EPAPER

CM Revanth Reddy: మా ప్రభుత్వానికి ఎవరిమీద కోపం లేదు.. కానీ,… : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: మా ప్రభుత్వానికి ఎవరిమీద కోపం లేదు.. కానీ,… : సీఎం రేవంత్ రెడ్డి

– మింగిన సొమ్ము తీస్తే మూసీ మిషన్ సెట్
– పేదల ఇండ్ల కోసం కొట్లాడిన నేత కాకా
– ఆయన స్ఫూర్తితోనే ముందుకెళుతున్నాం
– మూసీ మీద బీఆర్ఎస్‌వి మొసలి కన్నీళ్లు
– పదేళ్లలో దోచింది బయటికి తీయండి
– కేసీఆర్, కేటీఆర్, హరీష్ అఫిడవిట్లే దోపిడీకి సాక్ష్యం
– మూసీ రివర్‌ఫ్రంట్ ఆలోచన మీది కాదా?
– నాటి సర్కారులో మంత్రిగా ఈటల లేరా?
– సబర్మతీలా మూసీ ప్రక్షాళన చేయొద్దా?
– పెద్దలు ఫామ్‌హౌజ్‌ల్లో.. పేదలు మురుగులోనా?
– పేదల బతుకులు మార్చేందుకే మూసీ ప్రక్షాళన
– మూసీపై రాజకీయం వద్దు.. సలహాలతో రండి
– కాకా వెంకటస్వామి జయంతి సభలో సీఎం


హైదరాబాద్, స్వేచ్ఛ: మూసీ నిర్వాసితుల విషయంలో బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీళ్లు కార్చుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శనివారం రవీంద్ర భారతిలో జరిగిన కాకా వెంకటస్వామి జయంతి కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మూసీ నిర్వాసితులు సమస్య, బీఆర్ఎస్ నేతల దీక్షలు, హైడ్రా తదితర అంశాలపై మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు గత పదేళ్లలో దోచుకున్న సొమ్మును బయటికి తీసి మూసీ నిర్వాసితులకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. దివంగత వెంకటస్వామి(కాకా) సూచన మేరకు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు గతంలో పెట్టారని..ఆయన ఆశయ సాధనకు తుమ్మిడిహెట్టి వద్ద ఆ ప్రాజెక్టును నిర్మించి అదిలాబాద్ జిల్లాకు సాగుతాగునీరు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త… త్వరలోనే..


మార్పు వద్దా?

‘ఈ రోజున హైదరాబద్ నగరంలో 1200, 1400 ఫీట్ బోర్ వేయకుండా ఎక్కడా నీళ్లు రావడం లేదు. హైదరాబాద్ నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. గ్రౌండ్ వాటర్ పడిపోయింది. హైదరాబాద్ మురికితో మూసీ నిండిపోయి ఆ విషవాయువులు నల్గొండ ప్రజలకు విషంగా మారుతోంది. నల్గొండని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? మరోవైపు చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాలకు గురయ్యాయి. ఇక, మూసీ కూడా కబ్జా అయిపోతే అనంతగిరి నుంచి వచ్చే వరద నీటిని హైదరాబాద్ ఎలా భరించగలుగుతుంది? ఈ అంశాలను గుర్తించే మా ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు పూనుకుంది. ఈ మార్పు అవసరమా కాదా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.

పేదల బాధ తెలుసు..

రెండు దశాబ్దాల పాటు విపక్షంలో పనిచేసిన నేతగా పేదల కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసునని, ముఖ్యంగా జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో కట్టుకున్న గూడు చెదిరిపోతే, ఆ బాధ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసునని, అందుకే వారందరినీ తగిన విధంగా ఎలా ఆదుకోవాలో విపక్షాలు ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని కోరుతున్నామని సీఎం పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి ఎవరిమీదా కోపం కానీ, పట్టింపులు కానీ లేవని, కేవలం ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. అవసరమైతే రేస్ కోర్సుని బయటకు తరలించి అక్కడి 150 ఎకరాల స్థలంలో పేదలకు పక్కా ఇళ్లు కట్టించొచ్చని, లేకపోతే అంబర్ పేట పోలీస్ అకాడమీని సిటీ బయటకు తరలించి అక్కడున్న 200 ఎకరాలు స్థలంలో మూసీ నిర్వాసితులకు ఇళ్లు కట్టించొచ్చని రేవంత్ రెడ్డి అన్నారు.

ఫామ్‌హౌజ్ భూములివ్వండి..

అటు బీఆర్ఎస్‌పై కూడా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దోపిడీ చేసిన సొమ్ములో పదోవంతు బయటికి తీసి ఖర్చు పెట్టినా మూసీ నిర్వాసితుల జీవితాలు బాగుపడతాయని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్‌లో బ్యాంకుల్లో రూ.1500 కోట్లున్నాయని, అందులో వీలైతే ఒక రూ.500 కోట్లు ఇవ్వటమో లేదా గజ్వేల్‌లో కేసీఆర్ వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ భూముల్లో సగం ఇచ్చినా, అందులో మూసీ నిర్వాసితులందరికీ ప్రభుత్వం తరపున ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తానని ప్రకటించారు. అలాగే, కేటీఆర్ జన్‌వాడలోని 50 ఎకరాల్లో 25 ఎకరాలిచ్చినా, 10 అంతస్థుల్లో బాధితులందరికీ ప్రభుత్వ సొమ్ముతో ఇల్లు కట్టిస్తానని అన్నారు.

ఆ అఫిడవిట్లే సాక్ష్యం

బీఆర్ఎస్‌కి టీవీలు, పేపర్లు, పార్టీ ఆఫీసులు, ఫాం హౌస్‌లు ఎలా వచ్చాయో, లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో, ఈ కుటుంబం ఎంత అక్రమంగా సంపాదించిందో 2004లో కేసీఆర్ ఎలక్షన్ అఫిడవిడ్, 2005 హరీశ్ రావు ఎలక్షన్ అఫిడవిట్, 2009లో కేటీఆర్ ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే అర్థమవుతుందని, ఇవేవీ వారి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు కాదని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పేద విద్యార్థులు ప్రాణాలను, ఉద్యమకారులు ఆస్తులను కోల్పోతే, ఈ కుటుంబం ఆస్తులు మాత్రం గుట్టలుగుట్టలుగా పెరిగిపోయాయని విమర్శలు చేశారు. ‘మీరైతే వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లలో రాజుల్లా బతుకుతారు గానీ, తెలంగాణ పేదలు మాత్రం మూసీ మురుగులో దుర్భర జీవితాలు గడపాలా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: గాంధీ భవన్‌లో బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న జగ్గారెడ్డి

సలహాలతో రండి..

మూసీ సమస్యపై హైదరాబాద్ ఇంచార్జి మినిస్టర్ పొన్నం ప్రభాకర్‌తో సహా కీలక నేతలతో మాట్లాడి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని సూచించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. పేదల ఇండ్ల కోసం పోరాడిన కాకా వెంకటస్వామి స్ఫూర్తితో విపక్షాలు ముందుకొచ్చి సలహాలు ఇవ్వాలని, అవసరమైతే ప్రభుత్వ కమిటీలో కేటీఆర్, ఈటల రాజేందర్‌ని కూడా సభ్యులుగా పెడతామన్నారు. మూసీ నిర్వాసితులకు నష్టపరిహారం, ప్రత్యామ్నాయంగా పక్కా ఇళ్లు కట్టించటం మెరుగైన ఉపాధినివ్వటం, పిల్లలకు మంచి పాఠశాలలు కట్టించటం వంటి వాటిపై వారి సలహాలు ఇవ్వాలన్నారు. లేదంటే లేదంటే ఇలానే వదిలేసి మూసీని మూసేయాలంటారేమో కూడా చెప్పాలని సెటైర్ వేశారు.

ఈటలా.. మాట్లాడండి

గుజరాత్‌లో మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా, నాటి ప్రభుత్వం 64 వేల కుటుంబాలను వేరే ప్రాంతాలకు తరలించి, సబర్మతి రివర్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసిందని, అందులో కేవలం 16 వేల మందికే నష్టపరిహారం ఇచ్చారని సీఎం గుర్తుచేశారు. మరి.. అలాంటి గుజరాత్‌ మోడల్‌ అద్భుతమంటూ చప్పట్లు కొట్టే ఈటల రాజేందర్‌కి మన హైదరాబాద్‌లో మూసీ రివర్ ఫ్రంట్ కట్టుకుంటే వచ్చే కష్టమేమిటో చెప్పాలని నిలదీశారు. గత ప్రభుత్వంలో ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడే మూసీ ఆక్రమణలను తొలగించానలి జీవో ఇచ్చారని, అప్పుడు అడ్డుకోని ఆయన ఇప్పుడెందుకు అడ్డుపడుతున్నారని నిలదీశారు.

Related News

Lady Aghori : ఆత్మార్పణ అంటూ మూడు రోజులుగా హల్ చల్.. చివరికి ఏమైందంటే.?

PCC Chief Mahesh Goud : అందరికీ అభివృద్ధి.. ఇదే రాహుల్ లక్ష్యం – పీసీసీ చీఫ్ మహేశ్

Telangana University : యూనివర్సిటీల ప్రక్షాళనకు సీఎం రేవంత్ సన్నాహాలు

Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్లకో యాప్

New Metro Line : మెట్రో రెండో దశ పనుల్లో కీలక పురోగతి.. ఈ మార్గాల్లో పనులు ప్రారంభం

Asiruddin Owaisi : నా టార్గెట్ బీఆర్ఎస్.. త్వరలోనే అన్నీ బయటపెడతా – అసరుద్దీన్

MP Dharmapuri : కులగణన సర్వేకు బీజేపీ మద్ధతు.. ఎంపీ ధర్మపురి ఆసక్తికర కామెంట్స్

Big Stories

×