
Medigadda Barrage Issue : కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలులేవని నీటిపారుదల శాఖ జనరల్ ఈఎన్ సీ మురళీధర్ తేల్చి చెప్పారు. ఎక్కడో చిన్న పొరపాటు జరిగిందన్న ఆయన.. ఏడవ బ్లాక్ లో సమస్య వల్ల సెంటర్ పిల్లర్ కుంగిందని వెల్లడించారు. ఇసుక వల్ల సమస్య వచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు.
శనివారం రాత్రి మేడిగడ్డ బ్యారేజ్ 20వ పిల్లర్ భారీ శబ్ధంతో కుంగిపోవడం కలకలం రేపింది. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ మధ్య పగుళ్లురాగా.. 7వ బ్లాక్‌లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు గేట్లు ఎత్తి డ్యామ్ లోని నీటిని దిగువకు విడుదల చేశారు. మరోపక్క బ్యారేజ్ కుంగిపోవడంతో ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. కుంగుబాటు వల్ల ఏర్పడిన నష్టం, బ్యారేజీ పటిష్ఠత తదితర అంశాలపై ఆరా తీసింది.
ఇక ఇదే అంశంపై హైదరాబాద్‌లోని జలసౌధలో కేంద్రం ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏడో బ్లాక్ లో సమస్య వల్ల సెంటర్ పిల్లర్ కుంగిందని.. ఇసుక వల్ల సమస్య వచ్చిందని అనుకుంటున్నామని అనుమానం వ్యక్తం చేశారు నీటిపారుదల శాఖ జనరల్ ఈఎన్ సీ మురళీధరన్. క్వాలిటీ ఆఫ్ సాండ్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనుమతులు ఉన్నాయన్నారు. కాపర్ డ్యామ్‌కి వరద తగ్గాక నవంబరు చివరలో సమగ్ర పరిశీలన జరుపుతామని తెలిపారు.
మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో బీఆర్ఎస్ సర్కార్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. కావాలనే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలి.. 130 మంది చనిపోయారని.. వందల మంది గాయపడ్డారని ఆయన గుర్తు చేశారు. గుజరాత్ ఘటనపై ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే దానిపై ప్రతిపక్షాలు విమర్శిస్తునే ఉన్నాయని మండిపడ్డారు.