HYDRAA: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడిన నుంచి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో సీఎం రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన హైడ్రా ఎన్నో మంచి పనులు చేసుకుంటూ ప్రజల మన్ననలను పొందుతోంది. రూ.వేల కోట్ల విలువైన భూములను గుర్తించి ఆక్రమణదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. హైడ్రా పేరు వినబడితేనే కబ్జాదారులు వణిపోతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పార్కుల స్థలాలు, చెరువుల వద్ద కబ్జాలకు గురైన భూములను గుర్తించడం.. వెంటనే అక్కడకు వెళ్లడం.. భూములను స్వాధీనం చేసుకోవడం.. ఇలా పనులు చకచకా అవుతుండడంతో హైడ్రా పనితీరు పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మురుగునీటితో కూడుకున్న చెరువుల వల్ల స్థానికులు నానా ఇబ్బందులు పడే వారు. అలాంటి చెరువులను అభివృద్ధి చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా తన పనితీరుతో ముందుకెళ్తోంది. ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై కొరడా ఝుళిపిస్తూ.. ఆక్రమణలకు గురైన భూముల విషయంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది. ముఖ్యంగా, చెరువులు, కుంటల పరిరక్షణను ఒక యజ్ఞంలా చేపట్టిన హైడ్రా గతంలో కబ్జాలకు గురైన వందలాది, వేలాది ఎకరాల విలువైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని నగరం పర్యావరణానికి కొత్త ఊపిరిని తీసుకొస్తోందని చెప్పవచ్చు.హైడ్రా ఇప్పటివరకు సాధించిన విజయాలలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రధానమైనది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సంస్థ ఇప్పటివరకు 923 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుండి విడిపించింది. దీని విలువ సుమారు రూ. 50 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. కేవలం కూల్చివేతలే కాకుండా.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డ్రోన్లు, సీసీటీవీ నిఘా ద్వారా అక్రమ నిర్మాణాలను పసిగట్టి.. వెంటనే అక్కడకు చేరుకుని తొలగిస్తుంది.
చెరువుల పరిరక్షణలో ముందంజ
నగరంలో కనుమరుగైన చెరువులను పునరుజ్జీవింపజేయడంపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. సంస్థ గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు 12 చెరువుల వరకు పునరుద్ధరణ పనులు చేపట్టి.. వాటిని ఆక్రమణల చెర నుంచి విముక్తి కల్పించింది. ఇందులో ఆరు చెరువులు పూర్తిగా అభివృద్ధికి నోచుకున్నాయి. ఆక్రమణలకు గురై, చెత్తకుప్పల్లా మారిన వాటిని సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించింది. ముఖ్యంగా.. నాలాల ఆక్రమణలను తొలగించి, పూడికతీత పనులను ముమ్మరం చేయడం వల్ల వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల ముంపు ప్రమాదం తగ్గింది.
కొన్ని ముఖ్యమైన చెరువులు..
బతుకమ్మ కుంట: ఈ చెరువును సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయడంలో హైడ్రా కృషి అద్భుతంగా ఉందని హైకోర్టు న్యాయమూర్తి సైతం ప్రశంసించారు. ఆక్రమణల నుంచి విముక్తి కల్పించడమే కాక.. స్థానికంగా వరద ముంపును తగ్గించి, భూగర్భ జలాలను పెంచింది.
మల్కం చెరువు (గచ్చిబౌలి): ఇది కూడా హైడ్రా చొరవతో ఆహ్లాదకరమైన చెరువుగా రూపాంతరం చెందింది.
బుక్ రుక్ ఉద్దౌలా చెరువు (పాతబస్తీ): చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ చెరువు పునరుద్ధరణ పనులు కూడా జరుగుతున్నాయి.
ఎర్రకుంట, నల్లకుంట, ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ వంటి ముఖ్య జలవనరుల చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా తొలగించింది.
నల్లకుంట (కూకట్‌పల్లి): సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు పునరుద్ధరణ కూడా హైడ్రా సాధించిన మరో విజయం అని చెప్పవచ్చు.
హైడ్రాకు అభినందనలు..హైడ్రా నిరంతర కృషిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి సైతం అభినందించారు. చెరువుల అభివృద్ధిని ఓ యజ్ఞంలా చేస్తోందని అన్నారు. ముఖ్యంగా బతుకమ్మ కుంట అభివృద్ధిని చూస్తే ముచ్చటేస్తోందని పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఇప్పటివరకు 5800కు పైగా ఫిర్యాదులను పరిష్కరించి, ప్రజల నుండి కూడా హైడ్రా ప్రశంసలు అందుకుంటోంది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలను పెంచడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వంటి చర్యల వల్ల హైడ్రా పనితీరు మరింత బలోపేతమవుతోంది. ప్రభుత్వ ఆస్తులను, పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో హైడ్రా ముందుకు సాగుతున్న తీరు హైదరాబాద్ నగరానికి ఆదర్శంగా నిలుస్తోంది.
ALSO READ: Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం