మరో ఉద్యమానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. హైకమాండ్ ఆదేశాల మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. నిన్న ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్ది.. సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యారు. అందులో నరేగా పథకానికి కేంద్రంలోని బీజేపీ సవరణలు చేయడంపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని తీర్మాణం చేశారు.అందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు అటు కేంద్రంలోని బీజేపీ.. రాష్ట్రంలోని కమలనాథులపై ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని జాతీయ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉపాధి హామీ చట్టాన్ని ఇటీవల జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశంలో కేంద్రం ‘జీ రామ్ జీ’ పేరిట మారుస్తూ పలు సవరణలు చేసింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పేరును సైతం మార్పు చేసింది. ఇక ఉపాధి హామీ దినాలను 100 నుంచి 120కు పెంచింది. ఈ ఒక్క విషయం ఉపాధి కూలీలకు మేలు చేసేదే అయినప్పటికీ రాష్ట్రాలపై భారం వేసింది. గతంలో 100 శాతం ఉపాధి హామీ కూలీ నిధులను కేంద్రమే కేటాయించేది. కానీ, ఇప్పుడు 40 శాతం నిధులు రాష్ట్రాలు చెల్లించాలని, మిగతా 60 శాతం మాత్రమే కేంద్రం నిధులు ఇస్తుందని ఆ చట్టంలో పలు సవరణలు చేసింది. దీనిపై దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలు మినహా మిగత ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
కేంద్రం తీసుకొచ్చిన జీ రామ్ జీ చట్టం వలన రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ.1500 కోట్ల భారం పడనుందని అధికారులు అంచనా వేశారు. అందులోనూ పని గ్యారెంటీపైనా కేంద్రం స్పష్టత నివ్వలేదని తెలుస్తున్నది. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు తీవ్రంగా నష్టపోతారని తెలుస్తున్నది. ఎందుకంటే కరువు పనికి వెళ్లేవారిలో 90 శాతానికి పైగా వారే ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ విషయంపై సీరియస్‌గా దృష్టి సారించింది. నరేగా రద్దు అనేది దేశసమాఖ్య నిర్మాణంపై ప్రత్యక్ష దాడిగా కాంగ్రెస్ లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. కాంగ్రెస్ తెచ్చిన ‘ఎంఎన్ఆర్‌ఈజీఏ’ వలన గ్రామీణ భారతం బలంగా ఉండేందని పేర్కొన్నారు.కేంద్రం ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయంతో పేదలు, రాష్ట్రాల హక్కులు బలహీనపడుతాయని, అంతర్జాతీయంగా పేరొందిన చట్టాలన్ని బీజేపీ ఎలా రద్దు చేస్తుందని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మాణం మేరకు వచ్చే నెల 5వ తేదీన దేశవ్యాప్తంగా నరేగా స్కీం రద్దునకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం కూడా భాగస్వామి కానుంది. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నరేగా రద్దును సమర్థిస్తుండగా.. ఆ పార్టీ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున నిరనన కార్యక్రమాలు తెలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు రాష్ట్రం నిరసనను కేంద్రానికి అర్ధం అయ్యేలా చేయాలని రాష్ట్ర నాయకత్వం కూడా భావిస్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు వచ్చాక దీనిపై పూర్తి స్థాయి కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తున్నది. కాగా, నరేగా రద్దుకు ప్రతిపక్షాల నుంచి కూడా మద్దతు లభిస్తుందని కాంగ్రెస్ ఆశిస్తున్నది.