వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ డిపోలో ఘోరం జరిగింది. బ్రేకులు ఫెయిల్ అయిన బస్సు ఔటింగ్‌కు వెళ్తున్న సమయంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ మెకానికల్ కుద్దూస్ ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలై ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. రిటైర్‌మెంట్‌కు సిద్ధమవుతున్న కుద్దూస్ మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్, భరోసా సెంటర్‌ను డిజిపి శివధర్ రెడ్డి ప్రారంభించారు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సెంటర్లను ఏర్పాటు చేశారు. మహిళల భద్రత, పిల్లల రక్షణ, గృహ హింస వంటి అంశాల్లో తక్షణ స్పందన, సహాయం అందించడం భరోసా సెంటర్ ప్రధాన లక్ష్యమని డీజీపీ తెలిపారు.
తిరుపతి జిల్లా పనపాకంలో భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసులు నిర్వహించిన తనిఖీలో ఒడిశాకు చెందిన వ్యక్తి బొలెరో వాహనంలో అక్రమంగా గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డాడు. 31 కిలోల గంజాయిని సీజ్ చేసి వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 6 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
విశాఖపట్నంలో ఈనెల 14,15 తేదీల్లో జరిగే.. CII పార్టనర్ సమ్మిట్ కోసం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిఐఐ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమీట్లో 40 దేశాలకు చెందిన ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో పాటు భారతదేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ న్యూ బోయినపల్లిలో మందలు మందలుగా నత్తలు కనిపిస్తున్నాయి. అయితే ఈ నత్తలు హైదరాబాద్ అంతా వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మెనింజైటిస్ అనే వ్యాధికి ఈ నత్తలే కారణమని నిపుణులు చెబుతున్నారు. మెనింజైటిస్‌తో మెదడు, నరాల పొరలకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుందని నిపుణులు తెలిపారు.
కడప జిల్లా కలశపాడు మండలంలోని కరణంవారిపల్లి పాఠశాలను అందంగా తీర్చిదిద్దడంపై మంత్రి లోకేష్ ప్రశంసలు కురిపించారు. గ్రామస్తుల సహకారంతో స్కూల్‌ను అందంగా తీర్చిదిద్దిన సెకండరీ గ్రేడ్ టీచర్ని కొనియాడారు. సింగిల్ టీచర్‌గా అడుగుపెట్టే నాటికి నలుగురు విద్యార్థులున్న పాఠశాల ఇవాళ 26 మందికి చేరడం అభినందనీయమన్నారు.
విజయవాడ కోర్టులో విధులు బహిష్కరించి న్యాయవాదులు నిరసన చేస్తున్నారు. వైసీపీ నేత, సీనియర్ న్యాయవాది గౌతం రెడ్డి వాహనంపై పెట్రోల్ దాడికి నిరసనగా.. కోర్టు ప్రాంగణంలోనే విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. గౌతమ్ రెడ్డి నివాసంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ధర్నా చేశారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. బిస్లరీ మైక్రోబాక్స్ యాజమాన్యాలు అన్యాయంగా తొలగించిన యూనియన్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. కార్మికులపై కక్ష సాధింపు చర్యలు ఆపాలని నాయకులు డిమాండ్ చేశారు.
కాకినాడ జిల్లా యానాంలో కాలం చెల్లిన బీర్ల విక్రయాలు కలకలం రేపుతున్నాయి. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని యానాంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలు.. మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కాలం చెల్లిన బీర్లను విక్రయిస్తుండగా స్థానికులు బీర్లు చేత పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఏడుగురు ఉన్నతాధికారులతో కూడిన బృందం.. నేడు, రేపు ఏపీలో మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించనుంది. బాధితులతో మాట్లాడి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేస్తామన్నారు అధికారులు.
బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరులోని సీఆర్ రెడ్డి కాలేజీ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు, స్వాతంత్ర్య సమరయోధుల నినాదంగా నిలిచిన ఈ గీతం గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
ఒకే ద్విచక్ర వాహనంపై నలుగురు ప్రయాణిస్తున్న వారిని చూసి, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తన కాన్వాయ్‌ను ఆపారు. ఇలా వెళ్లడం సరికాదంటూ బైకర్‌కు క్లాస్ తీసుకున్నారు. ప్రమాదాల గురించి హెచ్చరించి, వారిలో ఇద్దరిని తన వాహనంలో సురక్షితంగా గమ్యస్థానంలో దింపే ఏర్పాట్లు చేశారు.
మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు క్యాంపు కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు 18 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వక్కలిగ చైర్మన్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
నిద్రమత్తు, అతివేగం కారణంగా చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని పోలీసులు వెంటనే గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లిలో ఐసీడీఎస్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. పెళ్లికూతురు మైనర్ అని ఫిర్యాదు అందడంతో, వివాహం జరుగుతున్న ఫంక్షన్ హాల్‌కు తాళం వేయించారు. అనంతరం అధికారులు ఇరు కుటుంబాలకు బాల్య వివాహాల అనర్థాలపై అవగాహన కల్పించారు.
కర్ణాటకలో సీఎంను మార్పు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్యకు అధిష్టానం షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటనలో పార్టీ సీనియర్ నాయకులతో భేటీకి కాంగ్రెస్ అధిష్ఠానం సమయం ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం.
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, ఓపెన్ ఏఐ తమ వినియోగదారులకు ఉచితంగా అడ్వాన్స్‌డ్ AI మోడల్స్ అందిస్తున్నాయి. జియో యూజర్లు 18 నెలల పాటు జెమిని ప్రో, ఎయిర్‌టెల్ కస్టమర్లు ఏడాదిపాటు పర్‌ప్లెక్సిటీ ప్రీమియం, ఓపెన్ఏఐ భారతీయ వినియోగదారులందరికీ ఏడాదిపాటు చాట్‌జీపీటీ గో ప్లాన్‌లను ఉచితంగా వాడుకోవచ్చు.
తమిళనాడు రాజధాని చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఆళ్వార్‌పేట్‌లోని త్రిష నివాసంలో బాంబు పెట్టినట్లు డీజీపీ కార్యాలయానికి మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు డాగ్, బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు.
ఈనెల 14 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీమిండియా 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ వికెట్ కీపర్ పంత్ అందుబాటులోకి వచ్చాడు. మరోవైపు ధ్రువ్ జురెల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ఎవరిని ఆడించాలనేది జట్టుకు సవాల్‌గా మారింది.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అందెశ్రీ ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయని తెలిపారు. అందెశ్రీ మరణం సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటు అని మోదీ పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.