Shravan Rao : ఐ న్యూస్ శ్రవణ్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులు కీలక నిందితుడు. ఇన్నా్ళ్లూ అమెరికాకు పారిపోయారు. సుప్రీంకోర్టు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చారు. వచ్చాక సిట్ ముందు వరుసగా హాజరవుతున్నారు. ఇక తను సేఫ్ అనుకుంటుండగానే.. శ్రవణ్ రావు మెడకు ఓ చీటింగ్ కేసు చుట్టుకుంది. కట్ చేస్తే.. శ్రవణ్ రావు అరెస్ట్. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్. జైలుకు తరలింపు. చట్టం తలుచుకుంటే.. ఎట్టా ఉంటాదో శ్రవణ్‌రావుకు బాగా తెలిసొచ్చినట్టుంది.
దుబాయ్‌లో ఫ్లాట్ కబ్జా..
శ్రవణ్ రావుపై అఖండ ఇన్‌ఫ్రా టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఆకర్ష్ కృష్ణ కంప్లైంట్ చేశారు. తమ కంపెనీని 6.5 కోట్లకు మోసం చేశారని ఫిర్యాదులో తెలిపారు. పోలీసులు విచారణకు పిలిచి.. అనంతరం ఆరెస్ట్ చేశారు. అయితే, ఆ చీటింగ్ కేసులో అనేక ట్విస్టులు ఉన్నాయి. శ్రవణ్ రావు, ఆకర్ష్ కృష్ణ మధ్య కొన్నేళ్లుగా గొడవలు నడుస్తున్నాయి. శ్రవణ్ రావు భార్య స్వాతిరావు, ఆకర్ష కృష్ణ భార్య పేరుతో దుబాయ్‌లో ఓ ఫ్లాట్ కొన్నారు. ఆ ఫ్లాట్‌ని శ్రవణ్ రావు కబ్జా చేశాడని ఆకర్ష్ కృష్ణ అంటున్నారు. అదొక్కటే కాదు. శ్రవణ్‌రావు మోసాలు మరిన్ని వెలుగు చూస్తున్నాయి. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కి గతంలో కొద్దికాలం పాటు ఛైర్మన్‌గా కూడా పని చేశారు శ్రవణ్ రావు. ఆయన హయాంలో పబ్లిక్ స్కూల్ నిధులను పక్క దారి పట్టించారని ఆకర్ష్ కృష్ణ తండ్రి మురళి ముకుంద్ ఆరోపిస్తున్నారు. శ్రవణ్ రావుపై మరో చీటింగ్ కేసు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడా జైల్లో ఉన్నారు శ్రవణ్‌రావు. ఇప్పటికే ఆయనపై ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తోంది.
Also Read : కవితకు హరీశ్‌రావు షాక్.. కేటీఆర్ గేమ్ షురూ..
ప్రభాకర్‌రావు వచ్చేనా?
మరోవైపు, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. CBI ద్వారా ఇంటర్ పోల్‌కు రెడ్ కార్నర్ నోటీసులు కూడా పంపించారు. ప్రభాకర్ రావు పాస్‌పోర్టు రద్దు, ఆయనపై నమోదైన కేసు వివరాలన్నీ రెడ్ కార్నర్ నోటీసుల్లో పొందుపరిచారు సిటీ పోలీసులు. ఆ వివరాలను ఇంటర్ పోల్ అధికారులు అమెరికా ప్రభుత్వానికి అందించనున్నారు. ప్రభాకర్ రావును డిపోర్ట్ చేసే నిర్ణయం అమెరికా ప్రభుత్వం చేతిలోనే ఉంది. నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలో రాజకీయ శరణార్థిగా గుర్తించాలని ఇప్పటికే అప్లికేషన్ పెట్టుకున్నారు. దీనిపై యూఎస్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభాకర్ రావు అరెస్ట్ అయితేనే.. ఈ కేసులో కీలక సమాచారం లభించే అవకాశం ఉంది. అందుకే.. భారత విదేశాంగ శాఖ చొరవతో ఆయన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు.