KTR Criticism: రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌లో ఉంటే ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌లో పడుకుందని ఎద్దేవా చేశారు. ఎల్నినో వస్తుందని శాస్త్రవేత్తలు ఆరు నెలల ముందే హెచ్చరించారని.. ప్రభుత్వం ఇప్పుడు మీటింగులు పెట్టి ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. రైతులు ఇప్పటికే నష్టపోయారన్న ఆయన.. ప్రభుత్వానికి ప్రణాళిక లేదని, దిశ లేదని మండిపడ్డారు.
బాన్సువాడ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ ను తెలంగాణ భవన్ లో కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పై విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ ప్రయాణిస్తున్న పడవ కాదని.. మునిగిపోయే పడవ అని సెటైర్లు వేశారు. ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలను తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. 70 వేల ఉద్యోగాల నియామకంపై తన సవాల్‌కు ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పలేదన్నారు.
బాన్సువాడ ప్రజలు ఒకప్పుడు గులాబీ జెండాను ఎగరేసి పోచారం శ్రీనివాస్ రెడ్డిని విశ్వసించి గెలిపించారని కేటీఆర్ అన్నారు. అయితే ఆయన ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. ‘గాచారం బాగాలేకనే పోచారం వేరే దానికి పోయిండు. అంతే తప్ప ఇంకేం లేదు. ఎవడైనా తెలిసి తెలిసి మునిగే పడవ ఎక్కుతారా? కాంగ్రెస్ అనేది అసలు ఉండే పార్టీయా? భవిష్యత్తు ఉన్న పార్టీయా? నాది కాంగ్రెస్‌లోనే పుట్టుక అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి అందులో చేరారు. ఇప్పుడు మింగలేక కక్కలేక, కుడితిలో పడ్డ ఎలుక లాగా గిలగిల కొట్టుకునే పరిస్థితికి చేరుకున్నారు’ అంటూ పోచారం శ్రీనివాస్ పై సెటైర్లు వేశారు.
రానున్న ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఓడించడమే బీఆర్ఎస్ కార్యకర్తల లక్ష్యంగా ఉండాలని బాన్సువాడ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ తిరుమలగా పేరుగాంచిన బాన్సువాడ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ తిరుమల వెంకన్న స్వామి శాపం తప్పకుండా తగులుతుందన్నారు. బాన్సువాడలో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందన్నారు.
మరోవైపు రెండేళ్లకు పైగా కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని ఆరోపించారు. తెల్లారితే కేసీఆర్‌ను తిట్టడం, దేవుళ్ల మీద ఒట్లు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకో పని లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ అన్నారు. యూరియా కొరత, విద్యుత్ సమస్యలు, ధాన్యం కొనుగోలు ఇబ్బందులు, సాగునీటి కొరత వంటి సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు సకాలంలో అందేదని, యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.
Also Read: సీఎం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇండ్లు.. ఇలా అప్లై చేసుకోండి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఈ సందర్భంగా కేటీఆర్ ఆరోపించారు. ‘నిజాంసాగర్ సామర్థ్యం 17 టీఎంసీలు. కేవలం రెండు రోజులు మోటార్లు నడిపితే ప్రాజెక్టు నిండిపోతుంది. కానీ ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదు. రైతులంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదు’ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు దెబ్బతిన్నాయని, కానీ మొత్తం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం సరికాదన్నారు.
Also Read: ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!