Konda Family Issue: ఓరుగల్లు కాంగ్రెస్ పాలిటిక్స్‌లో కొండా ఫ్యామిలీ కాక పుట్టిస్తోంది. ఇప్పటికే కొండా మురళి ఎపిసోడ్ సెగలు రగిలిస్తుంటే.. ఇప్పుడు మరో ఇష్యూ వచ్చి చేరింది. నేరుగా పరకాల ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ తెరపైకి వచ్చిన ఈ ఎపిసోడ్ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తీసుకోబోతోంది..? మరి.. పీసీసీ ఏం చేయబోతోంది..?
ఉమ్మడి వరంగల్ జిల్లా పాలిటిక్స్‌లో రోజుకో ట్విస్ట్
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పాలిటిక్స్ రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. ఇప్పటికే కొండా మురళీ వర్సెస్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అన్నట్లుగా సాగుతున్న వ్యవహారం ఇప్పుడు మరింత ముదిరింది. కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి ఎపిసోడ్‌తో ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిగా, ఆగ్రహంగా ఉన్నారు. రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలపై కొండా మురళి చేసిన వ్యాఖ్యల విషయంలో ఫైరయ్యారు. అంతేకాదు.. ఏకంగా పీసీసీకి కంప్లైంట్ చేశారు.
సీఎం దృష్టికి తీసుకెళ్లనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల ఫిర్యాదుతో పీసీసీ క్రమశిక్షణా కమిటీ కొండా మురళిని పిలిచి వివరణ అడిగింది. అయితే.. వివరణ ఇవ్వడం సంగతి పక్కన పెడితే తిరిగి ఎమ్మెల్యేలు, వారికి సపోర్ట్ చేస్తున్నారంటూ మంత్రి పొంగులేటి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిపై రివర్స్‌లో కంప్లైంట్ చేశారు కొండా మురళి. దీంతో.. ఆశ్చర్యపోవడం కాదు.. అవాక్కవ్వడం ఎమ్మెల్యేల వంతైందట. వెంటనే జిల్లాకు చెందిన రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి సహా పలువురు ఎమ్మెల్యేలు మరోసారి సమావేశమై కొండా మురళి ఎపిసోడ్‌పై సీరియస్‌గా చర్చించారు. పీసీసీ క్రమశిక్షణా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సింది పోయి తిరిగి తమపైనే మళ్లీ ఫిర్యాదు చేయడం ఏంటన్నది డిస్కస్ చేశారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ మొత్తం పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెరపైకి వచ్చిన మరో కీలక ఇష్యూ
అయితే.. ఇదంతా జరిగి కొన్ని గంటలు గడిచాయో లేదో కొండా కుటుంబానికి సంబంధించి మరో కీలక ఇష్యూ తెరపైకి వచ్చింది. అదే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఇప్పటికే రగులుతున్న వేడిని మరింత పెంచేలా కన్పిస్తోందన్న టాక్ విన్పిస్తోంది. కొండా ఫ్యామిలీకి సంబంధించి ఓరుగల్లు పాలిటిక్స్‌లో మరింత హీటు రాజేసిన అంశం.. కొండా సుస్మిత రాజకీయ ఆరంగేట్రం గురించి సోషల్ మీడియా ఖాతాలో కన్పించిన ఫోటో. అవును.. ఈ మేరకు కొండా సుస్మిత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బయోలో కన్పించిన మార్పుతో ఉమ్మడి వరంగల్ జిల్లా పాలిటిక్స్ మరింత హాట్‌హాట్‌గా మారాయి. పరకాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమె రేసులో ఉన్నారంటూ అర్థం వచ్చేలా కన్పించడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
పరకాలపై కొండా ఫ్యామిలీకి గట్టి పట్టు
ఈ ప్రకటన ద్వారా సుస్మితను ఎమ్మెల్యే అభ్యర్థిగా పరకాల నుంచి బరిలో దింపేందుకు.. కొండా ఫ్యామిలీ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ మంత్రిగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు కొండా సుస్మిత తల్లి కొండా సురేఖ. పాలిటిక్స్‌లో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆమె.. ప్రస్తుతం వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే.. గతంలో కొండా సురేఖ పరకాల నుంచి మూడుసార్లు విజయం సాధించారు. దీంతో.. పరకాలపై కొండా కుటుంబానికి గట్టి పట్టుందనే చెప్పాలి. అందుకే అన్నీ ఆలోచించి పరకాల నుంచి బరిలో దింపేందుకు సుస్మితకు రంగం సిద్ధం చేస్తున్నారన్న టాక్.. ఇన్‌స్టా అకౌంట్‌లో మార్పులతో తేలిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎమ్మెల్యే రేవూరిని మరోసారి టార్గెట్ చేయడమేనా..?
ఓవైపు జిల్లా రాజకీయం రగులుతుండగానే కొండా కుటుంబం ఇలా మార్పులు చేయడం వెనుక కారణం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని డైరెక్ట్‌గా టార్గెట్ చేయడమేనన్న వాదన విన్పిస్తోంది. కొండా మురళి ఇటీవలె చేసిన వ్యాఖ్యల్లో రేవూరి గురించి సైతం మాట్లాడారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవూరి తమ మద్దతు కోరడంతో ఆయనకు సపోర్ట్ చేసి గెలిపించామన్నారు కొండా మురళి. అంత సహాయం చేసినా తమకు వ్యతిరేకంగా ఇప్పుడు గ్రూపులు కట్టి పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఫైరయ్యారు మురళి. దీనిపైనే ఇప్పుడు పంచాయితీ జరుగుతోంది. ఇంకా అదే ఓ కొలిక్కి రానేలేదు. ఇలాంటి నేపథ్యంలో నేరుగా రేవూరిని టార్గెట్ చేసేలా కొండా సుస్మిత ఇన్‌స్టా బయోలో చేసిన మార్పులు ఉన్నాయని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక కొండా మురళి ఉన్నారని రేవూరి వర్గం ఆరోపిస్తోంది.
Also Read: నేనున్నా! పాశమైలారం ఘటనపై హాస్పిటల్‌కు సీఎం రేవంత్
పీసీసీ ఎలా పరిష్కరించబోతోంది..?
ఇప్పటికే ఓరుగల్లు కాంగ్రెస్‌లో నేతల మధ్య వార్ తారస్థాయికి చేరింది. ఇంకా చెప్పాలంటే జరుగుతున్న పరిణామాలు పీసీసీకి పెద్ద తలనొప్పిలా మారాయన్న టాక్ విన్పిస్తోంది. ఈ ఇష్యూను ఎలా సాల్వ్ చేద్దామని అగ్రనేతలు ప్రయత్నం చేస్తుంటే.. కొండా మురళి ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో పిడుగులాంటి వార్త.. పార్టీకి ఇప్పుడు మరింత ఇబ్బందికరంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. వీటన్నింటినీ హస్తం అగ్రనేతలు ఎలా పరిష్కరిస్తారు.. ఎప్పుడు ఉమ్మడి వరంగల్‌లో నడుస్తున్న వర్గపోరుకు పుల్ స్టాప్ పడుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.