
Telangana Elections : కాంగ్రెస్ పార్టీలో ఈసారి కదనోత్సాహం కనిపిస్తోంది. సోనియా గాంధీ హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కసారిగా హస్తానికి బూస్టప్ ఇచ్చాయి. తక్కువ అసంతృప్తులు, తక్కువ వివాదాలతో టిక్కెట్ల డిస్ట్రిబ్యూషన్ ను ముగించింది. ఈసారి దీపావళి వెలుగులు తమ పార్టీకే ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు. సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటే కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం అంతా తెలంగాణ ప్రచారంపైనే ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ కు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చి పడేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ఈసారి గెలుపు ఖాయమన్న సంకేతాలతో జోష్ లో కనిపిస్తోంది. జనం మైండ్ సెట్ కాంగ్రెస్ వైపు మారిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ వ్యూహాలకు ప్రతివ్యూహాలతో కదులుతోంది కాంగ్రెస్ దండు. గ్రూప్ వార్ పెద్దగా లేకుండా, అసంతృప్తి రాగాలు హైపిచ్ లో లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. వీటికి తోడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి., కేసీఆర్ ను అన్ని విషయాల్లో కార్నర్ చేస్తున్నారు. కేసీఆర్ ను ఢీకొట్టేందుకు స్వయంగా కామారెడ్డి బరిలో దిగారు. కామారెడ్డి భూములపై కేసీఆర్ కన్నేశారని వీటి నుంచి విముక్తి చేసేందుకే తాను కామారెడ్డి వచ్చినట్లు కౌంటర్లు ఇస్తున్నారు. అంతే కాదు.. ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూపై కేసీఆర్ కు రిటర్న్ కౌంటర్ వేశారు రేవంత్. ఎవరేంటో తేల్చుకుందామన్నారు.
ఎన్నికల్లో గెలవాలంటే ఎలా డీల్ చేయాలో ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా కాంగ్రెస్ చేస్తూ వచ్చింది. ప్లానింగ్, పర్‌ఫెక్షన్, ఎగ్జిక్యూషన్ అన్నీ పద్ధతి ప్రకారం చేస్తూ వస్తున్నారు. నిజానికి గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీలో చాలా మార్పు కనిపిస్తోంది. ఎవరికి వారే అన్నట్లు కాకుండా బలం పెరగడంతో బలగం కలిసినట్లే అనిపిస్తోంది. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకునే పరిస్థితి చాలా వరకు తగ్గింది. టీపీసీసీ చీఫ్ ను విమర్శించే వాళ్లు. కానీ సోనియా, రాహుల్ ప్రియాంక హైదరాబాద్ పర్యటనలు, నేతలకు కౌన్సెలింగ్‌లతో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఎన్నికల సమయంలో టికెట్ రాకపోతే చేసే రచ్చ మామూలుగా ఉండేది కాదు. కానీ గత కొంత కాలంగా ఆ పార్టీ నేతల వైఖరిలో కొంత మార్పు కనిపిస్తోంది. నాయకులు కాస్త కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. మునుపటితో పోలిస్తే ఉద్రిక్తతలు తగ్గాయి. నేనే సీఎం అన్న మాటలపై ఆచితూచి రియాక్ట్ అవుతున్నారు. సీఎం నిర్ణయించేది హైకమాండే అంటున్నారు.
అభ్యర్థుల ఎంపికలో అధిష్ఠానం నిర్ణయాలు నచ్చని మాజీ మంత్రులు నిరసనలు తెలిపి ఆ తర్వాత బీఆర్‌ఎస్ గూటికి చేరిపోయారు. అతి కొద్దిమంది రెబల్స్‌గా బరిలో దిగినా.. వారితో అధిష్ఠానం సంప్రదింపులు కొనసాగిస్తోంది. వారూ తమ రాజీనామాలు ఉపసంహరించుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుజ్జగించేందుకు జానారెడ్డి నేతృత్వంలో బుజ్జగింపుల కమిటీ పెట్టినా.. ఇప్పుడు ఏకంగా కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగి అందరికీ సర్ది చెబుతున్నారు. మంచి భవిష్యత్ ఉంటుందని చెబుతున్నారు. ఆశావహులు, అసంతృప్తులకు అధిష్ఠానం ఇచ్చిన హామీలకు తోడు.. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రానుందన్న ప్రచారం ఉధృతంగా ఉండడం, పబ్లిక్ నుంచి అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో చాలా మంది నేతలు రెబల్ గా మారేందుకు వెనకాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, ఏదో ఒక అవకాశం రాకుండా పోతుందా అన్న టాక్ కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. పార్టీ నిర్ణయానికి విధేయులుగా ఉంటే.. ప్రభుత్వం వచ్చాక ప్రాధాన్యం లభిస్తుందనుకుంటున్నారు.
అభ్యర్థుల జాబితాలో ఈసారి కాంగ్రెస్ పలు మార్పులు చేసింది. తొలుత అభ్యర్థిని ప్రకటించి.. కొన్ని రోజుల తర్వాత మార్చింది. వనపర్తి అభ్యర్థిగా మాజీ మంత్రి చిన్నారెడ్డిని ప్రకటించిన అధిష్ఠానం.. ఆ తర్వాత నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని మేఘారెడ్డికి టికెట్ ఇచ్చింది. మూడు నాలుగు దశాబ్దాలపాటు పార్టీకి సేవలందించిన సీనియర్ నేత విషయంలో ఇలాంటి నిర్ణయం జరిగితే గతంలోనైతే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగేవి. కానీ చిన్నారెడ్డి కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినా ఆ తర్వాత అనుచరులను వారించి మేఘారెడ్డికి మద్దతు ప్రకటించారు. అలాగే, గత ఎన్నికల్లో తుంగతుర్తిలో స్వల్ప తేడాతో ఓటమిపాలైన టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌కు ఈసారి సీటు దక్కలేదు. అయితే తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానంటూ దయాకర్ ప్రకటన చేశారు. పటాన్‌చెరులో నీలం మధును కాదని కాటా శ్రీనివాస్ గౌడ్‌కు టికెట్ ఇచ్చారు. అటు సూర్యాపేటలో రేవంత్ రెడ్డి సన్నిహితుడు పటేల్ రమేశ్ రెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. తీవ్రస్థాయిలో ఒత్తిళ్ల మధ్య రాంరెడ్డి దామోదర్ రెడ్డికే ఇక్కడ టికెట్ ప్రకటించారు. దాంతో, ఇప్పుడు పటేల్ రమేశ్ రెడ్డి రెబల్ గా బరిలో దిగారు. ఇలాంటి వారితో నామినేషన్ ఉపసంహరించేలా చర్చలు జరిపే ఛాన్స్ ఉందంటున్నారు.
ఆశావహులను, అసంతృప్తులను కట్టడి చేయడంలో కేసీ వేణుగోపాల్ కీలకంగా వ్యవహరించారు. వారిని ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడి తగిన హామీలిస్తూ దారికి తెచ్చుకోవడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. నిజానికి, ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావో.. రేవో అన్నట్లుగా మారడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అధిష్ఠానం పకడ్బందీగా చేపట్టింది. గెలుపు అవకాశాలు, ఆర్థిక సామర్థ్యాలను అధిష్ఠానం పెద్దలు పరిగణనలోకి తీసుకున్నారు. సర్వేలనూ ప్రాతిపదికగా చేసుకుని ఎంపిక ప్రక్రియ చేపట్టారు. వీటి ప్రాతిపదికన అనేకచోట్ల సీనియర్ నేతలను సైతం కాదని కొత్తవారిని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారినీ అభ్యర్థులుగా ఎంపిక చేయాల్సి వచ్చింది. టిక్కెట్ రాని వారికి పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత గౌరవం దక్కుతుందంటూ ఏఐసీసీ పెద్దలే స్వయంగా హామీ ఇవ్వడంతో చాలా వరకు అసంతృప్తులు సైలెంట్ అయ్యారు
ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 34 టికెట్లు ఇవ్వాలని బీసీ నేతలు ఒత్తిడి చేసినా.. చివరకు 23 సీట్లే దక్కాయి. దీనిపై పలువురు బీసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయగా.. ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఆ మేరకు ఎమ్మెల్సీలు, ఇతర అవకాశాలు ఇస్తామంటూ ఏఐసీసీ పెద్దలు హామీ ఇచ్చారు. దీంతో వారూ సైలెంట్ అయ్యారు. అలాగే, మూడో జాబితా విడుదలకు ముందు కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌కు వచ్చి బుజ్జగింపుల ప్రక్రియ చేపట్టారు. NSUI, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులైన శివసేనారెడ్డి, బల్మూరి వెంకట్‌కు సీట్లు కేటాయించలేదు. దీంతో వారిని పిలిపించుకుని మాట్లాడారు. మొత్తంగా వ్యూహాత్మకంగా వ్యవహరించింది హైకమాండ్.
Pawan Kalyan: ఓడిపోయాను..ఫెయిల్యూర్ పొలిటిషీయన్ ను.. నెక్ట్స్ ఏంటి..?