భాగ్యనగరంలో మూగజీవాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బాగోతం బట్టబయలైంది. వీధి కుక్కల రక్తాన్ని తీసి విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై సైబరాబాద్ మున్సిపల్ అడిషనల్ కమిషనర్ యాదగిరిరావు సంచలన విషయాలు వెల్లడించారు. రాయదుర్గం కేంద్రంగా వెంకటేష్ యాదవ్ అనే వ్యక్తి గత పదేళ్లుగా ఈ అక్రమ దందాను సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఏప్రిల్ 14 నుండి ఈ ఆసుపత్రిపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో లోతైన విచారణ జరిపిన మున్సిపల్ బృందం చివరకు ఆసుపత్రిని సీజ్ చేసింది. విచారణలో తేలిన అంశాలు చూస్తుంటే నివ్వెరపోక తప్పదు.
ఈ ఆసుపత్రి నిర్వాహకులు వీధి కుక్కలను పట్టుకొచ్చి వాటి నుండి అమానవీయంగా రక్తాన్ని సేకరిస్తున్నట్లు రుజువైంది. ఒక్కో వీధి కుక్క నుండి రెండు మూడు సార్లు రక్తం తీసి వాటికి ఆహారం పెట్టి మళ్లీ రక్తం సేకరించేవారు. చివరకు ఆ కుక్కల శరీరంలో రక్తం లేదని తేలిన తర్వాత వాటిని నగర శివారు ప్రాంతాల్లో నిర్దాక్షిణ్యంగా పడేసేవారు. పెట్ హాస్పిటల్ కు వచ్చే కస్టమర్లను భయపెట్టి వారి పెంపుడు జంతువులకు అత్యవసరంగా రక్తం ఎక్కించాలని నమ్మించేవారు. ఇలా సేకరించిన ఒక్కో యూనిట్ రక్తాన్ని 30 వేల నుండి 60 వేల రూపాయల వరకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నట్లు విచారణలో తేలింది.
వెంకటేష్ యాదవ్ ప్రభుత్వ పశువైద్యుడిగా పని చేస్తూనే నిబంధనలకు విరుద్ధంగా మూడు ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రాయదుర్గంతో పాటు ఎల్బీనగర్ మియాపూర్ ప్రాంతాల్లోని ఆసుపత్రులపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ అక్రమ దందాపై ఢిల్లీ నుండి మేనకా గాంధీ సైతం స్పందిస్తూ అధికారులకు ఈమెయిల్ పంపడం ఈ కేసుకు ఉన్న తీవ్రతను తెలియజేస్తోంది. అధికారులు సీజ్ చేయడానికి వెళ్లిన సమయంలో నిర్వాహకులు పైరవీలు చేస్తూ అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఆధారాలు పక్కాగా ఉండటంతో చర్యలు తప్పలేదు. ట్రేడ్ లైసెన్స్ కూడా లేకుండా నిర్వహిస్తున్న ఈ దందాపై సెక్షన్ 521 అలాగే 622 ప్రకారం కేసు నమోదు చేశారు.
ఈ వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాతే వీరు ట్రేడ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం వారి అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. మొత్తం 74 పేజీల సమగ్ర నివేదికను అధికారులు సిద్ధం చేశారు. కేవలం ఇవే కాకుండా నగరంలోని అన్ని పెట్ హాస్పిటల్స్ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు అడిషనల్ కమిషనర్ యాదగిరిరావు హెచ్చరించారు. మూగజీవాల పట్ల క్రూరంగా వ్యవహరిస్తూ నిబంధనలు ఉల్లంఘించే ఏ ఆసుపత్రినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. త్వరలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయని ఈ అక్రమ దందాలో భాగస్వాములైన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు. పెంపుడు జంతువుల యజమానులు అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి మోసపూరిత ఆసుపత్రుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.
ALSO READ: అంతలోనే అనూహ్య మలుపు.. విజయ్‌కు గవర్నర్ అపాయింట్‌మెంట్, హాట్ టాపిక్‌గా తమిళ రాజకీయాలు