి వాళ్లు మళ్లీ రావడం లేదు. సినిమా రంగానికి సంబంధించిన పెద్దలు వారిని పిలిపించుకొని మాట్లాడతారా? భయపడతారా? మరి ఏదైనా ఒప్పందం ఉంటుందా? అసలు ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదు. కానీ ఇలా మొదట తమ బాధను చెప్పి.. యాక్షన్ తీసుకునే సమయానికి బాధితులు వెనక్కి వెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు అంటూ శారదా చెప్పుకొచ్చారు.
పద్ధతి మారాలి అంటూ మహిళా కమిషన్ కామెంట్స్..
ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చిన మహిళలను అడ్వాంటేజ్ గా తీసుకోవడం సరికాదని, మహిళా వేధింపుల విషయంలో ఇండస్ట్రీ అంతా కలిసి కొన్ని రూల్స్ పెట్టుకుందాము అంటే ఇండస్ట్రీ వారు మాత్రం ఎవరూ ముందడుగు వేయడం లేదు. పైగా మేము గ్రహాంతరవాసులము అనే ఆలోచనలో ఉన్నారు అంటూ ఆమె విమర్శించారు. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో ఒక బడా ప్రొడ్యూసర్ గుట్టు రట్టు చేసి సంచలనం సృష్టించారు నేరెళ్ల శారద. మరి ఆ ప్రొడ్యూసర్ ఎవరు? ఆయన చేతిలో మోసపోయిన బాధిత యువతి ఎవరు? అనే విషయాలపై ఇటు నెటిజన్స్ కూడా ఆరా తీస్తున్నారు.
ALSO READ:Shobha Shetty: బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్న బిగ్ బాస్ బ్యూటీ.. రేపే ప్రారంభం!