Banjara Ekta: స్వేచ్చ బ్యూరో: బంజారాల సమాజం ఐక్యత కోసం ఈనెల 5న సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మస్థలం సేవాగఢ్ నుంచి ఢిల్లీ వరకు ప్రారంభమైన బంజారా ఏక్తా యాత్ర త్వరలోనే విజయవంతంగా పూర్తికానుందని, ఆపై ఈనెల 27న ఢిల్లీలోని తల్కా తోరా స్టేడియంలో భారీ బహిరంగసభను నిర్వహిస్తున్నట్లు మాజీ ఐపీఎస్ అధికారి, సంత్ సేవాలాల్ మహారాజ్ ట్రస్ట్ అధ్యక్షుడు కొర్ర జగన్నాథరావు తెలిపారు.
హైదరాబాద్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 27న నిర్వహిస్తున్న సభకు దేశవ్యాప్తంగా ఉన్న బంజారా సోదర సోదరీమణులు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థల ప్రతినిధులు, మేధావులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పలు పేర్లతో గుర్తింపు పొందుతూ మౌలిక వసతులు లేక తండాల్లో నివసిస్తున్న బంజారా సమాజం అభివృద్ధి కోసం జాతీయ తండా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, భాష, చరిత్ర, సంసృతి అందరిదీ ఒక్కటేనని, కావున బంజారభాషను రాజ్యంగంలోని 8వ షెడ్యూలులో చేర్చి అధికారిక గుర్తింపును కల్పించి తగిన గౌరవం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న బంజారా సమాజాన్ని ఒకే వేదికపై తెచ్చి ఐక్యమత్యంతో తమ సమస్యలను పరిష్కరించు కునేందుకు దేశంలో మొట్టమొదటిసారిగా భారత్ బంజారా ఏక్తా సంకల్ప యాత్రను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేయడం, సాంస్కృతిక పరిరక్షణ, భావి తరాలకు తమ చరిత్రను అందించడం ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు.
సేవాగఢ్‌లో సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మస్థలాన్ని జాతీయ స్థాయి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, అలాగే బంజారా చరిత్ర, సంస్కృతి పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సేవాగఢ్ ధర్మాధికారి మహారాజ్, కర్ణాటక రాష్ట్ర మహారాజ్ సిద్ధలింగస్వామి, ట్రస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్ర నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ సింగ్, కోశాధికారి సీతారాం, ట్రస్టు సభ్యులు రామా నాయక్, మహేష్ బంజారా తదితరులు పాల్గొన్నారు.
Also read: దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్