BRS Party: స్వేచ్ఛ బ్యూరో: రాజ్యసభ అభ్యర్థిపై బీఆర్ఎస్ పార్టీ డైలమాలో పడింది. పోటీ పెట్టాలా వద్దా? అనే సందిగ్దంలొ పడింది. బరిలో నిలిపితే పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారా? ఒక వేళ క్రాస్ ఓటింగ్ జరిగితే పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని ఆందోళన నెలకొంది. అభ్యర్థిని బరిలో నిలిపితే 40మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ కు సంఖ్యా బలం లేకపోవడంతోనే వెనుకంజ వేసినట్లు సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ పోటీకి దూరంగా ఉండాలని ఇప్పటికే నేతలకు సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.
రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు ఈ నెల5(గురువారం) చివరి తేది. అయితే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి కదలిక లేదు. పార్టీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న కేఆర్ సురేశ్ రెడ్డి పదవికాలం ఈ ఏడాది ఏప్రిల్ 9తో ముగుస్తుంది. ఆ స్థానంలో గులాబీ పార్టీ నుంచి అభ్యర్థిని ఎవరిని నిలపాలనేదానిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఆతర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యే గా గెలిచిన లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మరో అసెంబ్లీ నియోజకవర్గమైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సైతం అనారోగ్యంతో మృతి చెందగా జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి 37మంది కి ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది. అయితే రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో 27మందికి చేరింది. అసెంబ్లీ రికార్డుల్లో 37 మందిగా పేర్కొంటున్నప్పటికీ ఆ పది మంది సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితులతో పార్టీ రాజ్యసభకు అభ్యర్థిని నిలిపితే 40మంది ఎమ్మెల్యేలు అవసరం అవుతాయి. కానీ ఉన్నది మాత్రం 27 మంది మాత్రమే. దీంతో పోటీకి దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సంఖ్యాబలం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
పార్టీ ఫిరాయింపులు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టాలంటే రాజ్యసభకు అభ్యర్థిని బరిలో నిలపాలని పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ నుంచి విప్ జారీ చేస్తే ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారనేది స్పష్టమవుతుందని దీంతో వారిపై ఒత్తిడి పెంచవచ్చని, కోర్టులో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించవచ్చని భావిస్తున్నట్లు తెలిసింది. ఇస్నాపూర్ వైస్ చైర్మన్, ఆసిఫాబాద్ లో కౌన్సిలర్ లు సస్పెండ్ చేసిన అధికారులు ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఇది కాంగ్రెస్ ద్వంద వైఖరిని నిదర్శనమనే విషయాన్ని విస్తృత ప్రచారం చేయాలని గులాబీ భావిస్తుంది. అస్త్రంగా చేసుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తుంది.
Also Read: Crime drama OTT: 47 అవార్డులతో ప్రశంసలు… అప్పు ఇచ్చిన బ్యాంకుకే కన్నం… చూసే కొద్దీ చూడాలనిపించే మూవీ
గులాబీ పార్టీకి ప్రస్తుతం 27మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే ఇప్పటివరకు పోటీపై అధిష్టానం స్పష్టంగా ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను బరిలో నిలిపేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ సైతం పోటీలో నిలిపితే ఈ 27 మంది ఎమ్మెల్యేల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడితే పరిస్థితి ఏంటనేది ఆందోళన మొదలైనట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వరుస ఓటములతో కూదేలవుతున్న గులాబీకి మళ్లీ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగితే పార్టీ మరింత ఇబ్బందులు పడుతుందని, పార్టీ కేడర్ లోనూ నైరాశ్యం నెలకొని భవిష్యత్ కష్టమవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. పోటీకి దిగి పార్టీని నాశనం చేసుకోవడం కన్నా పోటీకి దూరంగా ఉంటేనే మంచిదని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీష్ రావును రాజ్యసభకు అభ్యర్థిని బరిలో నిలుపుతున్నారా? అని అడిగితే చివరివరకు సస్పెన్స్ అంటూ సమాధానం ఇచ్చారు. పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. అంటే పోటీలేదని, కేవలం చర్చకోసమే ఇలా హింట్ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. బరిలో అభ్యర్థిని నిలిపితే గెలువడం అసాధ్యమని తెలిసే పోటీకి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో ఒక్కస్థానంలో కూడా విజయం సాధించలేదు. దీంతో లోక్ సభలో బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇక రాజ్యసభలోనూ గులాబీ ప్రాతినిధ్యం తగ్గుతుంది. గతంలో 7 స్థానాలకు 7గురు ప్రాతినిధ్యం వహించేది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం, అభ్యర్థిని బరిలో నిలిపితే కావల్సిన సభ్యులు లేకపోవడంతో పోటీ నుంచి తప్పుకుంటుంది. దీంతొ పార్టీకి బలం సైతం తగ్గుతూ వస్తుంది. కేఆర్ సురేశ్ రెడ్డి పదవికాలం ఈ ఏప్రిల్ 9తో ముగుస్తుండటంతో ఇక ముగ్గురు మాత్రమే బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. అందులో వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారధి, డి. దామోదర్ రావు మాత్రమే.
Also Read: Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఈ జిల్లానే టాప్..?