Hyderabad: పట్టపగలే జరిగిన రౌడీ షీటర్ హత్య హైదరాబాద్ జగద్గిరిగుట్టలో కలకలం రేపింది. ఈ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. ట్రాన్స్‌జెండర్ అత్యాచార కేసుకు సంబంధించిన పాత పగలే ఈ దారుణ హత్యకు దారితీసినట్లు విచారణలో తేలింది. బుధవారం సాయంత్రం జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద రౌడీ షీటర్ రోషన్ సింగ్ (25) దారుణ హత్యకు గురయ్యాడు. మరో రౌడీ షీటర్ బాలశౌరి రెడ్డి, అతని అనుచరులు ఆదిల్, మహమ్మద్‌లతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రోషన్‌ను కత్తులతో అతి కిరాతకంగా పొడిచి, అనంతరం బులెట్ బండిపై అక్కడి నుండి పరారయ్యారు.
పోలీసుల విచారణలో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 15 రోజుల క్రితం, మృతుడు రోషన్ సింగ్, మరో ఆరుగురు మిత్రులు కలిసి ఓ ట్రాన్స్‌జెండర్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం ఆ ట్రాన్స్‌జెండర్‌కు డబ్బు చెల్లించే విషయంలో రోషన్ సింగ్ గ్యాంగ్‌లో గొడవ జరిగింది. దీంతో బాధితురాలు బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తనపై కేసు పెట్టాల్సిందిగా ఆ ట్రాన్స్‌జెండర్‌ను బాలశౌరి రెడ్డే ఉసిగొల్పాడని రోషన్ సింగ్ కక్ష్య పెంచుకున్నాడు. ఈ క్రమంలో, బాలశౌరి రెడ్డిని ఎలాగైనా చంపేస్తానని రోషన్ సింగ్ తన స్నేహితులతో చెప్పాడు. ఈ విషయం బాలశౌరి రెడ్డి చెవిన పడింది. “వాడు నన్ను చంపడమేంటి, నేనే వాడిని చంపుతా” అని పగబట్టిన బాలశౌరి రెడ్డి, నిన్న తన మిత్రులు ఆదిల్, మహమ్మద్‌లతో కలిసి రోషన్ సింగ్‌పై దాడికి ప్లాన్ వేశాడు. బస్టాండ్ వద్ద మాటామాటా పెరగడంతో, మహమ్మద్ వెనకనుండి రోషన్‌ను పట్టుకోగా, బాలశౌరి రెడ్డి కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన రోషన్ సింగ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
సంఘటనా స్థలంలో, సోషల్ మీడియాలో లభించిన విజువల్స్ ఆధారంగా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వివరాలను వెల్లడిస్తూ, మృతుడు రోషన్ సింగ్‌తో పాటు, నిందితులు బాలశౌరి రెడ్డి, ఆదిల్, మహమ్మద్‌లపై కూడా గతంలో పలు కేసులు ఉన్నాయని, వీరందరూ రౌడీ షీటర్లేనని తెలిపారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ పేర్కొన్నారు.