Bandi Sanjay: రామగుండం ప్రాంతంలో ఆలయాల కూల్చివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. రామగుండం మున్సిపల్ పరిధిలో మైసమ్మ దేవాలయాలు సహా పలు ఆలయాలను.. అధికారులు కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 46 మైసమ్మ ఆలయాలను కూల్చివేస్తారా? రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను ఎందుకు వదిలేశారు? అంటూ అధికారులను నిలదీశారు.
బండి సంజయ్ శనివారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీలకు ఫోన్‌లో హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. హిందూ దేవాలయాల పట్ల అధికారుల తీరును ప్రశ్నించిన ఆయన, 48 గంటలలోగా కూల్చివేసిన ఆలయాలను తిరిగి నిర్మించాలి. లేదంటే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులన్నింటినీ కూడా కూల్చివేయాల్సి వస్తుంది అని స్పష్టం చేశారు.
హిందూ ఆలయాలంటే అంత చులకనా? ఎంత ధైర్యం అధికారులకు? అంటూ మండిపడ్డారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలైపోగానే తాను గోదావరిఖని వస్తానన్నారు. ఆలయాలను కట్టించకపోతే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులన్నింటినీ కూల్చివేయిస్తా అని బండి సంజయ్ హెచ్చరించారు.
రామగుండం మున్సిపల్ పరిధిలో ఇటీవల రహదారి విస్తరణ పనులలో.. భాగంగా పలు చిన్న చిన్న దేవాలయాలను తొలగించినట్టు సమాచారం.
Also Read: అభిమాని బర్త్ డే గిఫ్ట్.. ట్యాంక్ బండ్ పై సీఎం రేవంత్ సైకత శిల్పం
పెద్దపల్లి కలెక్టర్ కోరిన సమగ్ర నివేదిక రావాల్సి వుంది. స్థానిక మున్సిపల్ చైర్మన్, ఇంజనీరింగ్ విభాగం వివరాలను సమకూర్చి అధికారులకు పంపినట్లు తెలుస్తోంది. అధికారులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే వివిధ పత్రికా మూలాల ద్వారా లభించిన సమాచారం బట్టి ఈ చర్యలు రహదారి విస్తరణ కారణంగా జరిగాయని, కొన్ని సందర్భాల్లో అన్వయమైన నోటీసులు అందడంతోనే తొలగింపులు చేయించినట్లు ప్రభుత్వ వర్గాల్లో తెలుస్తోంది.