Railway New Facility: రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇండియన్ రైల్వే ప్రయాణికుల కోసం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి రైళ్లలో ప్రయాణించేటప్పుడు అవసరమైన వస్తువుల కోసం ప్లాట్‌ఫారమ్‌లపై వెతకాల్సిన అవసరం లేకుండా, సీట్లలోనే షాపింగ్ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. నార్త్ వెస్ట్రన్ రైల్వేలోని జైపూర్ డివిజన్, 125 రైళ్లలో ఆన్‌బోర్డ్ షాపింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ వినూత్న కార్యక్రమం ప్రయాణికుల సౌలభ్యాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ సేవల ద్వారా.. ప్రయాణికులు సబ్బులు, టూత్‌బ్రష్‌లు, శానిటరీ ప్యాడ్‌లు, డైపర్‌లు, మొబైల్ ఛార్జర్‌లు, USB కేబుల్స్, స్టేషనరీ, బ్యూటీ ప్రొడక్ట్స్, పిల్లల బట్టలు, బొమ్మలు వంటి నిత్యావసర వస్తువులను నేరుగా తమ సీట్ల వద్దే కొనుగోలు చేయవచ్చు. ఇకపై ప్రయాణికులు ఏ వస్తువు కోసమైనా రైలు దిగాల్సిన అవసరం లేదు. సాయంత్రం 9 గంటల వరకు అమ్మకం దారులు ఈ సేవలను అందిస్తారు.
ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించడమే కాకుండా.. రైళ్లలో అనధికారికంగా వస్తువులను అమ్మే వారిని నియంత్రించడం. దీని కోసం.. ప్రతి రైలుకు గరిష్టంగా నలుగురు అమ్మకం దారులకు మూడు సంవత్సరాల పాటు లైసెన్స్ ఇవ్వబడుతుంది. ఇది వారి యెక్క అమ్మకాలను క్రమబద్ధీకరించడానికి అంతే కాకుండా ప్రయాణికులకు నాణ్యమైన సేవలను అందించడానికి సహాయపడుతుంది.
ధరల విషయంలో పారదర్శకతను నిర్ధారించడానికి రైల్వే కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఒకవేళ ట్రైన్ లో అమ్మకాలు చేసేవారు నిర్దేశించిన MRP కంటే ఎక్కువ వసూలు చేస్తే.. వారికి ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండాజజ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తే, వారి లైసెన్స్ రద్దు చేయబడే అవకాశం కూడా ఉంటుంది. ఇది ప్రయాణికులను అధిక ధరల నుంచి రక్షించడానికి, వారికి సరసమైన ధరలకు వస్తువులను అందుబాటులో ఉంచడానికి ఉపయోగపడుతుంది.
ఈ ఆన్‌బోర్డ్ షాపింగ్ సేవ భారతీయ రైల్వే ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడంలో ఒక కీలకమైన ముందడుగు. ఇది ప్రయాణికుల అవసరాలను తీర్చడమే కాకుండా.. ప్రయాణాన్ని మరింత సౌకర్య వంతంగా, ఆనందదాయకంగా మారుస్తుంది. రైళ్లలో ప్రయాణించే వారు ఇకపై తమ అవసరాల కోసం ఆందోళన చెందకుండా.. తమ ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు.
ఇదిలా ఉంటే.. రైల్వే ఫస్ట్ ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారి పెంపుడు జంతువులకు వివిధ రంగుల దుప్పట్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది . రైలులోని ఫస్ట్ ఏసీ కోచ్‌లో పెంపుడు జంతువులతో ప్రయాణించే వారికి ఇది ఉపశమనం కలిగించే వార్త. దీంతో ఇక నుంచి దుప్పట్ల విషయంలో ఎటువంటి అసౌకర్యం లేదా గందరగోళాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.
చాలా కాలంగా.. ఫస్ట్ ఏసీలో ప్రయాణించే ప్రయాణికులు తమ పెంపుడు జంతువులకు వాడిన దుప్పట్లు ఇస్తున్నారని ఫలితంగా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని రైల్వేకు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని.. రైల్వే ఇప్పుడు పెంపుడు జంతువులకు దుప్పట్లను అందించాలని నిర్ణయించింది. ఇది ప్రయాణీకులకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. అంతే కాకుండా రైల్వే సేవలలో పారదర్శకత, విశ్వసనీయతను కూడా పెంచుతుంది. ఈ కొత్త వ్యవస్థను త్వరలో అమలు చేస్తామని, అన్ని ఫస్ట్ ఏసీ కోచ్‌లలో దీనిని తప్పనిసరిగా అమలు చేస్తామని అధికారులు వెల్లడించారు.