Kova Lakshmi: రేషన్ కార్డుల పంపిణీ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల సంక్షేమానికి నిర్వహించబడతాయి. కానీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమం మాత్రం అందుకు భిన్నంగా మలుపు తిరిగింది. జన్కపూర్‌లో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ సభలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. BRS పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి తన సహనాన్ని కోల్పోయారు. కాంగ్రెస్ నాయకుడిపై చేతికి దొరికిన వాటర్ బాటిల్ విసిరారు. ఈ ఘటన అంతా మీడియా కెమెరాల్లో రికార్డయ్యింది. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఈ ఘటన ఎట్లా జరిగిందంటే..
సాధారణంగా ప్రభుత్వం చేపట్టే పథకాల పంపిణీ కార్యక్రమాలకు ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా హాజరవుతారు. అలానే ఈ సభకు ఎమ్మెల్యే కోవా లక్ష్మి కూడా వచ్చారు. సభ ప్రారంభమై ఎమ్మెల్యే తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన కొద్ది సమయంలోనే బహిరంగ వేదికపై ఉద్రిక్తత మొదలైంది. ఆమె ప్రసంగాన్ని మధ్యలోనే అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు.. ఇది ప్రభుత్వ కార్యక్రమం.. ఇక్కడ పార్టీ రాజకీయాలు మాట్లాడకండి అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోవా లక్ష్మి తీవ్ర ఆగ్రహంతో స్పందించారు. టేబుల్‌పై ఉన్న వాటర్ బాటిల్‌ను పక్కనే ఉన్న కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్‌పై విసిరారు. ఆ తర్వాత ఆమె ఏదైనా వస్తువు దొరికితే అదే చేతికెత్తుకుని విసురుతూ రెచ్చిపోయారు. సభ వేదిక ఒక్కసారిగా ఉద్రిక్తతకు గురైయ్యింది. అక్కడున్న అధికారులు, పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా MLA కోపం తగ్గకపోవడంతో సభ మొత్తం గందరగోళంగా మారింది.
రాజకీయాలపై అసహనమా? లేక మరేదైనా?
ఎమ్మెల్యే కోవా లక్ష్మి వ్యవహారంపై ఇప్పుడు విపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమంలో ఇలా రెచ్చిపోయిన ఎమ్మెల్యే నైతిక హక్కు కలిగిందా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, మరోవైపు BRS వర్గాలు మాత్రం ఎమ్మెల్యే ప్రవర్తనను సమర్థించకపోయినా, కాంగ్రెస్ నాయకుల తీరును తప్పుబడుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం సబబా? అనే ప్రశ్నలు వేస్తున్నారు.
Also Read: Bc Bill: సడన్‌గా రాజకీయ పార్టీలకు బీసీలపై ప్రేమ దేనికి?
రాజకీయ వేడి వేదికపైకి..
ఈ ఘటన నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో రాజకీయ తాపం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజా కార్యక్రమాల వేదికలు రాజకీయాల కోసం మారుతుంటే, నష్టమయ్యేది ప్రజలకే అన్నది తలపెట్టాల్సిన విషయం. ప్రజల సమస్యలపై దృష్టిపెట్టాల్సిన నాయకులు, ఒకరిపై ఒకరు బాటిళ్లు విసురుకుంటే, అవమానం పాలవే ప్రజాస్వామ్యానికే.
వీడియో వైరల్.. సోషల్ మీడియాలో MLA పై విమర్శలు
సభ వేదికపై జరిగిన ఈ ఉద్రిక్తతను అక్కడే ఉన్న మీడియా రిపోర్టర్లు వీడియోలో రికార్డు చేశారు. తక్కువ సమయంలోనే ఆ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఒక మహిళా ఎమ్మెల్యే నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదు, ఇది ప్రజాప్రతినిధుల తీరా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
ప్రజల సంక్షేమానికి ప్రభుత్వ పథకాలను అమలు చేయాల్సిన సమయంలో, ప్రజల మధ్య ఉద్రిక్తతలు రేపే విధంగా వ్యవహరించడం బాధాకరం. కార్యక్రమాల వేదికలు రాజకీయ దాడుల వేదికలుగా మారకూడదు. మన నాయకులు ఉదారంగా, సహనంతో వ్యవహరించాలని ప్రజలే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థ ఆశిస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వమే స్పందించి దర్యాప్తు చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.