Rajagopal Reddy : మునుగోడు ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్, బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నాయని మొదటి నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇరుపార్టీలు పోటాపోటీగా డబ్బులు పంచుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే సమయంలో అనేక చోట్ల భారీగా డబ్బు పట్టుబడుతోంది. నగదు పంపిణీ విషయంలో టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి నోటీసు జారీ చేసింది. వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
రాజగోపాల్‌రెడ్డి దాదాపు రూ.5.24 కోట్లను స్థానిక వ్యాపారులు, వ్యక్తులకు చెందిన 22 బ్యాంకు ఖాతాలకు మళ్లించారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆ డబ్బంతా మునుగోడు ఉపఎన్నికల్లో పంపిణీ చేయడం కోసమేనని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పలు ఆధారాలను ఈసీకి సమర్పించారు. డబ్బులు డ్రా చేయక ముందే ఆ 22 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని కోరారు. ఇలా భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ వెంటనే చర్యలు ప్రారంభించింది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి నోటీసు జారీ చేసింది. ఇప్పటికే ఎన్నిక సంఘం అటు మంత్రి జగదీష్ రెడ్డికి నోటీసు ఇచ్చింది. ఎక్కడా మాట్లాడ వద్దని ఆంక్షలు విధించింది. ఇలా అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ నేతలు ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి గెలవాలని ప్రయత్నించడంపై సామాన్యులు మండిపడుతున్నారు.
మరోవైపు హైదరాబాద్ నుంచి మునుగోడుకు భారీ నగదు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా తరలించే క్రమంలో చాలా చోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. బేగంబజార్‌లో రూ.48.50 లక్షలు, పంజాగుట్టలో రూ.70 లక్షలు, నగర శివారులో రూ.45 లక్షలు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ పరిధిలో మూడు రోజుల క్రితం ఒకే రోజు పోలీసులకు పట్టుబడిన హవాలా సొమ్ము ఇది. 15 రోజుల వ్యవధిలో 3 పోలీసు కమిషనరేట్ల పరిధిలో సుమారు రూ.20-25 కోట్ల మేర అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టుబడినట్టు అంచనా.
మునుగోడు ఉపఎన్నికను రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లకు పంచేందుకు భారీగా నగదును తరలిస్తున్నాయి. బేగంబజార్, గోషామహల్, అబిడ్స్, సికింద్రాబాద్, తిరుమలగిరి ప్రాంతాల్లోని గోదాముల్లో భారీగా నగదు చేర్చినట్టు ప్రచారం జరుగుతోంది. నాలుగైదు రాష్ట్రాల వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో పరిచయం ఉన్న హవాలా దళారులు నగరంలో భారీగా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలే నమ్ముకుని ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అందరికంటే ముందే ప్రచారం చేపట్టారు. ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరుగుతున్నారు. ఎలాంటి వివాదాలు, ఆరోపణలకు తావులేకుండా కాంగ్రెస్ అభ్యర్థి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకేనేమో చండూరు బహిరంగ సభలో బీజేపీపై విమర్శలు గుప్పించిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రస్తావన తీసుకురాలేదు.మరి మునుగోడు ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి మరి.