మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్.. బీఆర్ఎస్ పార్టీపై కక్ష రాజకీయాలు చేస్తున్నదని ఆ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్నది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సిట్ నోటీసుల పేరుతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నది గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు సిట్ విచారణ జరగడానికి ఆద్యులు ఎవరు? ఫోన్ ట్యాపింగ్ ఎవరి హయాంలో జరిగింది? ఎందుకు జరిగింది? ఎవరు చేయించారు? ఎవరి స్వార్ధ ప్రయోజనాల కోసం ఆనాడు ప్రతిపక్ష పార్టీ నేతల వాయిస్ కాల్స్ విన్నారు? అని ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతున్నది. సిట్ అధికారులు ఎన్నికల సమయంలోనే తమను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని బీఆర్ఎస్ పెద్దలు ప్రశ్నిస్తున్నారు.ఎన్నికల్లో లబ్ది పొందడానికే విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత సీఎం, నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, నాటి బీజేపీ ఎంపీ బండి సంజయ్, పలువురు కీలక నేతలు సైతం తమ ఫోన్లను బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేస్తుందని ఆరోపించారు.ఈ క్రమంలోనే ప్రభుత్వం మారగానే సీఎం రేవంత్ రెడ్డి..ఫోన్ ట్యాపింగ్‌పై నిజానిజాలు తేల్చాలని సిట్‌ను ఏర్పాటు చేసి ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలోనే అధికారులు సుమారు 500లకు పైగా సాక్ష్యులను విచారించినట్టు సమాచారం. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో కీ పొజిషన్‌లో ఉన్న హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, చివరకు మాజీ సీఎం కేసీఆర్‌ను సైతం సిట్ విచారించింది.వారి స్టేట్మెంట్స్ రికార్డు చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు త్వరగా ముగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నది.ఈ క్రమంలోనే పాత సిట్ స్థానంలో కొత్త అధికారులకు విచారణ అధికారాలు కల్పించారు. మార్చిలోపు విచారణ పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని సీఎం రేవంత్ సిట్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే సిట్ దూకుడుగా వ్యవహరిస్తూ నిర్ణీత సమయంలోగా విచారణ పూర్తి చేసేందుకు సాక్షులుగా అందరి వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్నది. అదే సమయంలో ఎన్నికలు వచ్చాయి. అయినా, సిట్ తన పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నది. దీనిని ఎన్నికల లబ్ది కోసమే ప్రభుత్వం సిట్‌ను వాడుకుంటున్నదని ప్రతిపక్షం ప్రచారం చేయడం సరికాదని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. విచారణ త్వరగా ముగించాలని ఇతర పార్టీలు సైతం కోరుతున్నాయి.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సీపీ సజ్జనార్ తీరుపై హరీష్ రావు ఫైర్!
అధికారం కోసం అర్రులు చాచిన గత బీఆర్ఎస్.. నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేయించి ఎన్నికల వేళ ఆ రెండు పార్టీలకు చెందిన డబ్బులను భారీగా పట్టుకుంది. ఫలితంగా వారికి తమ ఫోన్స్ ట్యాపింగ్ అవుతున్నాయని తెలిసి వచ్చింది. ఏ నేతలు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ఎవరు ఏ పార్టీకి డొనేషన్ ఇస్తున్నారో ముందే గుర్తించి నాటి ఎస్ఐబీ అధికారులు ఆ డబ్బును స్వాధీనం చేసుకునే వారు.ఇదంతా ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టి ఎన్నికల్లో కట్టడి చేయడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కుట్ర పన్నిందని ఆనాడు జోరుగా ప్రచారం జరిగింది. దొంగతనంగా ఎదుటివారు మాట్లాడుకున్నది వినడం కుట్ర, నేరమా? లేక తప్పు చేసిన వారిని గుర్తించేందుకు చేపట్టే సిట్ విచారణ కుట్రనా? కక్షపూరితమా? అనేది ప్రజలే గుర్తించాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.