మూసీ పునరుజ్జీవ యాత్ర
సీఎం రేవంత్ షెడ్యూల్ ఇదే!
⦿ నేడు మూసీ ప్రాంతంలో సీఎం పాదయాత్ర
⦿ ముందుగా యాదగిరి గుట్ట ఆలయంలో పూజలు
⦿ 11.30 గంటలకు వైటీడీఏ అధికారులతో సమీక్ష
⦿ ఒంటిగంట తర్వాత సంగెంలో యాత్ర ప్రారంభం
⦿ ప్రజలందరూ పాల్గొనాలని ఎంపీ చామల ఆహ్వానం
⦿ బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం
⦿ దమ్ముంటే మూసీ నీళ్లు తాగాలని సవాల్
హైదరాబాద్, స్వేచ్ఛ: CM Revanth Reddy: మూసీ మురుకి నీళ్లతో, హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. సరిగ్గా పంటలు పండడం లేదు. రోగాల బారిన కూడా పడుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపుతూ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో దీనిపై ప్లాన్ చేసినా వర్కవుట్ కాలేదు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే తొలి విడతగా, నగరంలో మూసీకి దగ్గరగా ఉన్న ఇళ్లను ఖాళీ చేయించింది. వారికి అనేక రకాల ప్రయోజనాలు చేకూర్చింది. ఇన్నాళ్లూ మురికి కూపంలో ఉన్న వారు, ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇళ్లలో ఉంటూ ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతూ సంతోషంగా ఉన్నారు. ఇదే క్రమంలో యాదాద్రి జిల్లా పర్యటన పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ యాత్ర చేస్తున్నారు. ఇవాళ తన పుట్టిన రోజు కావడంతో ముందుగా యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత పాదయాత్రకు చేయనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
సీఎం రేవంత్ షెడ్యూల్
– సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హెలికాప్టర్‌లో ఉదయం 9 గంటలకు బేగంపేట్ నుంచి యాదగిరి గుట్టకు బయలుదేరతారు.
– ఉ. 10 గంటలకు శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారు.
– స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజల తర్వాత 11.30 గంటలకు ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
– మధ్యాహ్నం 1.30 గంటలకు రోడ్డు మార్గంలో వలిగొండ మండలం సంగెం గ్రామం చేరుకుంటారు.
– మూసీ పరివాహక ప్రాంత రైతులతో నది వెంట పాదయాత్ర ద్వారా భీమలింగం, ధర్మారెడ్డి కాలువలను సందర్శిస్తారు.
– మూసీ పరివాహక ప్రాంత రైతులతో సమావేశం అవుతారు సీఎం. మురికి కూపంలో కొట్టుమిట్టాడుతున్న రైతుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు.
– రైతులతో సమావేశం అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారని చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Also Read: Twist In Kamalapuram Village: నేనే పరమశివుడిని అన్నాడు.. పారిపోయాడు.. అంతా షాక్!
కేసీఆర్, కేటీఆర్‌కు సవాల్
మూసీ ప్రక్షాళనపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. వారంతా ఓ గంట సేపు మూసీ నదిలో నిలబడాలని సవాల్ చేశారు. రైతులు, ప్రజలు పడుతున్న బాధను, పరిస్థితిని వివరించేందుకే సీఎం పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. మూసీ ప్రక్షాళన చేస్తానని కేసీఆర్ మోసం చేశారని, పైగా తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేశారని అన్నారు.