ఓటరుని ఓటరుగా రాజకీయ పార్టీలు ఎప్పుడూ పరిగణించవు. ఓటరు అంటే అందులో కేటగిరీలుంటాయి. పురుషులా, మహిళలా, ఓసీలా, బీసీలా, ఎస్సీ-ఎస్టీలా.. ఇలా వర్గీకరించుకుంటారు. ఇటీవల కుల రాజకీయాలు బాగా పెరిగిపోయాయి కాబట్టి ఓసీల్లో కూడా ఫలానా కులంవారి ఓట్లు ఎన్ని ఉన్నాయి, బీసీల్లో ఫలానా వర్గం వారి ఓట్లు ఎన్ని ఉన్నాయనే లెక్కలు బయటకు తీసిమరీ గెలుపు లెక్కలు వేసుకుంటారు నాయకులు. ఈ లెక్కలు ఎలా ఉన్నా.. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బీసీలకు మెజార్టీ ఓట్లు ఉంటాయి. గంపగుత్తగా బీసీ ఓట్లు కొల్లగొడితే చాలు ఆ అభ్యర్థి విజయం గ్యారెంటీ. కానీ అది అసాధ్యం అని అందరికీ తెలుసు. అందుకే ఒక్కోసారి ఒక్కో రకంగా బీసీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంటాయి రాజకీయ పార్టీలు.
తెలంగాణలో బీసీ రాజకీయాలు..
తెలంగాణకు ఒక ఎస్సీని తొలి ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పి అప్పట్లో ఆ సామాజిక వర్గానికి మరింత దగ్గరయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కానీ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఎన్ని పిల్లిమొగ్గలు వేశారో అందరికీ తెలుసు. ఇక అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఆ పార్టీ చేసింది శూన్యం అనే చెప్పాలి. కాంగ్రెస్ విషయానికొస్తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపట్టి అతి పెద్ద సాహసం చేసింది కాంగ్రెస్. అంతే కాదు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి, కేంద్రానికి పంపించారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడితో కథ సుఖాంతం కాలేదు. ఆ రిజర్వేషన్లకు కేంద్రం మోకాలడ్డింది. దీంతో మళ్లీ గొడవ మొదలైంది. బీసీలకోసం పాటుపడేది మేమంటే మేమంటూ అన్ని పార్టీలూ చెప్పుకుంటున్నాయి. అదే సమయంలో బీసీలకు అన్యాయం చేస్తోంది మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు నేతలు.
కాంగ్రెస్ పాత్ర ఏంటి..?
బీసీ రిజర్వేషన్ బిల్లుని అసెంబ్లీలో ఆమోదింపజేసి కేంద్రానికి పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రిజర్వేషన్ పై రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే చట్టం చెల్లుబాటవుతుంది. కానీ రాష్ట్రపతి కేంద్రం అనుమతితోనే ఆ పనిచేయాలి, అంటే ఇక్కడ కేంద్రానికి బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచడం ఇష్టం లేదని చెప్పాలి. దీంతో కాంగ్రెస్ పోరుబాటకు సిద్ధమైంది. అవసరమైతే ఢిల్లీలో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈలోగా తెలంగాణలో స్థానిక ఎన్నికలు రాబోతుండటంతో తమ పార్టీ తరపున బీసీలకు 42శాతం సీట్లు కేటాయించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. అదే జరిగితే, బీసీల ఓట్లు కాంగ్రెస్ వైపు మరలుతాయనడంలో సందేహం లేదు.
బీజేపీ ఏమంటోంది?
బీసీ బిల్లుని అడ్డుకుంటున్నారన్న అపవాదు బీజేపీపై ఉంది. అయితే తెలివిగా ఆ పార్టీ తప్పించుకోవాలని చూస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ప్రకారం 42 శాతంలో ముస్లింలకు 10శాతం రిజర్వేషన్లు కలిపే ఉన్నాయని, కేవలం బీసీలకు 32శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలవుతాయని అంటున్నారు బీజేపీ నేతలు. అందుకే తాము ఆ బిల్లుని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ముస్లింలకు కేటాయించిన 10శాతం రిజర్వేష్లు తీసేసి కేవలం బీసీలకే 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తే వెంటనే ఆ బిల్లుకి ఆమోద ముద్ర వేయిస్తామని అంటున్నారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం అంటున్న బీజేపీ, బీసీలపై ప్రేమ చూపిస్తున్నట్టుగా కలరింగ్ ఇస్తోంది.
బీఆర్ఎస్ వాదన ఏంటి?
బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో బీఆర్ఎస్ సందిగ్ధంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని, బీజేపీ బిల్లు ఆమోదానికి అడ్డుపడుతోందని అంటోంది బీఆర్ఎస్. తమ హయాంలో బీసీ రిజర్వేషన్ గురించి ఎందుకు ఆలోచించలేదనే ప్రశ్న వస్తే మాత్రం సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ నేతలు తడబడుతున్నారు. బీసీ గర్జన అంటూ హడావిడి చేశారు కానీ, చివరకు చప్పబడ్డారు. కొత్తగా కవిత బీసీ రాగం అందుకోవడం కూడా పరోక్షంగా బీఆర్ఎస్ ని ఇరుకునపెడుతోంది. బీఆర్ఎస్ 9 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు పూలే విగ్రహం ఊసే ఎత్తని కవిత, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీ నాయకుల విగ్రహాలంటూ హడావిడి చేయడం హాస్యాస్పదంగా మారింది. ఇక బీసీ బిల్లు విషయంలో కవిత కాంగ్రెస్ ని సమర్థిస్తున్నా.. అది చట్టంగా మారకపోవడంలో ఆ పార్టీ ఉదాసీనత కూడా ఉందని అంటోంది.
మూడు పార్టీల్లో ఎవరికి బీసీలపై ఎక్కువ ప్రేమ ఉంది, ఎవరిది కపట ప్రేమ అని చెప్పడం కాస్త కష్టమే. కానీ అన్ని పార్టీలకు బీసీల ఓట్లు మాత్రం కావాలి, వాటి ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని అనుభవించాలి అని ఉంటుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ముందడుగు వేయడం మిగతా పార్టీలకు ఇబ్బందిగా మారింది. బీసీ బిల్లు చట్టంగా మారితే కచ్చితంగా అది కాంగ్రెస్ ఘనతే అవుతుంది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అన్నీ తానై చేసినా.. తెలంగాణలో 9 ఏళ్లు అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. ఇటు ఏపీలో పార్టీ పూర్తిగా శవాసనం నుంచి కదలనంటోంది. బీసీ బిల్లు విషయంలో అయినా క్రెడిట్ తీసుకోవడంలో కాంగ్రెస్ ముందుంటుందో లేక వెనకబడుతుందో చూడాలి.