Shakti Cyclone: భారత వాతావరణ శాఖ (IMD) తాజా ప్రకటనతో దక్షిణ భారతదేశానికి, ముఖ్యంగా తీరప్రాంతాలకు అత్యవసర అప్రమత్తత అవసరమని చెప్పవచ్చు. నైరుతి రుతుపవనాలు అధికారికంగా ప్రారంభమైనట్టు IMD ప్రకటించగా, అదే సమయంలో అండమాన్ సముద్రంపై ఏర్పడుతున్న వాయు ప్రసరణ తుఫాను శక్తిగా మారబోతోందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
ఈసారి రుతుపవనాలు త్వరగా రాష్ట్రాలను పలకరించనున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై భారత వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తుఫాన్ హెచ్చరికను సైతం ఐఎండి ప్రకటించడం విశేషం.
మే 16 నుంచి 22 మధ్య అల్పపీడనం.. మే 23 తర్వాత తుఫానుగా?
అండమాన్ సముద్రంపై 1.5 నుండి 7.6 కి.మీ ఎత్తు వరకూ ఎగువ వాయు ప్రసరణ పర్యవేక్షణలో ఉంది. ఇది మే 16-22 మధ్య అల్పపీడనంగా రూపుదిద్దుకుని, మే 23-28 మధ్య ‘శక్తి’ అనే తుఫానుగా మారే అవకాశముందని IMD అంచనా వేసింది.
తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఈ తుఫాను మే 24 నుంచి 26 మధ్య ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం మరియు బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లోని ఖుల్నా, చటోగ్రామ్ ప్రాంతాలను తాకే అవకాశం ఉంది. వాతావరణ నిపుణులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఎల్లో అలర్ట్..
కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే మే 16 వరకు రుతుపవనాలకు ముందు వర్షాలు కురిసే అవకాశమున్నందున ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. కోల్‌కతాలో కూడా బుధవారం పాక్షిక మేఘావృత ఆకాశం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అరేబియా సముద్రంలో..
ఇక అరేబియా సముద్రం పైన తూర్పు మధ్య, దక్షిణ ప్రాంతాలలో తక్కువ, మధ్యస్థ మేఘాలు విస్తరించినట్లు IMD తెలిపింది. లక్షద్వీప్, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: Garden: వైజాగ్‌లో బీచ్ మాత్రమే కాదు.. ఈ సీక్రెట్ గార్డెన్ గురించి తెలుసా?
సురక్షితంగా ఉండండి
తుఫాను శక్తి ఎటు తిరుగుతుంది? ఎంత ప్రభావం చూపుతుంది? అనే అంశాలు ఇంకా అభివృద్ధి చెందుతున్న తుఫాను స్వరూపాన్ని బట్టి స్పష్టమవుతాయి. ప్రజలు అధికారిక వాతావరణ అప్డేట్లను అనుసరించి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.