CM Revanth Reddy: సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మేనేజ్‌మెంట్ వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. మంగళవారం ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదం జరిగి 24 గంటలు దాటినా యాజమాన్యం ఘటన జరిగిన ప్రాంతానికి రాలేదు. ఈ విషయంలో యాజమాన్యం వ్యవహరించిన తీరుని తప్పుబట్టారు. పరిశ్రమలో బాయిలర్స్ డైరెక్టర్స్ అధికారులు తనిఖీలు చేశారా? తనిఖీ చేసి ఏమైనా సమస్యలు గుర్తించారా? బాయిలర్ల పని తీరుపై యాజమాన్యానికి ఏమైనా సూచనలు చేశారా? అని అధికారులను ప్రశ్నించారు. యాజమాన్యంలోని సభ్యులను విచారణలో భాగం చేయాలన్నారు.
అలాగే పరిశ్రమకు అనుమతులు భద్రతా ప్రమాణాలపై ఆరా తీశారు. గతంలో ఈ పరిశ్రమలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా అధికారులను అడిగారు. ఊహాజనిత సమాధానాలు చెప్పవద్దని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇప్పటికే తనిఖీ చేసిన అధికారులతో కాకుండా, కొత్త వారితో విచారణ జరిపించాలన్నారు.
ప్రమాద ఘటనపై నివేదిక కోసం నిపుణుల కమిటీని నియమించాలని సూచించారు. నిపుణులతో చర్చించి ఆ తర్వాత సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. కార్మికులకు బీమా సదుపాయం గురించి అడిగి తెలుసుకున్నారు. సిగాచీ పరిశ్రమకు సంబంధించిన మొత్తం సమాచారం సేకరించాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ALSO READ: నేనున్నా.. పాశమైలారం ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి
అన్ని పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రమాద సమయంలో మానవత్వంతో వ్యవహరించాలని, పరిహారం విషయంలో తీసుకున్న నిర్ణయం చెప్పాలని కంపెనీ ప్రతినిధిలను అడిగారు. దీనిపై యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీలో పని చేసే కార్మికుల నైపుణ్యాల గురించి ఆరా తీశారు ముఖ్యమంత్రి.
మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కింద లక్ష రూపాయలు, గాయపడినవారికి 50 వేలు అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచన చేశారు. వైద్య ఖర్చుకు వెనుకాడవద్దని, ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాల పిల్లలు చదువుకునేందుకు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలను నిరంతరాయంగా కొనసాగించేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తరఫున కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు మృతుల్లో ఎక్కువగా తమిళనాడు, బీహార్, జార్ఖండ్ వాసులు ఉన్నారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇప్పిస్తామని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి పరిహారం ఇప్పించేలా అధికారులు చూడాలన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇప్పిస్తాం: రేవంత్ రెడ్డి
కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి పరిహారం ఇప్పించేలా అధికారులు చూడాలి
ఇది అత్యంత విషాదకరమైన సంఘటన
– సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/nn5VQ5iJkp
— BIG TV Breaking News (@bigtvtelugu) July 1, 2025
సిగాచి మేనేజ్‌మెంట్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం
సిగాచి కంపెనీలో గతంలో ఎప్పుడైనా ప్రమాదాలు జరిగాయా అని ఆరా తీసిన సీఎం రేవంత్
మృతులకు, గాయపడినవారికి ఎలాంటి పరిహారం ఇస్తారని సిగాచి మేనేజ్మెంట్ను అడిగిన సీఎం
నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి https://t.co/Ep41YxRlj8 pic.twitter.com/h9kcXO85OS
— BIG TV Breaking News (@bigtvtelugu) July 1, 2025