TDP Leader Arrest: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎక్సైజ్ శాఖ భారీ సోదాలు జరిపింది. ఈ నేపథ్యంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని గుర్తించింది. ఈ ఆపరేషన్‌లో టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడు ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారీ జరుగుతున్నట్లు గుర్తించడంతో.. ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 13 మందిపై కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
కల్తీ మద్యం కేంద్రం బహిర్గతం
ఎక్సైజ్ అధికారుల వివరాల ప్రకారం, టీడీపీ ఇంచార్జ్ జయచంద్రరెడ్డి పీఏ రాజేష్.. ములకల చెరువులో ఉన్న రాక్ స్టార్ మద్యం దుకాణం పేరుతో ఈ నకిలీ వ్యాపారాన్ని నడిపిస్తున్నట్లు తేలింది. ఈ కేంద్రంలో తక్కువ నాణ్యత గల స్పిరిట్, రసాయనాలతో మద్యం తయారు చేసి, అసలు బ్రాండ్ల పేర్లతో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
రాయలసీమ అంతటా వ్యాపించిన నెట్‌వర్క్
ఈ ముఠా కార్యకలాపాలు అన్నమయ్య జిల్లా మాత్రమే కాకుండా.. చిత్తూరు, తిరుపతి, కడప, పుట్టపర్తి, అనంతపురం జిల్లాల్లో కూడా విస్తరించినట్లు దర్యాప్తులో తేలింది. రాయలసీమ అంతటా పెద్ద ఎత్తున నకిలీ మద్యం సరఫరా చేస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డి కూడా ఈ నకిలీ మద్యం నెట్‌వర్క్‌కు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టమైంది.
కోట్ల రూపాయల మద్యం సీజ్
సోదాల్లో అధికారులు సుమారు రూ.1.75 కోట్ల విలువ చేసే మద్యం, యంత్ర సామగ్రి, స్పిరిట్ క్యాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 35 లీటర్ల కెపాసిటీ గల 30 స్పిరిట్ క్యాన్లు, 42 బ్లెండ్ స్పిరిట్ క్యాన్లు, 15,224 రెడీ బాటిల్స్ ఉన్నాయి. అదేవిధంగా కేరళ మాల్టెడ్ విస్కీ, బెంగుళూరు బ్రాందీ, ఓల్డ్ అడ్మిరల్, రాయల్ లాన్సర్ వంటి ఏడు రకాల నకిలీ బ్రాండ్లను ఈ ముఠా తయారు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అంతేకాకుండా మూడు మ్యాన్యువల్ బాటిల్ ఫిల్లింగ్ మెషిన్లు, పది వేల ఖాళీ బాటిల్స్, కార్టన్ బాక్స్‌లు, క్యాప్‌లు, సీలింగ్ పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థలంలో బాటిలింగ్ ప్రక్రియతో పాటు లేబుల్ ప్రింటింగ్, ప్యాకేజింగ్ పనులు కూడా జరిగాయని ఎక్సైజ్ సిబ్బంది పేర్కొన్నారు.
అనేక రాష్ట్ర నేరగాళ్ల ప్రమేయం
ఈ ఘటనలో ఫస్ట్ తొమ్మిది మందిని ప్రధాన నిందితులుగా గుర్తించారు. వీరిలో నలుగురు తమిళనాడుకు, ఇద్దరు ఒడిశాకు చెందినవారని అధికారులు తెలిపారు. విజయవాడకు చెందిన జనార్ధన్ రావు ఈ ముఠాకు ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరించగా, నర్సీపట్నానికి చెందిన వ్యక్తి డ్రైవర్‌గా ఉన్నట్లు తేలింది.
మద్యం తయారీ గోదాం స్థల యజమాని లక్ష్మీనారాయణ ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. ఆయన లీజ్‌కు ఇచ్చిన స్థలాన్ని రామ్మోహన్ అనే వ్యక్తి సబ్‌లీజ్ ఇచ్చి.. ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రంగా మార్చినట్లు దర్యాప్తు చెబుతోంది.
దర్యాప్తు కొనసాగుతోంది
నకిలీ మద్యం తయారీలో ఉపయోగించిన రసాయనాల నమూనాలను పరీక్షల కోసం పంపించారు. ఈ మద్యం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని, ఇప్పటికే మార్కెట్లోకి కొన్నికేసులు వెళ్లి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు ఈ రాకెట్ వెనుక ఉన్న పెద్ద ముఠా, ఫైనాన్స్ వనరులు, రాజకీయ సంబంధాలను వెలికితీయడానికి దర్యాప్తును విస్తరించారు.
Also Read: అలక, ఆవేదన, అసంతృప్తి.. కొత్త నేతలకు గడ్డుకాలమేనా?
ప్రజలకు హెచ్చరిక
ప్రజలు అనుమానాస్పద మద్యం విక్రయాలపై.. వెంటనే సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ విజ్ఞప్తి చేసింది. కల్తీ మద్యం వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు.. రాష్ట్రంలో గతంలో నమోదైన నేపథ్యంలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
AP: అన్నమయ్య జిల్లా ములకలచెరువులో భారీ కల్తీ మద్యం తయారీ వ్యవహారం బయటపడింది. విజయవాడ, విశాఖ, తమిళనాడుకు చెందిన తొమ్మిది మంది ముఠాగా ఏర్పడి, ఓ భవనంలో స్పిరిట్, కెమికల్స్‌తో బ్రాండెడ్ మద్యం తయారు చేస్తున్నారు. వీరు సీసాల్లో నింపి, పాల వ్యాన్‌లో బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు.… pic.twitter.com/FWtSSxUQhS
— ChotaNews App (@ChotaNewsApp) October 4, 2025