Telangana BJP: ఎదుగుదల లేదా..? ఎదగనివ్వట్లేదా..? తెలంగాణ బీజేపీలో కొత్త నేతలకు గడ్డుకాలమేనా..? పదవులు, పోస్టుల్లోనూ అన్యాయం జరుగుతుందని కొత్త నేతలు ఆవేదన చెందుతున్నారా..? కొత్త నేతలు పాత నేతలు అవ్వాలంటే ఎంత కాలం పడుతుంది..? నిత్యం అలక, ఆవేదన, అసంతృప్తి, అసహనం, ఆత్మాభిమానం, ఆధిపత్యం అనేవి తెర మీదకొచ్చి రచ్చచేస్తున్నాయి అందుకేనా.? పార్టీలో రగులుతున్న కొత్త పాత మంటలు చల్లారేదెప్పుడు?
తెలంగాణ బీజేపీలో పాత, కొత్త నేతల మధ్య వార్
తెలంగాణ బీజేపీలో పాత, కొత్త నేతల మధ్య వార్ వన్ సైడ్ అన్నట్టుగా పంచాయితీ రగులుతూనే ఉందట. పార్టీలో ఎదుగుదల కోసం కొత్త నేతలు పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కాదనే చర్చ నేతల్లో నడుస్తోందట. నేతల మధ్య నడుస్తున్న అంతర్గత కుమ్ములాటలతో కొత్త నేతలంతా అసహనంతో, ఆత్మాభిమానాలు చంపుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఆ పార్టీలో అంతలా ఆత్మభిమానాలు చంపుకోవాల్సిన అవసరం నేతలకు ఎందుకొస్తుంది? అంతలా అసంతృప్తి, అసహనంతో బాధపడాల్సిన అవసరం ఏంటనేది చర్చనీయంశంగా మారింది. అంతేకాదు ఆపరేషన్స్, ఫైల్స్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే, తెలంగాణ బీజేపీలో మాత్రం నేతల మధ్య ఆపరేషన్స్, ఫైల్స్ రచ్చ రేపుతున్నాయనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ఎదగనివ్వడంలేదని విమర్శలు
తెలంగాణ బీజేపీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని పాత నేతలంతా ఎదగనివ్వడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త నేతలు చాలా మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తుండటం ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేరి ఏళ్లు గడుస్తున్నా, ఎలాంటి పదవులు, ఎలాంటి ప్రయారిటీ దక్కలేదనే ఆవేదన వ్యక్తంచేస్తున్నారట. నేతలే కాదు నేతలను నమ్ముకుని వచ్చిన వారు కూడా తమ నేతలకే పార్టీలో విలువ లేదు.. ఇంకా తమకేం విలువ ఉంటుందనే పరిస్థితికి ఆయా నేతల వర్గాలు చర్చించుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. పోస్టులు, పదవుల్లో కొత్తగా చేరిన వారికి ఇంత అన్యాయం చేస్తారా అనే ఆవేదన పలువురి నుంచి వ్యక్తమవుతోందట. కాషాయ పరివారులలో అంతర్గత కుమ్ములాటలు ఇప్పటికే కల్లోలం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ముందే రాజుకున్న కొత్త, పాత నేతల మధ్య మంటలు ఇంకా రచ్చ రేపుతూనే ఉన్నాయట.
ఫుట్‌బాల్‌తో నిరసన తెలిపిన కొండా విశ్వేశ్వరరెడ్డి
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా తర్వాత రాష్ట్ర బీజేపీలో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు రాజాసింగ్ ను మించిపోయారనే టాక్ నడుస్తోందట. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి నేరుగా ఫుట్ బాల్ తీసుకొచ్చి నిరసన తెలిపేంతా అసహనం నేతల్లో పెల్లుబుకుతోందనే చర్చ జరుగుతోంది. ఫుట్ బాల్ నిరసన చల్లారక ముందే, ఆత్మాభిమానం చచ్చిన తర్వాత వచ్చే పదవులు కాలి గోటితో పోల్చుతూ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వాఖ్యలు ఆ పార్టీలో దుమారం రేపుతున్నాయి.
రాష్ట్ర నాయకత్వాన్ని ఆడుకుంటున్న రాజాసింగ్
అంతేకాదు రాజాసింగ్ రాజీనామా చేసిన తరవాత కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని రబ్బర్ స్టాంప్ లంటూ, దగాకోరు నేతలంటూ నేరుగా పాత నేతలను ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. శాసనసభా పక్ష బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చప్పుడు చేయకుండా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారనే టాక్ జోరుగా నడుస్తోందట. కనీసం ఏలేటికి ఇప్పటివరకు సొంత పార్టీ ఆఫీసులో గదిని కేటాయించకపోవడంపై కూడా చర్చనీయంశంగా మారిందట. అంతేకాది సమయం దొరికినప్పుడల్లా ఆ పార్టీ ఎంపీ డీకే అరుణ కొత్త పాత పంచాయతీలపై ఫైర్ అవుతూనే ఉన్నారు. ఎంపీ ధర్మపురి సైతం తనదైన స్టైల్లో చురకలు అంటిస్తున్నారట. కొత్త నేతలు కాబట్టి పాత నేతలంతా దూరం పెట్టారనుకుందాం, ఆది సరే కానీ ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచినందుకు కనీసం ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా ఘోరంగా అవమానిస్తున్నారని మండిపడుతున్నారట. ఇట్లా ప్రతి కొత్త నేత, తమ తమ అసంతృప్తులతో కూడిన అసహనాలను వ్యక్తం చేస్తూ నిత్యం వార్తల్లోకెక్కుతుంటం ఇప్పుడు కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర బీజేపీఅధ్యక్ష పదవి ఆశించి భంగపడిన కీలక నేతలు
రాష్ట్ర బీజేపీఅధ్యక్ష పదవి ఆశించి భంగపడిన కీలక నేతలంతా తరచూ చేస్తున్న కామెంట్స్ దుమారం రేపుతూనే ఉన్నాయి. దీంతో పార్టీలో ఏం జరుగుతోంది అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయట. కొత్త నేతలపై పార్టీ అనుసరిస్తున్న ధోరణి కారణంగా కొత్త వారిని ఎదగనివ్వడంలేదని, ఎదుగుదలకు అడ్డుపడుతుందని స్పష్టంగా అర్థమవుతుందనే చర్చ ఇటు పార్టీవర్గాల్లో, అటు రాజకీయ వర్గాల్లో నడుస్తోందట. కొత్త నేతల ఎదుగుదలను పాత నేతలు అడ్డుకుంటున్నారనే ప్రచారంపై అధిష్టాన పెద్దలు ఎలాంటి నిర్ణయాలు, చర్యలు తీసుకుంటారనేది చూడాలి.
Story By Ajay Kumar, Bigtv Live