Sangareddy SI Suspension: సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఓ కేసు దర్యాప్తులో అవతలి వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన కారణంగా.. జిల్లా ఎస్పీ రూరల్ ఎస్సై పై సీరియస్ అయ్యారు. ఈ మేరకు మల్టీ జోన్-2 ఐజీపీ ఆదేశాలకు అనుగుణంగా ఎస్‌ఐ రవీందర్‌ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
లంచం కేసు
సంగారెడ్డి జిల్లా యువకుడు లోకేష్ చంద్ర ఓ కేసులో చిక్కుకుని, న్యాయం కోసం పోలీస్‌స్టేషన్ కు వెళ్లాడు. అయితే సహాయం చేయాల్సిన ఎస్ఐ రవీందర్ తన విధులను పక్కనబెట్టి.. లంచం కోసం ఒత్తిడి చేయడమే కాకుండా, పలుమార్లు వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఒత్తిళ్లతో మానసికంగా కుంగిపోయిన లోకేష్ చివరకు.. మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
బిగ్ టీవీ రిపోర్ట్ – కేసు మలుపు
ఈ ఘటనపై బిగ్ టీవీ న్యూస్ ప్రసారం చేసింది. లోకేష్ ఆత్మహత్యకు ప్రధాన కారణం ఎస్ఐ రవీందర్ వేధింపులేనని స్పష్టమైన ఆధారాలతో కథనం బయటకు రావడంతో, జిల్లా ప్రజల్లో ఆగ్రహం చెలరేగింది. మీడియా రిపోర్ట్ వెలుగులోకి రాగానే ఉన్నతాధికారులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు.
ఉన్నతాధికారుల విచారణ
మల్టిజోన్-II ఐజీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. విచారణలో వాస్తవాలు బయటపడి, రవీందర్ లంచం డిమాండ్ చేసి బాధితుడిని మానసికంగా వేధించిన విషయం తేలింది. బాధితుడు ప్రాణాలు తీసుకోవడానికి కారణం.. పోలీస్ అధికారుల తీరే అన్న నిజం దర్యాప్తులో స్పష్టమైంది.
ఎస్ఐ రవీందర్ సస్పెన్షన్
విచారణ నివేదిక అందుకున్న వెంటనే.. ఎస్పీ పరితోష్ పంకజ్ తగిన చర్యలు తీసుకున్నారు. ఎస్ఐ రవీందర్‌ను విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే దిశగా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
సమాజం నుంచి స్పందన
లోకేష్ ఆత్మహత్యపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజలకు రక్షకులు కావాల్సిన పోలీసులు, లంచం కోసం వేధిస్తే ఎవరిని ఆశ్రయించాలి? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బిగ్ టీవీ రిపోర్ట్ లేకపోతే ఈ కేసు ఇంత దూరం వెళ్లేది కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
Also Read: భార్య టార్చర్ తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్