మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సిట్ విచారణ నేపథ్యంలో తీవ్ర నిరాశకు లోనైన కేడర్‌కు మరోసారి జవసత్వాలు తీసుకొచ్చింది. కేవలం రెండు వారాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మున్సిపల్ ఎన్నికల కోసం తమ పార్టీకి జిల్లా స్థాయిలో ఇన్ చార్జులను నియమించాయి.తాజాగా ఆ జాబితాలోకి బీఆర్ఎస్ వచ్చి చేరింది. మొన్నటివరకు సిట్ విచారణ కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావులు బిజీగా ఉన్నారు.దీంతో పార్టీ గురించి పట్టించుకునే టైం వారికి లేకుండా పోయిందని చర్చ జరిగింది.
సిట్ విచారణ ఇంకా పూర్తి కాలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీశ్ రావుల స్టేట్మెంట్ రికార్డు చేసిన అధికారులు.. అవసరం అయితే మరోసారి విచారణకు రావాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు వారిని కేవలం సాక్షిగానే భావించి వాంగ్మూలం తీసుకున్నారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరికొందరు నేతలకూ సిట్ నోటీసులు పంపే చాన్స్ ఉందని టాక్ వినబడుతోంది.ఈ క్రమంలోనే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేటీఆర్, హరీశ్ రావులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సిట్ విచారణ నేపథ్యంలో అధికారులు అడిగిన ప్రశ్నలను కేసీఆర్ ఆరా తీసినట్టు తెలిసింది.
అనంతరం సిట్ విచారణ అనేది మున్సిపల్ ఎన్నికలకు అడ్డంకిగా మారకూడదని గులాబీ బాస్ వారికి చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలోనే నిన్న రాత్రి భేటీ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ఇన్ చార్జులను ప్రకటించారు. నియోజకవర్గాల వారిగా సీనియర్లు, ఎన్నికల్లో పార్టీని గెలిపించే అభ్యర్థులను ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం వీరంతా స్థానిక కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున బరిలో నిలిచి గెలిచే అవకాశాలు ఉన్న వ్యక్తుల జాబితాను ఎంపిక చేసి పార్టీ అధిష్టానానికి పంపించాల్సి ఉంటుంది.
BRS Party: బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం.. ఆ ఛానల్ బహిష్కరణ, అసలు కారణం అదే
ఆశావహుల జాబితా గులాబీ పార్టీలోనూ చాలానే ఉన్నది. అందుకే స్థానిక ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జుల సలహాలు సూచనల మేరకు ఫైనల్ అయిన జాబితాను అధిష్టానానికి పంపించగా.. అక్కడ మున్సిపల్ వార్డు సభ్యులు, కార్పొరేషన్ అభ్యర్థులను రిజర్వేషన్ల వారీగా ఎంపిక చేసి ఫైనల్ చేయనున్నారు. వారంలోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులతో పాటు సీనియర్లు ఎన్నికల ప్రచారం జోరుగా పెంచాలని కేటీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది. సర్పంచ్ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు రాబట్టాలని ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. సిట్ విచారణ అంశం మున్సిపల్ ఎన్నికలకు ముడిపడకూడదని.. కేవలం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలంతా బిజీగా ఉండాలని.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు తమ హయాంలో జరిగిన అభివృద్ధి వివరించాలని కేటీఆర్ ఆదేశించినట్టు తెలుస్తున్నది. కాగా, ఏదైతేనేమి బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో ఓ అడుగు ముందుకు వేసిందని ఆ పార్టీనేతలు చర్చించుకుంటున్నారు.