మీ సమస్యలు పరిష్కరిస్తాం..
⦿ మీకు నష్టం కలిగించే పనులు ప్రభుత్వం చేయదు
⦿ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకం
⦿ ఆదాయం పెంచాలన్నా, పంచాలన్నా మీ చేతుల్లోనే
⦿ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
⦿ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
హైదరాబాద్, స్వేచ్ఛ : CM Revanth Reddy: రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వీలైనంత త్వరగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, వారికి నష్టం కలిగించే పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ, క్యాలెండర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కష్టకాలంలో బాధ్యతలు చేపట్టిందని, ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రత్యేక రాష్ట్రంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు అందరికీ తెలుసన్నారు.
అలాంటి పరిస్థితుల్లో ఒక గొప్ప అవకాశం తమకు ఇచ్చారన్నారు. తాము అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల మొదటి 1వ తేదీన జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అక్కడక్కడా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని, ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నామన్నారు. ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.18500 కోట్లు మాత్రమేనని, కానీ అది ప్రభుత్వ అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు.
అన్నీ సక్రమంగా నిర్వహించాలంటే దాదాపు రూ.30వేల కోట్లు అవసరమవుతుందని, కానీ, ప్రస్తుతం వచ్చే ఆదాయంలో రూ.6500కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాలకు చెల్లిస్తున్నామని, మరో రూ.6500 కోట్లు ప్రతీ నెల అప్పులు చెల్లించాల్సి వస్తోందని, మిగిలిన రూ.5500 కోట్లలో సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కనీస అవసరాలకు ప్రతీ నెల రూ.22500 కోట్లు కావాలని, వచ్చిన ఆదాయంతో పోలిస్తే రూ.4000 కోట్లు తక్కువ పడుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ పదేండ్ల పరిపాలన వ్యవస్థను భ్రష్టు పట్టించింది…
గత పదేండ్ల బీఆర్ఎస్ పరిపాలన వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కానీ తాము అధికారంలోకి రాగానే పరిపాలన వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏడాదిలో రాష్ట్రంలో సామాజిక మార్పును తీసుకొచ్చామని, ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకాస్త సమయం పడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పారదర్శకంగా ఖర్చు చేసేందుకు ఉద్యోగులు ఎలాంటి సలహాలు ఇచ్చినా తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆదాయం ప్రతీ నెలా మరో రూ.4,000 కోట్లు పెంచుకోవాలన్నారు. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఆదాయం పెంచాలన్నా, పంచాలన్నా మీ చేతుల్లోనే…
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలన్నా, పెంచిన ఆదాయం పంచాలన్నా ఉద్యోగుల చేతుల్లోనే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వారి సమస్యలెంటో చెబితే పరిష్కారానికి కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తుందన్నారు. సమస్యల పరిష్కారానికి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని, రాజకీయాల కోసం కొందరు నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారన్నారు. కానీ వారి ఉచ్చులో పడితే చివరకు నష్టపోవడం తప్పా ఏమీ ఉండదన్నారు.